ఫీటల్‌ మెడిసెన్‌: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం.. | Health Tips: What is Fetal Medicine And Why You Need? | Sakshi
Sakshi News home page

ఫీటల్‌ మెడిసెన్‌: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం..

Apr 21 2026 5:03 PM | Updated on Apr 21 2026 5:40 PM

Health Tips: What is Fetal Medicine And Why You Need?

కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్‌ మెడిసిన్‌’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.  కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.

ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్‌లైట్‌లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్‌లా వెలిగే ఆ లైట్‌ను ‘జింక్‌ స్పార్క్‌’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... 
స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. 

మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్‌)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్‌)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్‌)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. 

పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.

లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... 
ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. 

ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్‌ మెడిసిన్‌’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన  ‘ఆబ్‌స్టెట్రిక్స్‌’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.

కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?
సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే  కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్‌ సమస్యలుగా పేర్కొంటారు. 

అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌ పాలెట్‌) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్‌ డయాఫ్రమాటిక్‌ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే  వెంటిలేటర్‌పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం.  

పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... 
ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్‌సెఫాలీ అనే కండిషన్‌లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. 

ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్‌ మెడిసిన్‌ విభాగంలోని డయాగ్నసిస్‌ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్‌ చేస్తుంటారు.

పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...
ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్‌స్టెట్రీషియన్‌లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్‌కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్‌కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి...  పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో  అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్‌గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్‌ బిడ్డ పుడతాడు.

‘కలర్‌ డాప్లర్‌’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...
ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్‌ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్‌) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన  నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్‌ మెడిసిన్‌’ సహాయపడుతుంది. 

ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్‌ డాప్లర్‌’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో  అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.

డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...
ఓ మహిళ గర్భవతి అని తెలియగానే  ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్‌ యాసిడ్‌’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్‌ యాసిడ్‌’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్‌ ట్యూబ్‌’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్‌ ట్యూబ్‌ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్‌ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. 

మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్‌ యాసిడ్‌’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్‌ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.

క్రోమోజోమల్‌ సమస్యలు...
ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. 

దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు  బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’. ఇలా డౌన్స్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్‌డ్‌ టెస్ట్‌’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్‌డ్‌ టెస్ట్‌ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. 

ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు...  
స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్‌ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్‌ మెడిసిన్‌’లో భాగమే. ఉదాహరణకు ఈ  వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్‌ లేదా క్వాడ్రపుల్‌ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్‌ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్‌సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్‌ మోతాదులను తెలుసుకుంటారు. 

ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్‌ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్‌ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్‌ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్‌ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్‌ పాజిటివ్‌నా) అన్నది నిర్ధారణ చేస్తారు.

జెనెటిక్‌ సోనోగ్రామ్‌ పరీక్షలతో...
పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్‌ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్‌ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.

జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ అంటే...
ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో)  తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని  తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. 

కొన్ని సందర్భాల్లో ఫీటల్‌ మెడిసిన్‌ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్‌ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.

ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... 
సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్‌ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్‌ రెసెసివ్‌ జెనెటిక్‌ డిసీజెస్‌ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్‌ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్‌) ఎక్కువనీ,  అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్‌ మెడిసిన్‌’ నిపుణులు సూచిస్తుంటారు.  

రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? 
చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్‌సాంజియస్‌ మ్యారేజెస్‌) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు  జరుగుతుందో చూద్దాం. 

ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్‌ జీన్‌’ అంటారు. 

ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు...  లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్‌ చేస్తుంది. ఇలా డామినేట్‌ చేసే జన్యువును ‘డామినెంట్‌ జీన్‌’ అంటారు. దాంతో ఈ డామినెంట్‌ జీన్‌ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.

ఫీటల్‌ థెరపీస్‌ అంటే...?
పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ  బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్‌)లో ప్రసవం జరిగేలా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్‌ థెరపీ’గా పేర్కొంటున్నారు.  

(చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..)
 

Advertisement
 
Advertisement
Advertisement