ఒక కిలోమీటర్ పెరిగిన స్పీడ్.. రూ.2000 ఫైన్ | 1 Kmph Over Limit Rs 2000 Fine And Location In The Sea Man Questions Challan | Sakshi
Sakshi News home page

ఒక కిలోమీటర్ పెరిగిన స్పీడ్.. రూ.2000 ఫైన్

Nov 14 2026 8:46 AM | Updated on Nov 14 2026 8:52 AM

1 Kmph Over Limit Rs 2000 Fine And Location In The Sea Man Questions Challan

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది. కేవలం గంటకు 1 కిలోమీటర్ వేగం ఎక్కువగా ప్రయాణించినందుకు అతనికి రూ.2,000 జరిమానా విధించారు. అనుజీత్ శివమ్ అనే వ్యక్తి.. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ఎక్స్‌ప్రెస్‌వేపై స్పీడ్ లిమిట్ గంటకు 100 కిలోమీటర్లు. కానీ తన కారు 101 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు కెమెరా గుర్తించిందని తెలిపాడు. అయితే ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. స్పీడ్ కెమెరా అతని వాహనం లొకేషన్‌ను 0°N, 0°Eగా నమోదు చేసింది. ఈ కోఆర్డినేట్స్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సూచిస్తాయి. దీంతో అతను నోయిడా, యూపీ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఇదేనా మీ రోడ్డు భద్రతా విధానం అంటూ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ హెల్ప్‌లైన్ నంబర్ 7065060882కు ఫోన్ చేయాలని సూచించారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 100 కిలోమీటర్ల వేగ పరిమితి అంటే గరిష్ట వేగం మాత్రమేనని, వాహనదారులు 90 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మంచిదని కొందరు సూచిస్తున్నారు. మరోవైపు AI కెమెరాలు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ చేస్తాయని, వాటి పనితీరులో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలో చట్టపరమైన అంశం కూడా చర్చకు వచ్చింది. వేగ పరిమితికి 5 శాతం వరకు వెసులుబాటు ఉంటుందని, అలాంటప్పుడు 101 కిలోమీటర్ల వేగానికి జరిమానా విధించడం సరైనదేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ నిబంధన ఈ ఘటనకు వర్తిస్తుందా లేదా అనేది అధికారిక నిబంధనల ఆధారంగా నిర్ధారించాల్సి ఉంటుంది. మరోవైపు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగ పరిమితిని గంటకు 120 కిలోమీటర్లకు పెంచాలని కూడా కొందరు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement