ఢిల్లీ ట్రాఫిక్‌ చలాన్‌.. ఈ కొత్త రూల్‌తో వాహనదారులకు షాక్‌! | Delhi Traffic Challan New Rules Lawyers Protest | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ట్రాఫిక్‌ చలాన్‌.. ఈ కొత్త రూల్‌తో వాహనదారులకు షాక్‌!

Sep 22 2026 12:59 PM | Updated on Sep 22 2026 1:02 PM

Delhi Traffic Challan New Rules Lawyers Protest

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ట్రాఫిక్‌ చలాన్‌ నిబంధనలపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చలాన్‌పై అభ్యంతరం ఉంటే.. ముందుగా అధికారులకే ఫిర్యాదు చేయాలి.. ఒకవేళ అక్కడ కూడా తిరస్కరణకు గురైతే కోర్టును ఆశ్రయించాలి. అలా చేసేముందు చలాన్‌ మొత్తంలో 50 శాతం చెల్లించాలన్న నిబంధనపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదులు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు.

ట్రాఫిక్‌ చలాన్‌ విషయంలో ఈ నిబంధన వాహనదారులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉందన్న చర్చ మొదలైంది. దాంతో తప్పుగా చలాన్‌ వేశారని భావించే వ్యక్తి ముందుగా నిర్ణీత అధికారికి అభ్యంతరం చెప్పాలి. అక్కడ కూడా తన వాదనకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే కోర్టుకు వెళ్లే ముందు చలాన్‌ మొత్తంలో సగం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 50 శాతం నిబంధనే ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది.

ఈ మార్పులు సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ (CMVR), 1989లోని రూల్‌ 167కు చేసిన సవరణలతో వచ్చాయి. దీంతో కొత్త రూల్‌ 167(5) ప్రకారం.. చలాన్‌ జారీ అయిన తర్వాత వాహనదారుడికి రెండు అవకాశాలు ఉంటాయి. చలాన్‌లో పేర్కొన్న జరిమానాను చెల్లించడం లేదా నిర్ణీత పోర్టల్‌తో దానిని సవాలు చేయడం. ఇలా అభ్యంతరం తెలిపేటప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

అయితే, చలాన్‌ను సవాలు చేసేందుకు 45 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోనే అధికారిని ఆశ్రయించకపోతే చలాన్‌ను అంగీకరించినట్టుగా పరిగణిస్తారు. అయినప్పటికీ ఒకవేళ వాహనదారుడి అభ్యంతరాన్ని అధికారి తిరస్కరిస్తే.. ఆ తర్వాత సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే దీనికన్నా ముందే చలాన్‌ మొత్తంలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనపైనే న్యాయవాదులు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చలాన్‌ సరైనదా? కాదా? అనే విషయాన్ని తుది నిర్ణయంగా తేల్చాల్సింది న్యాయస్థానమేనని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ముందుగా అభ్యంతరాన్ని తిరస్కరించిన తర్వాతే కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడం వల్ల న్యాయపరమైన హక్కులకు ఇబ్బంది కలగొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ముందుగానే 50 శాతం జరిమానా చెల్లించాల్సిన నిబంధన సామాన్యులకు భారంగా మారుతుందని అంటున్నారు.

మరోవైపు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు ప్రత్యేక పరిస్థితులు కూడా కారణం కావచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితి, తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్‌ వంటి సందర్భాల్లో అనుకోకుండా నిబంధన ఉల్లంఘించే పరిస్థితి రావచ్చని పేర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో తమ వాదనను కోర్టు ముందు వివరించే అవకాశం ఉండాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చలాన్‌ విధానంపై ఢిల్లీలోని జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్లు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయగా.. సెప్టెంబర్‌ 20న సర్క్యులర్‌ జారీ చేశాయి. దీంతో తాజాగా న్యాయవాదులు విధులకు దూరంగా ఉండటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ, జెమినీలను వణికిస్తున్న ‘జేవ్‌ ఏఐ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement