బట్టతలను మాయం చేసే ‘మ్యాజిక్‌ దువ్వెన’! | Magic comb that may reverse baldness developed by China scientists | Sakshi
Sakshi News home page

బట్టతలను మాయం చేసే ‘మ్యాజిక్‌ దువ్వెన’!

Nov 23 2026 5:55 PM | Updated on Nov 23 2026 6:07 PM

Magic comb that may reverse baldness developed by China scientists

బట్టతల సమస్యతో బాధపడేవారికి శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన శుభవార్త అందించారు. జుట్టు రాలడాన్ని తగ్గించి, తిరిగి పెరిగేలా ప్రేరేపించే సరికొత్త ఎలక్ట్రానిక్ దువ్వెనను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘డీట్యాంగిల్‌’ (Detangle) పేరుతో రూపొందించిన ఈ పరికరం సాధారణ దువ్వెన మాదిరిగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేక విద్యుత్‌ ఎలక్ట్రోడ్లు, ఔషధాలను చర్మంలోకి పంపించే వ్యవస్థ ఉన్నాయి. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ పరికరం ద్వారా 28 రోజుల్లోనే దాదాపు 98 శాతం వరకు జుట్టు తిరిగి పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.

బీజింగ్‌లోని బీహాంగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇతర సంస్థల శాస్త్రవేత్తలతో కలిసి ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో వివిధ ఎత్తుల్లో ఉండే ఎలక్ట్రానిక్ పళ్లు ఉంటాయి. ఇవి విద్యుత్‌ క్షేత్రాలను సృష్టించి, జుట్టు కుదుళ్ల వరకు ఔషధాలు చేరేలా సహాయపడతాయి. సాధారణంగా తలకు రాసే మందులతో పోలిస్తే ఈ సాంకేతికత ద్వారా ఔషధాలను వెంట్రుకల కుదుళ్ల ప్రాంతంలోకి దాదాపు తొమ్మిది రెట్లు లోతుగా చేర్చవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ దువ్వెన ద్వారా రెండు రకాల ప్రయోగాత్మక చికిత్సలను అందిస్తారు. మొదటిది వెంట్రుకల కుదుళ్ల చుట్టూ రక్తనాళాల అభివృద్ధిని ప్రోత్సహించే VEGFA జన్యు ఆధారిత చికిత్స. రెండోది జుట్టు రాలడానికి కారణమయ్యే డీహైడ్రోటెస్టోస్టెరాన్‌ (DHT) హార్మోన్‌ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే SRD5A2 జన్యువును లక్ష్యంగా చేసుకునే సాంకేతికత. ఈ రెండింటితో పాటు విద్యుత్‌ ప్రేరణను ఉపయోగించడం వల్ల జుట్టు తిరిగి పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుందని పరిశోధకులు వివరించారు.

ఈ ప్రయోగాల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ఉపయోగించే మినాక్సిడిల్‌తో సుమారు 70 శాతం వరకు పునరుద్ధరణ కనిపించగా, డీట్యాంగిల్‌ పరికరంతో రెండు ప్రయోగాత్మక చికిత్సలను కలిపి ఉపయోగించినప్పుడు 97.85 శాతం వరకు జుట్టు తిరిగి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.

ఇప్పటివరకు ఈ పరికరాన్ని ఎలుకలపైనే పరీక్షించారు. మనుషులపై దీని సామర్థ్యం, దీర్ఘకాలిక భద్రత, దుష్ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఈ పరిశోధన వివరాలు నవంబర్‌ 3, 2026న ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ అనే అంతర్జాతీయ పరిశోధనా జర్నల్‌లో  ప్రచురితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement