హారన్ మోత లేదు.. ట్రాఫిక్‌లో తొందర లేదు.. ఐజ్వాల్ స్పెషాలిటీ ఇదే! | No Honking No Lane Jumping Anand Mahindra Applauds Aizawl Traffic Culture | Sakshi
Sakshi News home page

హారన్ మోత లేదు.. ట్రాఫిక్‌లో తొందర లేదు.. ఐజ్వాల్ స్పెషాలిటీ ఇదే!

Nov 23 2026 11:35 AM | Updated on Nov 23 2026 11:38 AM

No Honking No Lane Jumping Anand Mahindra Applauds Aizawl Traffic Culture

మన దేశంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ అంటే, వెంటనే గుర్తొచ్చేది.. హారన్ల మోత, వాహనాల రద్దీ, తొందరపాటు. సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగితే చాలు.. వెనుక ఉన్నవారు హారన్లు కొట్టడం మొదలుపెడతారు. కానీ.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉన్నా వాహనదారులు అనవసరంగా హారన్లు కొట్టరు. తమ వంతు వచ్చే వరకు ఎంతో ఓపికగా వేచి ఉంటారు. ఈ నగరంలోని ట్రాఫిక్ క్రమశిక్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో.. ఓ మహిళ ఐజ్వాల్ ట్రాఫిక్ ప్రత్యేకతను గురించి వివరిస్తుంది. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నప్పటికీ ఎవరూ హారన్లు కొట్టడం లేదని, ఇక్కడి ప్రజలకు సహనం ఎక్కువని చెబుతుంది. అంతేకాదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగినప్పుడు రోడ్డుపై ఉన్న తెల్లటి గీతను కూడా ఎవరూ దాటరని వివరిస్తుంది. తమ వంతు వచ్చే వరకు నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా ఉంటారని చెబుతూ.. దేశంలోని ఇతర నగరాల ప్రజలు కూడా ఐజ్వాల్ నుంచి నేర్చుకోవాలని కోరుతుంది. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఉన్నా ఇక్కడ ఎవరూ హారన్లు కొట్టరని ఆమె పేర్కొంటుంది.

ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గతంలో కూడా ఐజ్వాల్ ప్రజల ట్రాఫిక్ క్రమశిక్షణ, లేన్ నిబంధనల పట్ల వారి గౌరవం గురించి పోస్టు చేసినట్లు గుర్తుచేశారు. ముఖ్యంగా 2017లో అమల్లోకి వచ్చిన నో-హాంకింగ్ విధానం నగరంలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సహాయపడిందని పేర్కొన్నారు.

సాధారణంగా ప్రజలు ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను చూడటానికి ప్రయాణాలు చేస్తుంటారని, కానీ భవిష్యత్తులో ప్రశాంతతను వెతుక్కుంటూ కూడా ప్రయాణాలు చేసే రోజులు రావచ్చని ఆనంద్ మహీంద్రా అన్నారు.

ఇదీ చదవండి: బిస్లెరి వాటర్ వివాదం.. అసలు నిజం ఇదేనంటున్న సంస్థ!

నిజానికి.. ఐజ్వాల్ ప్రజలు పాటిస్తున్న ఈ క్రమశిక్షణ దేశంలోని ఇతర నగరాలకు కూడా ఒక మంచి ఉదాహరణ. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రోడ్ల విస్తరణతో పాటు వాహనదారుల్లో సహనం, బాధ్యత, నిబంధనల పట్ల గౌరవం కూడా అవసరం. హారన్ కొట్టడం కంటే ఓపికగా వేచి ఉండటం మంచిదని ఐజ్వాల్ ప్రజలు తమ ఆచరణతో దేశానికి ఒక మంచి సందేశం ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement