ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్‌.. క్షణాల్లో వ్యాధులను గుర్తించే ఏఐ! | AI Technology Aquaculture Aquasense | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్‌.. క్షణాల్లో వ్యాధులను గుర్తించే ఏఐ!

Nov 27 2026 9:18 AM | Updated on Nov 27 2026 9:18 AM

AI Technology Aquaculture Aquasense

సాగుబడి

రొయ్యలు, చేపల వ్యాధులను ముందే పసిగట్టి రైతులను ఆదుకుంటున్న ఏఐ సాంకేతికత

ప్రపంచ ఆక్వాకల్చర్‌ (జలపుష్పాల పెంపకం) పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ప్రతి ఏటా వ్యాధుల కారణంగా ఈ రంగం సుమారు 6 బిలియన్‌ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అంతేకాకుండా, హానికరమైన ప్లాంక్టన్‌ (ప్లవకాలు) వల్ల లక్షలాది సాల్మన్‌ చేపలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటివరకు చేపలు, రొయ్యల రైతులు నీటి నమూనాలను, జీవుల కణజాలాలను మైక్రోస్కోప్‌ల కింద పరీక్షించడానికి ప్రయోగశాల సిబ్బందిపై ఆధారపడాల్సి వచ్చేది.

ఈ సంప్రదాయ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగడమే కాకుండా, మానవ అంచనాలపై ఆధారపడి ఉండటం వల్ల సమస్య తీవ్రరూపం దాల్చే వరకు గుర్తించడం కష్టమయ్యేది. అయితే, ఈ సవాలుకు అడ్డుకట్ట వేస్తూ ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ సంస్థ ‘హాడ్ల్‌’ ఒక వినూత్న కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని అందుబాటులోకి తెచ్చింది.. దాని పేరే ‘ఆక్వాసెన్స్‌’. అంతర్జాతీయ ఆక్వా రంగంలో ఇప్పుడు ఇదే సంచలనం.

రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ సులభం
హాడ్ల్‌ సంస్థ రూపొందించిన ‘ఆక్వాసెన్స్‌’ ప్లాట్‌ఫారమ్, మైక్రోస్కోపిక్‌ నమూనాలను విశ్లేషించి చేపలు, రొయ్యలలో వ్యాధుల ప్రారంభ సంకేతాలను, ఒత్తిడిని, హానికరమైన ప్లాంక్టన్‌ మార్పులను క్షణాల్లో గుర్తిస్తుంది. దీన్ని నేరుగా చేపల చెరువుల వద్ద ఉపయోగించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ప్రయోగశాలల్లో అనుసంధానించవచ్చు. ఈ ఏఐ సాంకేతికత రాకతో ప్రయోగశాలలు పరీక్షించే నమూనాల సంఖ్య పది రెట్లు పెరిగిందని హాడ్ల్‌ సంస్థ పేర్కొంది. తద్వారా నష్టం జరగకముందే రైతులు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.

రైతు అనుభవమే పునాదిగా..
‘వ్యవసాయం అనేది పర్యావరణంతో నిరంతరం సాగే ఒక ΄ోరాటం లాంటిది. ఒక సమస్య ఎందుకు వచ్చిందో మాకు చాలా సార్లు నిర్థారణగా తెలియదు. తెలిసే సమయానికి చర్యలు తీసుకోవటానికి చాలా ఆలస్యమై΄ోతుంది. మా ఏఐ నమూనాలు ఆహార వ్యవస్థల్లో దాగి ఉన్న సంకేతాలను వెలికితీసి రైతులకు, పరిశోధకులకు నమ్మకమైన డేటాను అందిస్తున్నాయి’ అని హాడ్ల్‌ సీఈఓ అలెగ్జాండర్‌ ఫార్థింగ్‌ వివరించారు. స్వయంగా రొయ్యల రైతు కావడంతో, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను ఆయన లోతుగా అర్థం చేసుకున్నారు.

అంతర్జాతీయ విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహం
డిజిటల్‌ ఆవిష్కరణలు సంక్లిష్టంగా ఉంటే రైతులు వాటిని స్వీకరించడానికి వెనుకాడతారని, అయితే అలెగ్జాండర్‌ రూపొందించిన ఈ సులభతరమైన పరిష్కారం ఆక్వా రంగంలో పెను మార్పులు తెస్తుందని ఆక్వాకల్చర్‌ పెట్టుబడి సంస్థ ‘హాచ్‌ బ్లూ’ మేనేజింగ్‌ పార్టనర్‌ కార్స్టన్‌ క్రోమ్‌ అభిప్రాయపడ్డారు. హాచ్‌ బ్లూ ఆర్థిక సహకారంతో హాడ్ల్‌ తన సేవలను నార్వే, లాటిన్‌ అమెరికా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం 14 దేశాల్లోని క్లయింట్లు, భాగస్వాములతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ, ఫీడ్‌ సరఫరాదారుల నెట్‌వర్క్‌ల ద్వారా మరిన్ని క్షేత్రాలకు చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది.

మొత్తంగా, సంప్రదాయ ఆక్వా సాగుకు ఆధునిక ఏఐ సాంకేతికత తోడవడంతో జలచరాల ఆరోగ్య సంరక్షణ మరింత సులభతరమైంది. ఇది రైతుల ఆర్థిక నష్టాలను తగ్గించడమే కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు కొత్త భరోసానిస్తోంది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: సెన్సార్లు, ఏఐతో సాగు.. యువ రైతుకి అంతర్జాతీయ అవార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement