సాధారణం గా తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్య సమస్యలుంటే పుట్టిన తర్వాత చికిత్స చేస్తారు. కానీ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అంతకంటే ముందడుగు వేశారు. తల్లి గర్భంలోనే ఉన్న శిశువుకు వెన్నెముక శస్త్రచికిత్స నిర్వహించారు. భారత్‌లో ఈ తరహా ఓపెన్ ఫీటల్ సర్జరీ చేయడం ఇదే తొలిసారి.
నవంబర్ 12న 25 వారాల గర్భంతో ఉన్న మహిళకు ఈ ఆపరేషన్ చేశారు. ఆమె కడుపులోని శిశువుకు ‘లంబోసాక్రల్ మైలోమెనింగోసీల్’ అనే తీవ్రమైన పుట్టుకతో వచ్చే వెన్నెముక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలో వెన్నెముకలోని రంధ్రం నుంచి వెన్నుపాము, దాని చుట్టూ ఉండే పొరలు బయటకు వస్తాయి. దీనివల్ల పక్షవాతం, కాళ్ల కదలికల్లో ఇబ్బందులు, మెదడులో ద్రవం పేరుకు΄ోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు వైద్యులు ఆ శిశువుకు గర్భంలోనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఐదు వారాలపాటు ప్రణాళికలు రూపొందించి, తల్లి గర్భాశయాన్ని తెరిచి శిశువు వెన్నెముకలోని లోపాన్ని సరిచేసి తిరిగి గర్భాశయాన్ని మూసివేశారు.
ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో 30 మందికి పైగా వైద్యులు, నర్సులు ల్గొన్నారు. ఆపరేషన్ అనంతరం తల్లి, శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే గర్భధారణ కాలం, ప్రసవం, ఆ తర్వాత కూడా వైద్య పర్యవేక్షణ అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ శస్త్రచికిత్సను కేంద్ర ప్రభుత్వ జనని శిశు సురక్ష కార్యక్రమం కింద ఉచితంగా నిర్వహించడం విశేషం.


