ఏఐ విస్తరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగ భద్రతపై చర్చ నడుస్తోంది. టెక్ దిగ్గజాలు ప్రకటిస్తున్న ఉద్యోగాల కోతలు, నియామకాల తగ్గింపు వెనుక ఏఐ ఆటోమేషన్ ప్రధాన కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, ఇటీవల వెలువడిన అధికారిక ప్రకటనలు, కార్పొరేట్ విశ్లేషణలను పరిశీలిస్తే.. ప్రతి ఉద్యోగ కోతకు ఏఐ ఒక్కటే కారణం కాదని, వ్యయ నియంత్రణ, వ్యాపార ప్రాధాన్యాల మార్పు, పెట్టుబడుల పునర్విభజన వంటి అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.
పునర్వ్యవస్థీకరణ మంత్రం
ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధికారిక ప్రకటనలే ఇందుకు నిదర్శనం. మైక్రోసాఫ్ట్ 2026 జులైలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులు, పెట్టుబడులు, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ తమ అధికారిక బ్లాగ్‌లో స్పష్టం చేశారు. వాణిజ్య విభాగం, ఎక్స్‌బాక్స్ సహా పలు విభాగాల్లో ఈ మార్పులు చేపట్టామని, సాధ్యమైన చోట ఉద్యోగులను ఇతర బాధ్యతల్లోకి సర్దుబాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం అక్టోబర్ 26న మైక్రోసాఫ్ట్ భారత్ సహా కెనడా, బ్రిటన్, అమెరికాలోని ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగుల కోసం స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని (వీఎస్‌పీ) ప్రవేశపెట్టింది. వ్యాపార అవసరాలు, కస్టమర్ల ప్రాధాన్యాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపిందే తప్ప ఏఐ వల్లే ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు.
భారత్‌లోనూ ప్రాధాన్యాల పునసమీక్ష
భారత టెక్ రంగంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా నవంబర్ 23న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. సంస్థాగత మార్పుల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 30 ఉద్యోగ పాత్రలను మాత్రమే తొలగించారు. పనుల ప్రాధాన్యాలను పునసమీక్షించడమే దీనికి కారణమని సంస్థ వివరించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైనట్లు భారీ స్థాయిలో తొలగింపులు జరగలేదని స్పష్టంగా ఖండించింది.
నైపుణ్యాల మెరుగుదలే రక్షణ కవచం
మరోవైపు, ఏఐ ప్రభావం కేవలం ఉద్యోగాల తొలగింపులకే పరిమితం కాకుండా పని విధానాలనూ సమూలంగా మారుస్తోంది. డ్రాఫ్టింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డేటా విశ్లేషణ, ప్రాథమిక పరిశోధన వంటి పనుల్లో ఏఐ సాధనాలు మానవ శ్రమను, సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని విభాగాల్లో కొత్త నియామకాల వేగం మందగించే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం అత్యవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్ ఆస్తులపై హైకోర్టులో దావా


