breaking news
Fetal baby
-
ఫీటల్ మెడిసెన్: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం..
కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్ మెడిసిన్’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్లైట్లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్‌లా వెలిగే ఆ లైట్‌ను ‘జింక్ స్పార్క్’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్ మెడిసిన్’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన ‘ఆబ్స్టెట్రిక్స్’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్ సమస్యలుగా పేర్కొంటారు. అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ పాలెట్) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం. పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్సెఫాలీ అనే కండిషన్లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్ మెడిసిన్ విభాగంలోని డయాగ్నసిస్ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్ చేస్తుంటారు.పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్‌స్టెట్రీషియన్‌లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్‌కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్‌కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి... పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్‌గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్ బిడ్డ పుడతాడు.‘కలర్ డాప్లర్’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్ మెడిసిన్’ సహాయపడుతుంది. ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్ డాప్లర్’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఓ మహిళ గర్భవతి అని తెలియగానే ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్ యాసిడ్’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్ ట్యూబ్’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్ ట్యూబ్ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.క్రోమోజోమల్ సమస్యలు...ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్ సిండ్రోమ్’. ఇలా డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్డ్ టెస్ట్’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు... స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్ మెడిసిన్’లో భాగమే. ఉదాహరణకు ఈ వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్‌ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్‌సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్ మోతాదులను తెలుసుకుంటారు. ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్ పాజిటివ్‌నా) అన్నది నిర్ధారణ చేస్తారు.జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలతో...పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే...ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో) తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫీటల్ మెడిసిన్ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసీజెస్ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్) ఎక్కువనీ, అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్ మెడిసిన్’ నిపుణులు సూచిస్తుంటారు. రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్‌సాంజియస్ మ్యారేజెస్) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్ జీన్’ అంటారు. ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు... లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్ జీన్’ అంటారు. దాంతో ఈ డామినెంట్ జీన్ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.ఫీటల్ థెరపీస్ అంటే...?పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్)లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్ థెరపీ’గా పేర్కొంటున్నారు. డాక్టర్ ఎ మిత్రవింద, సీనియర్ కన్సల్టెంట్, ఫీటల్ మెడిసిన్(చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..) -
బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..శిశువులకు ఎందుకొస్తుంది..?
పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది. అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!. పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు సరిగా తినలేకపోవడం శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం త్వరితగతిన అలసిపోవడం స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి. ఎందువల్ల వస్తుందంటే.. గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు. చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?) -
ఆడబిడ్డ అయితే ‘సీత కష్టం’.. మగబిడ్డ అయితే 'రామ రామ'
సాక్షి, కామారెడ్డి: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కౌసల్య ఆస్పత్రి గుట్టు రట్టయింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇష్టారీతిన అబార్షన్లు చేస్తున్న వైనాన్ని అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. ఆస్పత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొంత కాలంగా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు. అక్కడ గర్భిణికి లింగ నిర్ధారణ స్కానింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆడో, మగో నిర్ధారించి చెబుతున్న విషయాన్ని గమనించి దాడులు నిర్వహించారు. స్కానింగ్ కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తుండడం, లింగ నిర్ధారణ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండడంతో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో అబార్షన్లు కూడా నిర్వహిస్తుండడం, స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యంపై పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. కోడ్ భాషలో చెప్పేస్తారు.. కౌసల్య ఆస్పత్రిలో కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ అయితే ‘సీత కష్టం’ అని, మగ బిడ్డ అయితే ‘రామ రామ’ అని కోడ్ భాషలో చెబుతారు. సీత కష్టం అనగానే చాలా మంది అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్‌తో ధర మాట్లాడుకుంటున్నారు. ‘రామ రామ’ అని చెప్పడంతో ఆనందంతో ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఈ ఆస్పత్రి వ్యవహారంపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సరైన ఆధారాలు లేక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిహద్దులు దాటి వస్తున్నారు.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోధన్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్, ధర్మాబాద్, ఔరద్ తదితర ప్రాంతాల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి అర్హతలు లేని వారు అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అబార్షన్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధే అన్నీ.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అర్హలు లేకున్నా తనే రేడియాలజిస్టు అవతారం ఎత్తి స్కానింగ్‌లు చేయడం, లింగ నిర్ధారణ వివరాలు బయటకు చెబుతూ దండుకుంటున్నట్టు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. వైద్యుల కుటుంబానికి చెందిన సదరు ఆస్పత్రి యజమాని సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదించిన సదరు యజమాని.. శ్రీరాంనగర్ కాలనీలోనే సొంత భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఆస్పత్రి సీజ్, యజమానిపై కేసు.. కౌసల్య ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. యజమాని సిద్దిరాములుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో పెరుగుతన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ తెలిపారు. స్కానింగ్ చేసిన వారితో పాటు ప్రోత్సహంచిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆడ పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గడానికి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని ఆమె చెప్పారు. -
గర్భస్థ శిశువుకు ఆధునిక వైద్యం
కర్నూలు(హాస్పిటల్): గర్భస్థ శిశువుకు ఉండే లోపాలను ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చని ఫీటల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ గాయత్రి ఇండ్ల చెప్పారు. ఫాగ్సీ కర్నూలు, లోటస్ అల్ట్రాసౌండ్, ఫీటల్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ హోటల్లో గర్భస్థ శిశువు లోపాలపై వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి ఇండ్ల మాట్లాడుతూ స్కానింగ్, స్క్రీనింగ్ ద్వారా జన్యులోపాలను, ఇతర అవయవలోపాలను, బిడ్డ ఎదుగుదలను గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. గర్భస్థ శిశువుకు సైతం మల్టీస్పెషాలిటీ స్థాయిలో కేర్ అవసరమన్నారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, పీడియాట్రిక్ సర్జన్లు కలిసి గర్భస్థ శిశువుకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై డాక్టర్ ఉమారామ్(చెన్నై), డాక్టర్ చిన్మయి, డాక్టర్ అమిత(హైదరాబాద్) ప్రసంగించారు. కార్యక్రమంలో ఫాగ్సీ సెక్రటరీ డాక్టర్ మాణిక్యరావు, చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చలపతి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. -
షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు
ముంబై: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం నిబంధనలను షారుఖ్ దంపతులు ఉల్లంఘించారని వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది కోర్టులో గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్లు దేశ్‌పాండే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడతామని సెప్టెంబర్ 12న చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలపాలంటూ షారుఖ్ దంపతులతోపాటు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.


