నోయల్ టాటా అభ్యంతరాలతో బోర్డు సమావేశం వాయిదా!
దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలా? లేక ప్రైవేట్ సంస్థగానే కొనసాగించాలా? అన్న అంశంపై యాజమాన్యంలో భిన్నాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరగాల్సిన టాటా సన్స్ బోర్డు సమావేశం వాయిదా పడింది. నవంబర్ 21 సాయంత్రం ఆలస్యంగా అజెండా పంపారని, కీలక ప్రతిపాదనలను పరిశీలించేందుకు తగినంత సమయం లేదని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్, బోర్డు డైరెక్టర్ నోయల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
నోయల్ టాటా ప్రతిపాదన ఏమిటి?
ఐపీఓకు బదులుగా ప్రత్యామ్నాయ పునర్వ్యవస్థీకరణ మార్గాన్ని పరిశీలించాలని నోయల్ టాటా పట్టుబడుతున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ (టెస్), టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ (టీసీఈ) సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేయాలన్నది ఆయన ప్రధాన ప్రతిపాదన. తద్వారా టాటా సన్స్ ఆర్థిక, వ్యాపార నిర్మాణాన్ని మార్చి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ), అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల పరిధి నుంచి బయటపడవచ్చని, ప్రైవేట్ హోదాను కాపాడుకోవచ్చని టాటా ట్రస్ట్స్ భావిస్తోంది.
ఆర్బీఐ కఠిన వైఖరి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ (ఎస్‌బీఆర్) నిబంధనల ప్రకారం, 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించారు. ఈ విభాగంలోని సంస్థలు మూడేళ్లలో (2025 సెప్టెంబర్ నాటికి) తప్పనిసరిగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాలి. నిబంధనల నుంచి మినహాయింపు కోసం 2024లో టాటా సన్స్ తన సీఐసీ రిజిస్ట్రేషన్ రద్దుకు దరఖాస్తు చేయగా, 2026 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దాన్ని తిరస్కరించింది. పైగా, అక్టోబర్ 6న సంస్థ కోరిన వివరణకు నవంబర్ 16న ఆర్బీఐ స్పందిస్తూ తప్పనిసరి లిస్టింగ్ సహా అన్ని నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
యాజమాన్య విభేదాలు
టాటా సన్స్‌లో 66% వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ ప్రైవేట్ హోదాను కోరుకుంటుండగా, 18.37% వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ తమ పెట్టుబడి విలువను నగదుగా మార్చుకునేందుకు లిస్టింగ్‌కు మొగ్గు చూపుతోంది. మరోవైపు, ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం పొడిగింపు, ఐపీఓ అంశాలపై సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలోనే నోయల్ టాటాకు, మెజారిటీ డైరెక్టర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి. తదుపరి బోర్డు సమావేశం తేదీపైనే ఇప్పుడు గ్రూప్ భవిష్యత్ ఆధారపడి ఉంది. కాగా, బోర్డు సమావేశం వాయిదా, విలీన ప్రతిపాదనలపై టాటా సన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి: రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!


