ప్రయోజనాలు, రిజర్వేషన్లపై పడే ప్రభావంపై వివరణ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వ శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ల హక్కుల చట్టం అమలు కారణంగా పుట్టుకతో (జీవశాస్త్ర పరంగా) మహిళలైన వారికి రాజ్యాంగపరంగా, చట్టపరంగా లభిస్తున్న ప్రయోజనాలు, రిజర్వేషన్లపై పడే ప్రభావంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, న్యాయ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు, ఇతర ప్రత్యేక సదుపాయాలకు ఈ చట్టం వల్ల విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ‘ఉమెన్స్ డిక్లరేషన్ ఇంటర్నేషనల్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది.
ట్రాన్స్‌జెండర్ల చట్టం వల్ల స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళా జైళ్లలో వారికి వసతి, క్రీడా పోటీల్లో వారి భాగస్వామ్యం తదితర అంశాలపై పడే ప్రభావాన్ని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అరెస్టులు, సోదాలు, నేర విచారణల సమయంలో మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా లభించే చట్టపరమైన రక్షణల విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ఇదీ చదవండి: షాకిచ్చిన కర్ణాటక : లీటరు పాల ధర రూ. 8 పెంపు
రాజ్యాంగ ప్రయోజనాలను హరించకూడదు
ట్రాన్స్‌జెండర్ల గుర్తింపునకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ చట్టం– 2026’ నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులతోపాటే ఈ తాజా పిటిషన్‌ను కూడా ధర్మాసనం జత చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ అఖిల్ సిబల్ వాదనలు వినిపించారు. ట్రాన్స్‌జెండర్లకు లభించే హక్కులు జీవశాస్త్రపరంగా మహిళలైన వారికి మాత్రమే కేటాయించిన రాజ్యాంగ ప్రయోజనాలను హరించేవిగా ఉండకూడదని పేర్కొన్నారు. పంచాయతీల్లో మహిళల కోసం రిజర్వ్ చేసిన స్థానాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా పోటీ పడతారా? లేక వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉందన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ట్రాన్స్‌జెండర్ల చట్టంపై ఇప్పటికే దాఖలైన కేసులకు సంబంధించి ప్రభుత్వ వివరణను సిద్ధం చేస్తున్నామని, అందులోనే తాజా పిటిషన్‌లో లేవనెత్తిన ఆందోళనలకు కూడా సమాధానం ఇస్తామని ధర్మాసనానికి విన్నవించారు.
ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?


