తెలంగాణ రైతులకు అలర్ట్‌.. రబీ సాగులో ఈ జాగ్రత్తలు తప్పనిసరి! | Telangana Prepares For El Niño Impact, Horticulture University Recommends Water Saving Measures, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు రావా? తెలంగాణకు కొత్త సవాల్‌!

Oct 27 2026 8:43 AM | Updated on Oct 27 2026 9:48 AM

El-Nino Telangana Rabi Vegetable Cultivation

సాగుబడి

స్వాతి కార్తె: అక్టోబర్‌ 24 నుంచి

పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి కూరగాయల దిగుమతికి అవకాశాలు మృగ్యం

రైతుల రక్షణ, నీటి సంరక్షణ, కూరగాయల లభ్యతకు సకాలంలో కార్యాచరణ అవసరం

ఈ సీజన్‌లో అనువైన మెట్ట భూములతో పాటు మాగాణి భూముల్లో కూరగాయల సాగుకు ప్రత్యేక ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక కీలక సవాలుగా నిలుస్తోంది. రైతుల జీవనోపాధిని కాపాడటం, పరిమిత నీటి వనరులను సంరక్షించటం, కూరగాయలు, పండ్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశాలు. జలాశయాల్లో నీటి నిల్వలపై ఒత్తిడి, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రబీ సాగుకు రాష్ట్రం ముందస్తు ప్రణాళికతో, శాస్త్రీయ దృక్పథంతో సిద్ధం అవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన 2026–27 రబీ కార్యాచరణ ప్రణాళిక సమయోచిత మార్గదర్శకంగా నిలుస్తోంది.

పొరుగు రాష్ట్రాల  కూరగాయలు రావు
కూరగాయలు ప్రజల పోషకాహారానికి, ఆహార భద్రతకు, రైతుల ఆదాయానికి కీలకమైనవి. అయితే, 2026లో ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి 15–20% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి సరఫరా ఆశించలేం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో ధరలు పెరిగి వినియోగదారులపై భారం పడే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో రబీ సీజన్లో కూరగాయల సాగు విస్తరణ ప్రత్యేక వ్యూహాత్మక అవసరంగా మారింది. భూముల నీటి లభ్యత, స్థానిక వాతావరణం, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాలు కూరగాయల సాగుకు అత్యంత అనువైనవి. టొమాటో, వంకాయ, మిరప, బెండ, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు వంటి పంటలు డ్రిప్‌ ఇరిగేషన్, మల్చింగ్‌ వంటి నీటి పొదుపు పద్ధతులతో సాగు చేయవచ్చు.

విదేశీ కూరగాయల దిగుమతులూ కష్టమే
కూరగాయల దిగుమతులు కూడా స్థిరంగా ఉండకపోవచ్చు. గత సంవత్సరాల్లో భారత్‌ అమెరికా, చైనా వంటి దేశాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ఎల్‌నినో ప్రభావం, రవాణా ఖర్చులు, జియోపొలిటికల్‌ సమస్యల కారణంగా సరఫరా తగ్గే అవకాశం ఉంది. పాకిస్తాన్, చైనా సరఫరా ఇప్పటికే తగ్గిపోయింది. అందువల్ల తెలంగాణలో సాధారణ కూరగాయల విస్తీర్ణంతో పాటు, వరి మాగాణి భూముల్లో కూరగాయల సాగు విస్తరణ వినియోగదారుల భారం తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాత్మక పరిష్కారం అవుతుంది. ఇందుకు జిల్లా స్థాయిలో నీటి లభ్యతను అంచనా వేసి, అనువైన ప్రాంతాలను గుర్తించి, నాణ్యమైన విత్తనాలు, నాటే సామగ్రి సకాలంలో అందించాలి.

రైతులకు ప్రదర్శన ΄్లాట్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం, మార్కెట్‌ డిమాండ్‌తో అనుసంధానం చేయడం, నిల్వ, రవాణా, విక్రయ సదుపాయాలను మెరుగుపరిస్తే ఈ వ్యూహం విజయవంతం అవుతుంది. మొత్తంగా, ఎల్‌నినో ప్రభావం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా ఆశించలేని పరిస్థితి ఉన్నందున, తెలంగాణలో కూరగాయల సాగు విస్తరణ ఆహార భద్రతకు, రైతుల ఆదాయానికి, వినియోగదారుల రక్షణకు అత్యవసరమైన వ్యూహాత్మక చర్యగా నిలుస్తుంది.

ఈ కూరగాయల సాగు మేలు
మా విశ్వవిద్యాలయం టొమాటో వంకాయ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, కూరబొబ్బర, స్నాప్‌ మెలన్, మునగ వంటి పంటల అనువైన రకాలు, హైబ్రిడ్ల సాగును సూచిస్తోంది. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి తక్కువ కాలంలో చేతికొచ్చే ఆకుకూరలు కూడా అదనపు అవకాశాలను అందిస్తాయి. విశ్వవిద్యాలయం విడుదలచేసిన కూర బొబ్బర వంటి పంటలు సుమారు రెండు నెలల్లోనే కోతకు వస్తాయి.

ఆకుకూరలు సాధారణంగా 30–45 రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి. క్రమపద్ధతిలో విత్తటం, నాటటం ద్వారా రైతులు త్వరగా ఆదాయం పొందటమే కాకుండా మార్కెట్‌కు నిరంతర సరఫరాను కొనసాగించవచ్చు. దీనివల్ల ఒకేసారి అధిక దిగుబడి మార్కెట్‌కు చేరి ధరలు పడిపోవడాన్ని కూడా కొంతవరకు నివారించవచ్చు.

ప్రతి నీటి బొట్టూ అపురూపమే
రబీ కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచటం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించుకుంటూ అధిక ఉత్పత్తి సాధించటం ప్రధాన లక్ష్యం కావాలి. నీటి కొరత ఉన్న పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలో అధికంగా నీరు పెట్టటం వల్ల వృథా పెరుగుతుంది. ఎత్తయిన మడులు, బిందు సేద్యం, మల్చింగ్, డ్రిప్‌ ద్వారా ద్రవరూప ఎరువుల సరఫరా వంటి పద్ధతులు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి, కూలీల అవసరాన్ని తగ్గించి, పంటల ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి. ఈ పద్ధతుల ద్వారా నీటి పొదుపుతో పాటు పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతులకు శిక్షణ, సకాలంలో సాగునీటి పరికరాల లభ్యత ద్వారా ఈ సాంకేతికతలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి.

ఇదీ చదవండి: పక్షులను చూస్తే.. మెదడుకు ఇంత మేలా? పరిశోధనలు ఏమంటున్నాయంటే!

పండ్ల తోటలకు ప్రత్యేక సూచనలు
పండ్ల తోటల రైతులకు కూడా ప్రత్యేక మార్గదర్శకత్వం అవసరం. మామిడి తోటల్లో నీటి సరఫరాను అవసరానికి అనుగుణంగా నిర్వహించటం, కొమ్మల సాంద్రతను నియంత్రించటం, అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టటం ముఖ్యం. జామ, సీతాఫలం, సిట్రస్‌ పండ్లు, ద్రాక్ష, అరటి తదితర పంటల్లో తేమ సంరక్షణ, సేంద్రియ మల్చింగ్, సమర్థవంతమైన నీటి నిర్వహణ ఉపయోగకరంగా ఉంటాయి. పూత, కాయల అభివృద్ధి వంటి కీలక దశల్లో అవసరమైన రక్షణాత్మక నీటి తడులు ఇవ్వటం ద్వారా తీవ్ర నష్టాలను నివారించవచ్చు. ఆయిల్‌ పామ్‌ సాగును మాత్రం ఏడాది పొడవునా నీటి లభ్యతకు భరోసా ఉన్న ప్రాంతాల్లోనేప్రోత్సహించాలి. నీటి భద్రత లేని ప్రాంతాల్లో సాగు విస్తరణకుప్రోత్సాహం ఇవ్వటం సముచితం కాదు.

బాధ్యతాయుతంగా పురుగుమందులు వాడాలి
వాతావరణ మార్పులను తట్టుకునే సమగ్ర పంటల యాజమాన్యం కూడా అవసరం. రైతులు చీడపీడల ఉనికిని క్రమం తప్పకుండా గమనించాలి. పొలంలో పరిశుభ్రత పాటించటం, పంట అవసరాలకు అనుగుణంగా పోషకాలను అందించటం, పురుగుమందులను బాధ్యతాయుతంగా వినియోగించటం ముఖ్యం. అవసరమైనప్పుడు మాత్రమే, సిఫారసు చేసిన మోతాదుల్లో, తగిన రక్షణ పరికరాలతో మొక్కల సంరక్షణ మందులను వాడాలి. కోతకు ముందు పాటించాల్సిన నిరీక్షణ వ్యవధిని తప్పనిసరిగా అనుసరించాలి. స్థానిక వాతావరణ సమాచారం, డిజిటల్‌ వ్యవసాయ సలహాలు రైతులకు అందుబాటులో ఉంటే నీటి తడులు, మందుల పిచికారీ, కోత సమయాలను మరింత సమర్థంగా నిర్ణయించుకోవచ్చు.

రైతు కేంద్రంగా కార్యాచరణ
ఎల్‌నినో వాతావరణ అనిశ్చితిని పెంచవచ్చు. కానీ, సరైన ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ సలహాలు, సమన్వయంతో కూడిన చర్యల ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. తెలంగాణలో ఉద్యాన శాస్త్ర పరిజ్ఞానం, విభిన్న పంటలు, నీటి నిర్వహణను మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయి. 2026–27 రబీ కార్యాచరణ ప్రణాళిక ఈ దిశగా ఒక బలమైన పునాది. ఇప్పుడు అవసరమైనది దాని సకాలపు అమలు, నిరంతర పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం.

తెలంగాణ ఉద్యాన రంగ భవిష్యత్తు ఎంత భూమిలో సాగు చేస్తున్నామనే అంశంపైనే కాకుండా, అందుబాటులో ఉన్న నీటిని ఎంత వివేకంగా వినియోగిస్తున్నాం. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎంత సమర్థంగా రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతు కేంద్రంగా రూపొందిన సమన్వయ కార్యాచరణ రైతుల జీవనోపాధిని కాపాడటమే కాకుండా కూరగాయల లభ్యతను పెంచి, పోషకాహార భద్రతను బలోపేతం చేసి, తెలంగాణలో వాతావరణ మార్పులను తట్టుకోగల ఉద్యాన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి తోడ్పడుతుంది.

- డాక్టర్‌ డి.రాజిరెడ్డి, వైస్‌ చాన్స్‌లర్, శ్రీ కొండా లక్ష్మణ్‌, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement