మెర్సిడెస్ కారుతో జడ్జి మైనర్ కొడుకు బీభత్సం | Kerala Accident, Judge 17 Year Old Son Kills Man With Mercedes Benz, Released On Station Bail, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ కారుతో జడ్జి మైనర్ కొడుకు బీభత్సం

Oct 26 2026 9:02 AM | Updated on Oct 26 2026 9:42 AM

Kerala Judge Minor Son Rams Mercedes-Benz Into Scooter

తిరువనంతపురం : కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జడ్జి కుమారుడు మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో సృష్టించిన బీభత్సంలో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఖరీదైన కారుతో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో.. సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, క్షణాల వ్యవధిలోనే అరెస్టయిన నిందితుడు, వెంటనే స్టేషన్‌ బెయిల్‌పై బయటికి రావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసుల వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారు జామున సుమారు 2:20 గంటలకు చెరనల్లూరులోని కంటైనర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మంజిలి ప్రాంతానికి చెందిన జయబాలకృష్ణన్ (రోడ్డు పక్కన కిరాణా స్టోర్‌ నిర్వహిస్తుంటాడు ) తన పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా.. లైసెన్స్ లేని మైనర్ జడ్జి కొడుకు.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుతో స్కూటర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు స్కూటర్ పూర్తిగా ధ్వంసమవగా.. జయబాలకృష్ణన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సరదాగా కారు తీసుకున్నా
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మైనర్‌ నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యా‍ప్తులో బెంజ్‌ కారు త్రిస్సూర్‌లోని స్థానిక కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జడ్జి పేరు మీద రిజిస్టరై ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 17 ఏళ్ల జడ్జి కుమారుడు కారు నడిపాడు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను తల్లిదండ్రులకు తెలియకుండా, కేవలం సరదాగా కారు తీసుకున్నానని, ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటం వల్ల స్కూటర్ అకస్మాత్తుగా రూటు మార్చుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని బాలుడు పేర్కొన్నాడు. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. మద్యం మత్తులో ఉన్నాడా లేదా అని నిర్ధారించడానికి రక్త నమూనాలు సేకరించగా.. ప్రాథమిక నివేదికలో నెగెటివ్ వచ్చింది.

కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు 
నిందితుడి తండ్రి న్యాయమూర్తి కావడంతో దర్యాప్తు ప్రభావితమవుతోందని బాధితుడి కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లైసెన్స్ లేని మైనర్‌కు కారు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్‌లో ఆ జడ్జి వీరంగం సృష్టించాడు. తమతో దురుసుగా ప్రవర్తించారని, పిడికిలి బిగించి బెదిరించేలా వచ్చారని బంధువులు ఆరోపించారు. ప్రమాద స్థలంలో కారు ఫోటోలు తీయకుండా తమను అడ్డుకున్నారని, మొబైల్ ఫోన్‌లోని ఫోటోలను బలవంతంగా తొలగించారని మృతుని సోదరుడు సెల్వరాజ్ వాపోయారు. ఎఫ్‌ఐఆర్‌లో కీలక వివరాలు సరిగ్గా నమోదు చేయలేదని ఆరోపించారు. మరోవైపు, దర్యాప్తు పారదర్శకంగానే సాగుతోందని, చట్టపరంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఉద్రిక్తత.. బిర్యానీ తిని ఇద్దరు చిన్నారులు మృతి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement