భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్ఠ స్థాయి నుంచి 1,600 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 50 కీలకమైన 25,600 స్థాయిని కోల్పోయింది. దీంతో ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద నుంచి రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.
శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5,14,18,275 కోట్లుగా ఉండగా.. సోమవారం సెషన్ ముగిసే సమయానికి రూ.5,08,93,997 కోట్లకు తగ్గింది. అంటే ఒక్కరోజులోనే రూ.5.24 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముగింపులో సెన్సెక్స్ 1,438 పాయింట్లు నష్టపోయి 82,435 వద్ద, నిఫ్టీ 450 పాయింట్లు పడిపోయి 25,349 వద్ద స్థిరపడ్డాయి.
మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణాలివే..
ఇటీవల వరుసగా నాలుగు వారాల పాటు మార్కెట్లు లాభాల్లో పయనించడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా కీలక సూచీలు రికార్డు స్థాయిలకు చేరువ కావడంతో అధిక ధరల వద్ద షేర్లను విక్రయించారు.
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ గణనీయంగా పడిపోయింది.
అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై నెలకొన్న ఆందోళనలు, రూపాయి బలహీనత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ పెట్టుబడులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందన్న భయాలు నెలకొన్నాయి.
మరోవైపు, నిఫ్టీ 50 కీలకమైన 26,000 పాయింట్ల స్థాయిని దాటడంలో విఫలమైంది. సూచీలు అధిక కొనుగోళ్ల స్థాయికి చేరడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాలన్నీ కలిసి సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టాయి.


