జస్ట్‌ కిచెన్‌ మసాలాలతో గిన్నిస్‌ రికార్డు..! ఇంజనీర్‌ అద్భుత సృష్టి | Karnataka's Amar Kale quit his engineering job to become an Artist | Sakshi
Sakshi News home page

జస్ట్‌ కిచెన్‌ మసాలాలతో గిన్నిస్‌ రికార్డు..! ఇంజనీర్‌ అద్భుత సృష్టి

Oct 22 2026 12:37 PM | Updated on Oct 22 2026 2:54 PM

Karnataka's Amar Kale quit his engineering job to become an Artist

అభిరుచి మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలను కూడా ఏకం చేయగలదని చెబుతోంది. విభిన్నం రంగం ఎంచుకుని ముందుకెళ్లినా..అది వద్దని తనకిష్టమైన కళ వైపుకే మళ్లీ..గిన్నిస్‌ రికార్డులకెక్కాడు ఈ యువ ఇంజనీర్‌. పైగా ఇంత వరకు ఎవ్వరూ ఆలోచించని విధంగా ఓ క్రియేషన్‌ చేసి ఆలోచింపచేశాడు కూడా. 

అతడే కర్ణాటకకు చెందిన అమర్‌ కాలే. అతనోక మెకానికల్‌ ఇంజనీర్‌. అతని తండ్రి మంచి చిత్ర కళాకారుడు. ఆ నేపథ్యంలనే అతడికి కూడా చిత్రకళపై ఆసక్తి ఏర్పడింది. చిన్నతనం నుంచి చిత్రకళ అంటే మక్కువ ఉన్నా..చదువుని కూడా విస్మరించలేదు. చక్కగా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉద్యోగం కూడా చేశాడు. అయితే మనసు మాత్రం చిత్రకళ వైపుకే పరుగులు పెడుతుండేది. దాంతో 2018లో పూర్తి స్థాయి కళాకారుడిగా ఉందామని నిర్ణయించుకుని ఇంజనీరింగ్‌ ఉద్యోగాన్ని వదిలేశాడు. 

ఆ తర్వాత తన తండ్రి వద్ద మెళుకువలు నేర్చుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత బ్రష్‌లు ఉపయోగించడం తెలుసుకున్నాడు. అలా చిత్ర కళాకారుడగా మారిన కాలే..ఇక అద్భుతాలు చేయడం ‍ప్రారంభించాడు. వినూత్న ఆలోచనలతో చిత్రాలు సృష్టించడం ప్రారంభాడు. ఆ క్రమంలోనే అందరు ఆశ్చర్యపోయేలా రాష్ట్ర వారసత్వ కథను చెప్పే అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు. అది కూడా వంటగదిలో ఉపయోగించే పసుపు, కారంతో చిత్రించడం విశేషం. 

కాలేకి  ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 10 గంటల సమయం పట్టింది. ఈ కళాకృతి సుమారు 1,892.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అంటే దాదాపు ఒక టెన్నిస్‌ కోర్టులో మూడింట రెండు వంతుల మేర విస్తరించి..అతిపెద్ద మసాలా దినుసుల చిత్రంగా వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ని దక్కించుకుంది. కాలే ఈ ఘనతను ఈ జనవరి 27, 2026న కర్ణాటకలోని ధార్వాడ్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కళాకృతిని ప్రజల వీక్షణార్థం ఉంచారు.

పసుపు, కారం ఎందుకు..
కాలే సాంప్రదాయ పెయింట్స్‌కు బదులుగా వంటగదిలో అత్యంత ముఖ్యమైన రెండు మసాలా పదార్థాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే కర్ణాటకకు సుగంధ ద్రవ్యాలతో సుదీర్ఘ సంబంధం ఉంది. ఆ వారసత్వాన్ని తెలిపేలే రెండు అర్థవంతమైన రంగులను ఉపయోగించే చిత్రలేఖనం చిత్రించాలని భావించాడట. ఆ ఉద్దేశ్యంతోనే ఆరు కిలోల పసుపు పొడి, ఐదు కిలోల కారంపొడి ఉపయోగించినట్లు తెలిపాడు. వాటి సహజమైన రంగులు ఈ చిత్రానికి ప్రత్యేకమైన రూపుని ఇచ్చాయిని చెబుతున్నాడు కాలే. 

చిత్రంలో దాగున్న విశేషాలు..
పూర్తయిన ఈ చిత్రంలో కర్ణాటక రాష్ట్ర రూపురేఖలు, దాని మధ్యలో ప్రసిద్ధ హంపి రథం తదితరాలు ఉన్నాయి. కేవలం రంగులను నైరూప్యంగా ప్రదర్శించడానికి బదులుగా రాష్ట్ర చరిత్రకు సంబంధించిన సుపరిచతమైన చిహ్నాన్ని సూచించాడానికి కాలే ఈ మసాలా దినుసులను ఉపయోగించాడు. ఇక ఈ హంపి రథం యునెస్కో గుర్తింపు దక్కించుకున్న స్మారక చిహ్నం. 

అలాంటి చిహ్నాన్ని కర్ణాటక రూపురేఖల మధ్య దీనిని ఉంచడం ద్వారా, కాలే రాష్ట్ర భౌగోళిక గుర్తింపును, దాని సాంస్కృతిక వారసత్వాన్ని ఒకచోట చేర్చాడు. అంతేగాదు కాలే గిన్నిస్‌ రికార్డ్సుకి కర్ణాటక సంస్కృతి, వారసత్వం, కళ, వాస్తు శిల్పాన్ని ప్రంపచానికి ప్రదర్శించడంలో ఈ కళాకృతి చిన్న సహకారంగా పేర్కొన్నాడు. అలాగే ఈ కళాకృతి కోసం కాలే ఎక్కువ మొత్తంలో మసాలా పొడిని తెచ్చుకొనగా..చిత్రించగా మిగిలిన దాన్ని దానం చేయడం విశేషం.

ఇదేమీ తొలి గిన్నిస్‌ రికార్డు కాదు..
2021లో తొలి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు దక్కించుకున్నాడు. అప్పడు అతడు ఒక నిమిషంలో 98 చేతి ముద్రలను చిత్రించాడు. ఇది అతని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఒక వ్యక్తి నోటితో వేసిన అతిపెద్ద పెయింటింగ్‌కు మరో రికార్డుని దక్కించుకుంది. ఆ తర్వాత ఈ కళాకృతితో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుని మొత్తం మూడు గిన్నిస్‌ రికార్డులు దక్షించుకున్న వ్యక్తిగా నిలిచాడు.

కాగా, కాలే మాత్రం తనను రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తిగా కాకుండా ఒక అర్థవంతమైన భావన లేదా సందేశాన్ని అందించే కళాఖండాలు సృష్టించే కళాకారుడుగా గుర్తించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో రికార్డులు క్రియేట్‌ చేసేలా కొంగొత్త చిత్రాలను క్రియేట్‌ చేయాలని ఆశిస్తున్నాడు కాలే. 

ఇదీ చదవండి: 9 టు 6 ఉద్యోగం కాదని.. కంటెంట్‌ క్రియేషన్‌తో రూ. 2.5 లక్షలు! కానీ..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement