యాని... మేటీ! | Rupali Gatti in From Script to Screen explored visual development | Sakshi
Sakshi News home page

యాని... మేటీ!

Oct 28 2026 12:47 AM | Updated on Oct 28 2026 12:47 AM

Rupali Gatti in From Script to Screen explored visual development

నేడు అంతర్జాతీయ యానిమేషన్‌ దినోత్సవం

‘ఆహా’ అని అబ్బురపరిచిన యానిమేషన్‌ ఉన్నచోటే ఉండిపోలేదు. ఆ రంగంలో అద్భుత, అనూహ్య మార్పులు వస్తున్నాయి.  ఆ మార్పులను ఒడిసిపట్టి యానిమేషన్‌ రంగంలో సత్తాచాటుతున్నారు మహిళా ఆర్టిస్ట్‌లు. ఒకప్పుడు యానిమేషన్‌ రంగంలో మహిళల ప్రాతినిధ్యం అతి తక్కువ. ఇప్పుడు గణనీయమైన పురోగతి కనిపిస్తోంది...

అద్భుతమైన కథలు కాగితం పై నుండి వెండితెరకు వెళ్లే ప్రక్రియ విజువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్‌ రూపాలి గట్టిని ఎప్పటికప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేది. విజువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్‌(వీడి) అంటే సినిమాలు, షోల కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించే వ్యక్తి.

వీడి ఆర్టిస్ట్‌ పని ప్రీ ప్రొడక్షన్‌ కంటే ముందే మొదలవుతుంది. నిర్మించబోయే సినిమా గురించి వారికి సంక్షిప్తంగా వివరిస్తారు. దాని ఆధారంగా తమ పరిశోధన ప్రారంభించి కాన్సెప్ట్‌లను రూపొందిస్తారు.

లొకేషన్‌ స్కాంటింగ్, ఫొటోలు చూడడం, చదవడం అనేవి వారి పరిశోధనలో భాగం. అయితే ఒక ప్రాజెక్ట్‌ విషయంలో మాత్రం రూపాలి ఎలాంటి పరిశోధన చేయలేదు. ప్రాజెక్ట్‌లో భాగంగా హంపీకి వెళ్లారు...అంతే! అక్కడి నుంచి వచ్చిన తరువాత, అక్కడి వాతావరణాన్ని, దృశ్యాలను ఆవాహన చేసుకొని తన పనిని సులువుగా పూర్తి చేశారు. ‘ఇలాంటివి జరగాలంటే మనల్ని విశ్వసించే వ్యక్తులు ఉండాలి’ అంటారు రూపాలి.

పాతిక సంవత్సరాలుగా...
కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్, ఎన్విరాన్‌మెంట్‌ డిజైనర్, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా రూపాలి గట్టికి 25 సంవత్సరాల అనుభవం ఉంది. బాహుబలి: ది బిగినింగ్, లాల్‌ క΄్తాన్, మాంటో, బాంబే రోజ్‌లాంటి చిత్రాలకు, ‘లైలా’వంటి షోలకు పనిచేశారు. ‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కథ చెప్పే స్క్రిప్ట్‌లకు బొమ్మలు గీయడం అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ’ అంటారు రూపాలి.

తన సృజనాత్మక ప్రయాణాన్ని కాలిగ్రఫీ, గ్రీటింగ్‌ కార్డ్‌ ప్రొడక్షన్‌తో ప్రారంభించారు. కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌గా మారడం ఆమె జీవితంలో ఆసక్తికరమైన మలుపు.
అయినప్పటికీ... ఇప్పటికీ పేవర్, పెన్సిల్‌!

విజువల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెషన్‌లో ఉండాలంటే అసాధారణ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి అంటారు రూపాలి. ‘బాగా గీయడం నేర్చుకోండి. టెక్నాలజీ  కేవలం ఒక సాధనం మాత్రమే’ అని నొక్కి చెబుతారు. ‘నేను వివిధ ప్రాజెక్ట్‌ల కోసం బొమ్మలు గీయడం మొదలుపెట్టినప్పటి నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. సరికొత్త సాధనాలకు అలవాటుపడుతున్నప్పటికీ పేపర్, పెన్సిల్‌ మాత్రం వదలలేదు’ అంటారు రూపాలి.

