వాట్సాప్‌ వాడేవాళ్లకు కేంద్రం డేంజర్‌ అలర్ట్‌! | WhatsApp Web At Risk Home Ministry Issues Important Warning | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ వాడేవాళ్లకు కేంద్రం డేంజర్‌ అలర్ట్‌!

Nov 23 2026 7:08 PM | Updated on Nov 23 2026 7:18 PM

WhatsApp Web At Risk Home Ministry Issues Important Warning

దేశంలో మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను వినియోగించేవాళ్లు కోట్లలో ఉన్నారు. అయితే కంప్యూటర్‌లో వాట్సాప్‌ వెబ్‌ (WhatsApp Web) ఉపయోగిస్తున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆఫీసు కంప్యూటర్లు, ఇతరులతో పంచుకునే సిస్టమ్‌లలో వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ చేసి అలాగే వదిలేయడం సైబర్‌ నేరగాళ్లకు అవకాశంగా మారవచ్చని తెలిపింది. ఇలాంటి యాక్టివ్‌ సెషన్లను దుర్వినియోగం చేసి వ్యక్తిగత చాట్‌లను చదవడం, ఇతరుల పేరుతో సందేశాలు పంపడం, మోసాలకు పాల్పడటం సాధ్యమని పేర్కొంది.

నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌ (NCTAU), ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C) ద్వారా ఈ హెచ్చరిక జారీ చేసింది. గుర్తింపు పొందిన వాట్సాప్‌ వెబ్‌ సెషన్‌ ఇతరుల చేతికి చిక్కితే వ్యక్తిగత సందేశాలు, కాంటాక్టులు, గ్రూప్‌ సంభాషణలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వివరించింది. అంతేకాకుండా ఖాతాదారుడిలా నటిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సందేశాలు పంపి ఫిషింగ్‌, ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆఫీసు, పబ్లిక్‌ కంప్యూటర్లతో జాగ్రత్త

ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, గోప్యమైన సమాచారాన్ని కంప్యూటర్లలోని వాట్సాప్‌ వెబ్‌ ద్వారా పంపుకోవద్దని I4C సూచించింది. ముఖ్యంగా ఆఫీసు కంప్యూటర్లు, షేర్డ్‌ సిస్టమ్‌లు, సైబర్‌ కేఫ్‌లు, పబ్లిక్‌ కియోస్క్‌లు, హోటళ్ల బిజినెస్‌ సెంటర్లలోని కంప్యూటర్లపై వాట్సాప్‌ లాగిన్‌ చేయకపోవడమే మంచిదని తెలిపింది. ఇతరుల కంప్యూటర్లను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ట్యాబ్‌ మూసేస్తే సరిపోదు.. లాగౌట్‌ తప్పనిసరి

చాలామంది వాట్సాప్‌ వెబ్‌ ఉపయోగించిన తర్వాత బ్రౌజర్‌ ట్యాబ్‌ లేదా విండోను మూసేస్తే ఖాతా లాగౌట్‌ అయిపోతుందని భావిస్తారు. అయితే, అలా చేయడం వల్ల యాక్టివ్‌ సెషన్‌ ముగిసినట్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతిసారీ వినియోగం పూర్తయిన తర్వాత మాన్యువల్‌గా లాగౌట్‌ కావాలని సూచించింది. తప్పనిసరిగా వాట్సాప్‌ వెబ్‌ ఉపయోగించాల్సి వస్తే, నమ్మకమైన కంప్యూటర్‌లో ప్రైవేట్‌ లేదా ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్‌ విండోను ఉపయోగించవచ్చని తెలిపింది. అయితే, ఆ విండోను మూసే ముందు కూడా లాగౌట్‌ చేయడం తప్పనిసరి.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి

మీరు పంపని మెసేజ్‌లు మీ ఖాతా నుంచి వెళ్లడం, కాంటాక్టుల నుంచి అనూహ్య రిప్లైలు రావడం, ఖాతాలో తెలియని కార్యకలాపాలు కనిపించడం వంటి పరిణామాలను నిర్లక్ష్యం చేయకూడదని I4C సూచించింది. పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని, భద్రతా సాఫ్ట్‌వేర్‌ను తాజా వెర్షన్‌లో ఉంచాలని తెలిపింది. అనుమానాస్పద ఫైళ్లు, తెలియని డౌన్‌లోడ్‌లు, క్రాక్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement