అక్కడ పొగమంచు కమ్మితే.. వణుకు పుట్టాల్సిందే! అసలేం జరిగిందంటే? | England Pendle Hill Witch Trials Mystery | Sakshi
Sakshi News home page

అక్కడ పొగమంచు కమ్మితే.. వణుకు పుట్టాల్సిందే! అసలేం జరిగిందంటే?

Oct 27 2026 1:06 PM | Updated on Oct 27 2026 1:48 PM

England Pendle Hill Witch Trials Mystery

అర్ధరాత్రి వేళ దట్టమైన పొగమంచు.. చుట్టూ ఎవరూ లేని నిశ్శబ్దం.. అడుగడుగునా ఏదో తెలియని భయం! ఇంగ్లండ్‌లోని పెండిల్‌ హిల్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని, అలాగే 400 ఏళ్ల క్రితం ఇక్కడ మంత్రవిద్య ఆరోపణలతో పలువురికి ఉరిశిక్ష విధించినట్లుగా, అప్పటి నుంచి ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో వింత కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఈ భయానికి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం!

లాంకషైర్‌ ప్రాంతంలో ఉన్న పెండిల్‌ హిల్‌ సముద్ర మట్టానికి సుమారు 557 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ తరచూ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పరిసరాలు రహస్యంగా కనిపిస్తాయి. కొండపై చివరగా కరిగే మంచు మంత్రగత్తె ఆకారంలో కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. చరిత్రకారుడు స్టీఫెన్‌ ఓల్డ్‌ఫీల్డ్‌ అభిప్రాయం ప్రకారం.. 'ఈ ప్రాంతంలోని చీకటి కొండలు, వాతావరణం, పాత కథలు ఇలాంటి నమ్మకాలకు కారణమవుతున్నాయి. అయితే, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు'.

12 మందిపై విచారణ.. తొమ్మిది మందికి ఉరి..
1612లో అలిజన్‌ డివైస్‌ అనే మహిళను కలిసిన జాన్‌ లా అనే వ్యాపారి కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుమారుడు అప్పటి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ మొదలవడంతో అలిజన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు, మరికొందరిపై మంత్రవిద్య ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఇంగ్లండ్‌లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నవారికి కఠిన శిక్షలు విధించేవారు.

ఈ కేసులో మొత్తం 12 మంది విచారణను ఎదుర్కొన్నారు. తొమ్మిదేళ్ల బాలిక జెన్నెట్‌ డివైస్‌ ఇచ్చిన సాక్ష్యం అప్పట్లో కీలకంగా మారింది. చివరకు తొమ్మిది మందికి ఉరిశిక్ష విధించారు. ఆలిస్‌ గ్రే నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ జెన్నెట్‌ ప్రెస్టన్‌ను యార్క్‌షైర్‌లో ఉరితీయగా, ఎలిజబెత్‌ సదరన్స్‌ తీర్పు వెలువడకముందే మరణించిందని చరిత్రకారులు చెబుతున్నారు.

గ్రామాల్లో కనిపించే పాత గుర్తులు
పెండిల్‌ హిల్‌ సమీపంలోని న్యూచర్చ్‌-ఇన్‌-పెండిల్‌, బార్లీ, రఫ్‌లీ గ్రామాలు ఈ చరిత్రతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడి పురాతన ఇళ్లు, పచ్చని కొండలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొన్ని ఇళ్ల తలుపుల వద్ద గుర్రపు నాడాలు, బయట హోలీ చెట్లు కనిపిస్తాయి. గతంలో ఇవి దుష్టశక్తుల నుంచి కాపాడతాయని ప్రజలు నమ్మేవారు. అయితే న్యూచర్చ్‌లోని సెయింట్‌ మేరీస్‌ చర్చి సమాధుల ప్రాంగణంలో ఉన్న పెద్ద రాతి సమాధిని కొందరు ‘మంత్రగత్తెల సమాధి’గా పిలుస్తున్నారు. కానీ అది ఆనాటి మంత్రగత్తె​ ఆలిస్‌ నట్టర్‌కు చెందినదని నిర్ధారించే ఆధారాలు లేవని చరిత్రకారుడు ఓల్డ్‌ఫీల్డ్‌ చెబుతున్నారు.

రచయితలను ఆకర్షిస్తున్న వింత వాతావరణం
చర్చిలోని గోపురంపై ‘దేవుని కన్ను’ ఆకారంలో ఓ గుర్తు కనిపిస్తుంది. దీన్ని గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేశారనే నమ్మకం ఇప్పటి స్థానికుల్లో బటంగా నాటుకుపోయింది. అయితే, దీనికి చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవు. పెండిల్‌ మంత్రగత్తెల విచారణల నేపథ్యంలో రచనలు చేసిన రచయిత్రి స్టేసీ హాల్స్‌.. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఈ కొండ వింతగా, కొంత భయపెట్టేలా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక మార్గదర్శకుడు స్టీఫెన్‌ ఎంట్‌విస్టిల్‌ కూడా ఈ ఘటనల్లో మోసం, అబద్ధాలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు కలిసిపోయాయని పేర్కొన్నారు.

చరిత్రను తెలుసుకునేందుకు ప్రత్యేక దారులు
2012లో మంత్రవిద్య విచారణలకు 400 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘పెండిల్‌ విచెస్‌ వే’, ‘లాంకషైర్‌ విచెస్‌ వాక్‌’ పేర్లతో ప్రత్యేక నడక మార్గాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అప్పటి ఘటనలతో సంబంధం ఉన్న ప్రాంతాలను పర్యాటకులు సందర్శించవచ్చు. లాంకాస్టర్‌ నగరంలోని పాత కోటలో నిందితులను బంధించిన జైలు గదులను కూడా చూడవచ్చని ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులు తెలియజేస్తున్నారు.

అలాగే, గోల్డెన్‌ లయన్‌ పబ్‌లో ఉరిశిక్షకు ముందు నిందితులు చివరిసారిగా మద్యం తాగారనే కథ ప్రచారంలో ఉంది. అయితే, దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. 1736లో ఇంగ్లండ్‌లో మంత్రవిద్యను నేరంగా పరిగణించే చట్టాన్ని రద్దు చేశారని రచయితలు స్పష్టం చేస్తున్నారు.

పెండిల్‌ హిల్‌ నేడు ప్రకృతి అందాలు, పురాతన గ్రామాలు, చారిత్రక ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. దెయ్యాల గురించి ప్రచారంలో ఉన్న కథలకు ఆధారాలు లేకపోయినా, 1612లో మంత్రవిద్య ఆరోపణలతో పలువురు ప్రాణాలు కోల్పోవడం చరిత్రలో నమోదైంది. అప్పటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, భయాలు, అనుమానాలు సాధారణ ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి. అయితే 'ఈ ప్రాంతం చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే.. సరైన ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించకూడదు. అలాగే, ఒకప్పుడు అనుమానాలే పలువురి ప్రాణాలను బలిగొన్నాయని' ఇప్పటికే సందర్శించిన పలువురు పర్యాటకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రెండో ప్రపంచ యుద్ధం నాటి వీరుడు ..! ఆ శతాధిక వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement