మగసంతానం కోసం భార్యను చంపిన భర్త
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ పరిధి షెల్ఫీనగర్‌లో మగ సంతానం కోసం భార్యను ఓ భర్త హత్య చేశాడు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా లాలపల్లి గ్రామానికి చెందిన న్యాతరి చంద్రయ్య కుమార్తె స్వరూపతో కరీంనగర్‌కు చెందిన దావు చంద్రకుమార్‌కు 18 ఏళ్ల క్రితం వివాహమైంది.
వివాహమైన 12 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోవడంతో మరో వివాహం చేసుకుంటానంటూ భార్యను చంద్రకుమార్ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో ఆ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. అయినప్పటికీ మగ సంతానం కావాలంటూ మద్యం తాగి వచ్చి తరచూ భార్యను కొట్టేవాడు. ఆదివారం రాత్రి కూడా స్వరూపను తీవ్రంగా వేధించాడు.
అత్తామామలకు ఫోన్ చేసి స్వరూపను తీసుకెళ్లాలని లేకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. సోమవారం ఉదయం తమ కుమార్తె అపస్మారక స్థితిలో ఉందనే సమాచారంతో కుటుంబసభ్యులు వచ్చారు. స్వరూపను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కూతురును భర్తే గొంతునులిమి హత్య చేశాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: అనుమానంతోనే అర్ధాంగి హత్య


