తిరువనంతపురం : కేరళంలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తికి కేరళం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అక్టోబర్ 25న కొచ్చిలో మెర్సిడెస్ బెంజ్ కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిరు వ్యాపారి జయబాలకృష్ణన్ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఆ న్యాయమూర్తికి సంబంధించినది కావడం, హిట్ అండ్ రన్‌కు పాల్పడింది జడ్జి కుమారుడే కావడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 55 ఏళ్ల జయబాలకృష్ణన్ కుమార్తె మీడియా ముందుకు వచ్చి న్యాయ వ్యవస్థ తీరుపై, పోలీసుల వ్యవహారశైలిపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సదరు జడ్జికి కేరళం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై మృతుడి కుమార్తె భద్రకీర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన తండ్రి మరణానికి కారు నడిపిన మైనర్ నిందితుడు, ప్రమాద సమయంలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడానికి సహకరించిన ఆ జడ్జి ఇద్దరూ సమాన బాధ్యులేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి కారణమైన లగ్జరీ కారు అదనపు జిల్లా జడ్జికి చెందినది కావడంతో ఈ కేసుకు సంబంధించి మొదట్నుంచీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నిందితుడైన మైనర్‌కు (జడ్జి కుమారుడికి) స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిందితుడు న్యాయమూర్తి కుమారుడు కాబట్టే నిబంధనలను పక్కనబెట్టి క్షణాల వ్యవధిలో బెయిల్ ఇచ్చేశారు’అని బాధితురాలి కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు.
హిట్ అండ్ రన్‌కు ముందు మైనర్ నిందితుడు ప్రమాదానికి కారణమైన మెర్సిడెస్ బెంజ్ కారుతో 200 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్న వీడియోల్ని పోస్టు చేశారు. తాను డ్రైవింగ్ చేస్తున్న వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసి ఆ అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేశారని ఆమె ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, ముగ్గురు పారిపోయారని, ఆ తర్వాత అక్కడకు ఒక ఫార్చ్యూనర్ కారు కూడా వచ్చింది. ఇదే విషయాన్ని ప్రత్యక్ష సాక్షి మాకు చెప్పారు. జడ్జి, పోలీసుల భయం కారణంగా సదరు వ్యక్తి బయటకు రావడానికి భయపడుతున్నాడని వాపోయారు.
తాను ఎన్‌సీసీ కేడెట్‌గా శిక్షణ పొంది పోలీసు శాఖలో చేరాలని కలలు కన్నానని, కానీ ఈ ఘటనలో పోలీసుల ఏకపక్ష, పక్షపాత వైఖరి చూశాక ఆ వ్యవస్థపై తన నమ్మకం పూర్తిగా సడలిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. కారు తాళాలు మైనరైన తన కొడుకుకి ఎలా అందాయని నిలదీస్తే, జడ్జైన తండ్రి నిర్లక్ష్యంగా సమాధానం దాటవేశారని, కేవలం యజమానిగా మాత్రమే కాకుండా కొడుకు తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న ఆ జడ్జిని కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
న్యాయమూర్తి వాదన
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తన కుమారుడు తనకు తెలియకుండానే కారు తీసుకువెళ్లాడని, కాబట్టి తనకు తెలియని నేరానికి తనను బాధ్యుడిని చేయలేమని ఆ న్యాయమూర్తి వాదించారు. న్యాయమూర్తి చెబుతున్న ఈ వెర్షన్‌ను భద్రకీర్తి తీవ్రంగా ప్రశ్నించారు. అంతకుముందు ఆయన స్వయంగా మాట్లాడుతూ, తన కుమారుడు యూట్యూబ్ వీడియోలు చూసి డ్రైవింగ్ నేర్చుకున్నాడని చెప్పారని ఆమె గుర్తు చేశారు.
ఇదీ చదవండి : మెర్సిడెస్ కారుతో జడ్జి మైనర్ కొడుకు బీభత్సం