బ్రెయిన్‌ స్టార్మింగ్‌...
సినిమా ప్రాజెక్ట్‌ ప్రారంభం కావడానికి ముందు జరిగే బ్రెయిన్‌ స్టార్మింగ్‌ సెషన్‌లలో పాల్గొంటారు రూపాలి. యానిమేషన్‌ రంగంలో రావాలనుకునేవారికి ఆమె ఇచ్చే సూచన...

‘మీ నైపుణ్యాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన అలవాటు రోజుకో స్కెచ్‌ గీయడమే. మీరు ప్రతిరోజూ ఒక డ్రాయింగ్‌ వేస్తే సంవత్సరానికి 365 అవుతాయి. రిఫెరెన్స్‌ల ఆర్కైవ్‌లను తయారుచేసుకోండి. అత్యాధునిక మాధ్యమాల నుంచే కాదు సంప్రదాయ మాధ్యమాల నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. విభిన్నరంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయండి. మీ స్వంత మేధో సంపత్తి(ఐపీ)ని సృష్టించుకోండి.

రెండు దశాబ్దాలుగా....
డ్రీమ్‌వర్క్స్‌ యానిమేషన్‌లో సీనియర్‌ సీఎఫ్‌ఎక్స్‌ డెవలపర్‌ ప్రమిత ముఖర్జీ ప్రయాణం రెండు దశాబ్దాల క్రితం కోల్‌కత్తాలో మొదలైంది. చిన్నప్పడు టీవీలో కార్టూన్‌ షోలు చూడడం అంటే ప్రమితకు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యానిమేషన్‌ రంగంలోకి తీసుకువచ్చింది.  మన దేశంతో పాటు లండన్, లాస్‌ ఏంజిలిస్‌లో పలు స్టూడియోలలో పనిచేశారు.

డైరెక్టర్‌ మనసు చదవాలి...
‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్‌... ఏ ప్రాజెక్ట్‌పై పనిచేసినా నేను చేసే మొదటి పని డైరెక్టర్‌ మనసును చదవడం. ఆ తరువాత వారి సృజనాత్మక ఊహలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్‌కి తనదైన ఆలోచన ఉంటుంది. ఒక ఆర్టిస్ట్‌గా దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అవుట్‌పుట్‌ బాగా ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆలోచన వచ్చినప్పుడు నేను చేసే మొదటి పని దాన్ని కాగితంపై రాసుకోవడం’ అంటారు ప్రమిత.

అపూర్వ శిష్యపరంపర
దేశంలో ఎంతోమంది ప్రముఖ యానిమేటర్‌లు నీనా సబ్నానీ శిష్యులే. యానిమేషన్‌ రంగంలో అనుభవాల గురించి ఆమె మాటల్లోనే...

→ చేతితో ఫ్రేమ్‌లు గీసి, 35 ఎంఎం ఫిల్మ్‌పై చిత్రీకరించిన కాలం నుండి వచ్చిన మార్పులన్నీ నా కళ్లతో చూశాను. చాలా ఓపిక అవసరం అయ్యేది. మేము కోరుకున్నట్లు ఫలితం రావాలంటే మా డ్రాయింగ్స్‌ను మేమే లెక్కించుకోవాల్సి వచ్చేది. ఇదంతా యనిమేషన్‌కు సంబంధించి టైమింగ్‌ గురించి ఎలా ఆలోచించాలో నాకు నేర్పింది. నేను వస్త్రంపై ఉన్న ఎంబ్రాయిడరీతో సహా దేనితోనైనా యానిమేట్‌ చేయగలను.

→ నిజం చెప్పాలంటే యానిమేషన్‌ రంగంలోకి నేను బలవంతంగా వచ్చాను. బరోడాలో ఎంఎస్‌ యూనివర్శిటీలో పెయింటింగ్‌ చదివే రోజుల్లో అక్కడి ఉపాధ్యాయుల నన్ను యానిమేషన్‌ వైపు వెళ్లమని చెప్పారు. మొదట్లో నచ్చకపోయినా ఆ తరువాత ఒప్పుకున్నాను. మన దేశ గొప్ప సాంస్కృతిక సంపద గురించి మాకు చెప్పిన యూకే ప్రొఫెసర్‌ మనం ఇంకా పాశ్చాత్యదేశాల వైపు ఎందుకు చూస్తున్నామని ప్రశ్నించారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. దాని ఫలితమే... నా మొదటి యానిమేషన్‌ చిత్రం... శుభవివాహ్‌. యానిమేట్‌ చేయడానికి వీలులేదు అనుకునేదానికి యానిమేషన్‌ జోడించడం నా మొదటి ప్రయత్నం. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement