ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల్లోని అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు స్థాయులపై వినియోగదారులను అప్రమత్తం చేసే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ (ఎఫ్‌ఓపీఎన్‌ఎల్) విధానాన్ని మరింత కఠినతరం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
ఇప్పటివరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదనల్లో యాడెడ్ షుగర్, యాడెడ్ ఫ్యాట్ అంశాలకే పరిమితమయ్యారు. దీనివల్ల సహజ చక్కెరలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు హెచ్చరికల నుంచి తప్పించుకునే ప్రమాదముందని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం చక్కెర, సంతృప్త కొవ్వు (సాచురేటెడ్ ఫ్యాట్), ఉప్పు స్థాయుల ఆధారంగా హెచ్చరిక ప్రమాణాలను రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఒక్కో పోషకానికి ప్రత్యేక గుర్తింపు
నిర్దేశిత పరిమితిని మించిన పోషకాలు ఉన్న ఆహార ప్యాకెట్లపై ఎరుపు రంగు హెక్సాగన్ ఆకారంలో హెచ్చరికలు ముద్రించాలి. HIGH FAT, HIGH SUGAR, HIGH SALT అనే పదాలతో పాటు సంబంధిత పోషక చిత్రాన్ని (పిక్టోగ్రామ్) స్పష్టంగా చూపించాలి. ఒకే ఉత్పత్తిలో రెండు, మూడు పోషకాలు అధికంగా ఉంటే వాటన్నింటినీ ఒకే గుర్తులో కాకుండా ప్రతి పోషకానికి విడివిడిగా హెక్సాగన్ ఏర్పాటు చేయాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రతి హెక్సాగన్ ప్యాకెట్ ప్రధాన ప్రదర్శన భాగంలో కనీసం 4-5 శాతం స్థలాన్ని ఆక్రమించాలి.
శాస్త్రీయ పరిమితులు..
2024 భారతీయ ఆహార మార్గదర్శకాల్లోని (డీజీఐ) విలువలను యథాతథంగా కాకుండా శాస్త్రీయ ఆధారాలతో పోషక పరిమితులను సమతుల్యంగా పునర్నిర్ణయించాలని కోర్టు సూచించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన నాలుగు నెలల గడువులోగా (60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణతో సహా) తుది నిబంధనలు ఖరారు చేయాలని, అనంతరం పరిశ్రమలకు ఏడాది పరివర్తన గడువు ఇవ్వాలని పేర్కొంది. సమాచారంతో కూడిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) పరిధిలోకి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 2020 లేబులింగ్ నిబంధనల కఠిన అమలుతో పాటు పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో పోషకాహార అవగాహన పెంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్ ఆస్తులపై హైకోర్టులో దావా


