అమ్మమ్మ ఇసుక పలక | Kerala 85-year-old Indira Amma turns sand into a classroom | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ ఇసుక పలక

Oct 28 2026 4:23 AM | Updated on Oct 28 2026 4:23 AM

Kerala 85-year-old Indira Amma turns sand into a classroom

న్యూస్‌మేకర్‌

‘ఏటి ఒడ్డున ఇసుకలో అక్షరాలు దిద్ది చదువు నేర్చుకున్నాం’ అని గతంలో చెప్పేవారు.ఆ దిద్దుబాట నేటికీ పాటించి చదువు చెప్తున్న అవ్వ కేరళలో ఉంది. 85 ఏళ్ల ఇందిరమ్మ రూపాయి ఖర్చు లేకుండా పర్యావరణానికి  నష్టం చేయకుండా కేవలం ఇసుకను బ్లాక్‌బోర్డ్‌గా మార్చేసి గత పదేళ్లుగా అక్షరాలు దిద్దిస్తోంది. అలప్పుజలోని ఒక పల్లెటూరిలో, తన ఇంటి వరండానే అక్షరాల గుడిగా మార్చిన ఈమె కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

ఈ అమ్మమ్మ క్లాస్‌రూమ్‌ స్టైల్‌ చాలా వినూత్నమైనది, అత్యంత సహజమైనది. ఒక బకెట్‌ నిండా ఇసుక తెచ్చుకోవడం, దాన్ని నేలపై తివాచీలా పరచడం, ఒక చిన్న కర్రముక్కతో ఇసుకను సమానంగా సర్దడం... అదే కర్రముక్కతో అక్షరాలను రాసి పిల్లలకు చూపించడం వారి చేత దిద్దించడం. అయితే ఈ వయసులో ఆమె కేవలం మాతృభాష మలయాళం మాత్రమే నేర్పడం లేదు. ఆ ఇసుక పలకపై పిల్లలకు మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌... అది కూడా కర్సివ్‌ రైటింగ్‌తో సహా, బేసిక్‌ మ్యాథమేటిక్స్‌ నేర్పిస్తోంది. అమ్మమ్మ ఇసుకపై రాస్తుంటే, ఎదురుగా కూర్చున్న పిల్లలు తమ చిరు వేళ్లతో ఆ ఇసుకపైనే అక్షరాలను దిద్దుతూ ప్రాక్టీస్‌ చేస్తారు. అందరూ ఆమెను ‘ఆశాట్టి అమ్మమ్మ’ అని ప్రేమగా పిలుచుకుంటారు.

‘ఆశాన్‌ కలరి’ సంప్రదాయానికి పునర్జీవం!
కేరళలో విజయదశమి నాడు పిల్లల చేత బియ్యంలోనో, ఇసుకలోనో అక్షరాలు దిద్దించి విద్యార్థిగా మార్చే ప్రాచీన సంప్రదాయాన్ని ‘ఎళుత్తినిరుత్తు’ (విద్యారంభం) అంటారు. పూర్వం పల్లెటూరి ప్రాథమిక పాఠశాలలను ‘ఆశాన్‌ కలరి’ (ప్రైమరి స్కూల్‌) అని పిలిచేవారు. కాలక్రమేణా మాయమవుతున్న ఈ సాంప్రదాయ విద్యావిధానాన్ని ఇందిరమ్మ మళ్లీ బతికించింది. స్మార్ట్‌బోర్డులు, వేల రూపాయల కార్పొరేట్‌ ఫీజులు లేని ఈ ఓపెన్‌–ఎయిర్‌ క్లాస్‌రూమ్‌లో పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు.. ప్రకృతితో మమేకమవ్వడం, నైతిక విలువలను కూడా నేర్పుతోంది. నిన్న మొన్న కాకుండా గత పదేళ్లుగా  స్థానిక పల్లెటూరి పిల్లలకు రూపాయి ఆశించకుండా ఆమె ఈ సేవ చేస్తుండడం విశేషం.

స్పర్శ ముఖ్యం
ఈ ‘ఇసుక చదువు’ వెనుక అద్భుతమైన సైన్స్ ఉందని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. పిల్లలు కేవలం కంటితో చూడడమే కాదు, ఇసుక టెక్సచర్‌ను తాకుతూ వేళ్లతో రాయడం వల్ల వాళ్ల నరాల వ్యవస్థ ఉత్తేజితమై బ్రెయిన్‌ మ్యాపింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది. ఇది డిజిటల్‌ స్క్రీన్ల కన్నా ఎంతో పవర్‌ఫుల్‌. అంతేకాదు, పెన్సిల్‌తో రాసి రబ్బర్‌తో తుడిచే పని లేదు, పేజీలు చిరిగే భయం లేదు. తప్పు దొర్లిందా.. అలా ఇసుకపై చేయి తిప్పేసి, మళ్లీ ఫ్రెష్‌గా రాసేసుకోవడమే! దీని వల్ల పిల్లల్లో తప్పుల పట్ల భయం పోయి అన్ లిమిటెడ్‌ ప్రాక్టీస్‌ అలవడుతుంది. కాగితాలు వాడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ సాగుతున్న ఈ ‘జీరో–వేస్ట్‌ ఎడ్యుకేషన్‌’ నేటి విద్యావ్యవస్థకు ఒక కనువిప్పు.

`Mom of Safaachiii` అనే ఇన్ స్టాగ్రామ్‌ యూజర్‌ అక్టోబర్‌ 24న పోస్ట్‌ చేసిన ఒక చిన్న వీడియో ద్వారా ఇందిరమ్మ నిశ్శబ్ద విద్యాయజ్ఞం ప్రపంచానికి తెలిసింది. ‘విద్యకు డబ్బుతో పని లేదు.. మంచి ఆలోచన, నేర్పాలనే తపన ఉంటే చాలు’ అని నిరూపించిన ఇందిరమ్మ నిజంగానే ఒక ‘సూపర్‌ అమ్మమ్మ’. టెక్నాలజీ మాయలో పడి నైపుణ్యాలు కోల్పోతున్న నేటి తరానికి, మట్టిని తాకుతూ అక్షరాలు దిద్దే ఈ అమ్మమ్మ గురుకులం ఒక అద్భుతమైన మార్గదర్శి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement