అయోధ్య: శ్రీరాముని పవిత్ర జన్మభూమి అయోధ్యలో రామ్‌లీల ఒక మతపరమైన నాటక ప్రదర్శన మాత్రమే కాదు. అది శతాబ్దాలుగా సజీవంగా నిలిచిన అపురూప సాంస్కృతిక వారసత్వం. 151వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ చారిత్రక రామ్‌లీలకు భక్తుల హృదయాల్లో ఎంతో విశిష్ట స్థానం ఉంది. తరతరాలుగా వస్తున్న పవిత్ర సంప్రదాయాలను ఏమాత్రం తగ్గించకుండా, ప్రాచీన నియమ నిష్టలతో నేటికీ అలాగే ఈ వేడుకను కొనసాగిస్తుండటం విశేషం.
ఈ రామ్‌లీలలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇందులో పాత్రలు పోషించే కళాకారులను ఎక్కడి నుంచో రారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రల నుంచి పక్క వాద్యాలు వాయించేవారి వరకు అందరూ అయోధ్య స్థానికులే కావడం విశేషం. చిన్నతనం నుంచే స్థానిక పిల్లలు రామునిపై భక్తితో, రామ్‌లీలాపై మక్కువతో ఈ వేదికతో మమేకమవుతారు. పెరిగి పెద్దయ్యాక వారే స్వయంగా ఆ పాత్రలను పోషిస్తూ ఈ పురాతన సంప్రదాయాన్ని నిరాటంకంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఉత్సవంలో హనుమంతుని పాత్రకు ఉపయోగించే ప్రాచీన కిరీటానికి ఎంతో పవిత్రమైన చరిత్ర ఉంది.
రామ్‌లీలా ప్రారంభమైన తొలి నాళ్ల నాటి ఈ అపురూప కిరీటాన్ని నిత్యం ప్రత్యేకంగా ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తారు. కేవలం నాటక ప్రదర్శన వేళ మాత్రమే ఆ కిరీటాన్ని తీసి, హనుమంతుని పాత్రధారి శిరస్సుపై ఉంచుతారు. ఆ కిరీటాన్ని ధరించడం అనేది కేవలం వేషధారణలో భాగం కాదని, అది దైవిక బాధ్యతలతో కూడిన ఒక మహత్తర దీక్ష అని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.
అందువల్లే, హనుమంతుని పాత్ర పోషించే కళాకారుడు అత్యంత కఠినమైన నియమ నిష్టలను పాటించాల్సి ఉంటుంది. ఆ పాత్రధారి తన మనస్సులో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా నిష్కల్మష భావనతో ఉండటంతో పాటు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, నిరంతర ఆరాధనా భావం కలిగినప్పుడే ఆ పవిత్ర పాత్రకు న్యాయం జరుగుతుందని స్థానిక కళాకారులు నమ్ముతుంటారు.
ఇదీ చదవండి: ‘హిందువుల వద్దే బిర్యానీ కొనండి’.. పండుగల్లో పోస్టర్ల కలకలం!


