కేరళలో 2013లో నమోదైన కేసులో నిందితురాలిగా ఉండి, 13 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా ఉన్న 44 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. నిందితురాలి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా అక్టోబర్ 21న ఆమెను అరెస్ట్ చేయగా, కోర్టులో బెయిల్ లభించిన తర్వాత పిల్లలతో రెండు రోజులు గడిపారు.
కాసర్‌గోడ్ జిల్లాలోని చీమేణి ప్రాంతానికి చెందిన ఆ మహిళను పతనంతిట్ట జిల్లాలోని తిరువల్లలో చిత్తరిక్కల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2013లో తనకు అప్పటికి 12 ఏళ్ల వయసున్న కుమారుడిపై దాడి చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. బాలల న్యాయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వైవాహిక వివాదంతో మొదలైన కేసు
ఆ మహిళ తన భర్తతో కలిసి చీమేణిలో నివసించేవారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె చిత్తరిక్కల్ సమీపంలోని కంబలూరులో కుట్టు దుకాణం నిర్వహించేవారు. 2013లో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, అప్పటికి 12 ఏళ్ల వయసున్న కుమారుడు తండ్రితో కలిసి చిత్తరిక్కల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తల్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం ఆమె రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. ఇదిలా ఉండగా, ఆమె భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారు. కుమారుడు తండ్రి వద్దే ఉండగా, కుమార్తెను నానమ్మ పెంచారు.
వృద్ధురాలికి సంరక్షకురాలిగా పని
పోలీసులు చేపట్టిన తాజా దర్యాప్తులో భాగంగా కొచ్చిలోని ఒక నర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆమె ఆచూకీ గుర్తించారు. ఆ ఏజెన్సీ ద్వారా తిరువల్లలో ఒక వృద్ధురాలికి సంరక్షకురాలిగా ఆమె పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
అక్కడే 13 ఏళ్లుగా దూరంగా ఉన్న తల్లిని కలుసుకునేందుకు ఆమె ఇద్దరు పిల్లలు వచ్చారు. ప్రస్తుతం 25 ఏళ్ల వయసున్న కుమారుడు, తన తల్లిపై ఉన్న కేసును కొనసాగించేందుకు ఆసక్తి లేదని కోర్టుకు తెలిపాడు. ఈ మేరకు అఫిడవిట్ సమర్పించడంతో న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
పిల్లలతో శాశ్వతంగా ఉండాలని ఆశ
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె కుమార్తె, కుమారుడితో రెండు రోజులు గడిపారు. ఇద్దరు పిల్లలకూ వివాహాలు అయ్యాయి. తన తల్లిని తిరిగి తమతో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 2013లో తండ్రి చెప్పడంతోనే ఫిర్యాదు చేశామని ఇప్పుడు పిల్లలు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను చూసుకుంటున్న వృద్ధురాలికి ప్రత్యామ్నాయం ఎవరినైనా ఏర్పాట్లు చేసి, కోర్టుకు సంబంధించిన మిగిలిన ప్రక్రియలు పూర్తయ్యాక తిరిగి వస్తానని ఆమె పిల్లలకు హామీ ఇచ్చారు. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ విచారణలో ఫిర్యాదుదారుడి అభిప్రాయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది.


