breaking news
motor vehicle
-
‘క్యాబ్’లకు కళ్లెం?
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సర్వీసులు తొలిసారి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి రాబోతున్నాయి. ఓలా, ఉబర్, రాపిడో లాంటి క్యాబ్ అగ్రిగేటర్లు రాష్ట్రంలో దాదాపు 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయి. కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన నియంత్రణలోకి తీసుకోలేదు. ఫలితంగా ఇన్నేళ్లుగా అవే సొంతంగా చార్జీలను నిర్ధారించుకుంటూ, ఓ పద్ధతి అంటూ లేకుండా పీక్ డిమాండ్ పేరుతో తోచినంత చార్జీ పెంచుతూ ప్రయాణికుల జేబు లను కొల్లగొడుతున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వాటిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోబోతోంది.దీంతో వాటి బేస్ చార్జీ, పెరుగుదల, పీక్ అవర్ సర్జ్లాంటివి రాష్ట్ర రవాణాశాఖ నిర్ధారించబోతోంది. క్యాబ్ సేవలపై వచ్చే ఫిర్యాదులను కూడా రవాణాశాఖ పరిశీలించి చర్యలు తీసుకోనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పీక్ అవర్స్‌లో క్యాబ్ బేస్ ఫేర్‌ను రెట్టింపు మేర పెంచుకోవటం, డిమాండ్ లేని వేళ, బేస్ ఫేర్‌లో 50 శాతానికి చార్జీ వసూలు చేయటం లాంటి కీలక సవరణలు చేసింది. వీటితోపాటు క్యాబ్ డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌ను అగ్రిగేటర్లు కల్పించేలా అందులో పొందుపరిచింది.బుక్ చేసుకున్న క్యాబ్ ప్రయాణికుడి వరకు రావటానికి 3 కి.మీ. దూరం మించితే ఆ దూరానికి కూడా అదనపు చార్జీని లెక్కగట్టడం, సహేతుక కారణం చూపకుండా డ్రైవర్గాని, ప్రయాణికుడు గాని రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే అపరాధ రుసుము చెల్లించాల్సి రావటం లాంటి అంశాలను కూడా అందులో చేర్చింది. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు వాటి అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకోగా, ఇప్పుడు తెలంగాణ కూడా కసరత్తు ప్రారంభించింది. ఏంటీ ఉపయోగం.. గతంలో ఆటోరిక్షా వాలాలు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలుండేది, ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం 90 శాతం మంది ఆటోవాలాలు క్యాబ్ అగ్రిగేటర్ల యాప్‌లతో అనుసంధానమయ్యారు. దీంతో వారు రవాణాశాఖ నిర్ధారించిన చార్జీలను పరిగణనలోకి తీసుకోవటం లేదు. పీక్ డిమాండ్ పేరుతో ఇష్టం వచ్చిన చార్జీలు వసూలు చేస్తున్నా ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి ఆటోలతో పాటు క్యాబ్‌లపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. పీక్ అవర్ ఓ బ్రహ్మపదార్థం.. గతంలో ఆటోరిక్షాలకు ఉదయం, రాత్రి వేళలను పీక్ అవర్స్‌గా పేర్కొంటూ 1.5 శాతం ఎక్కువ చార్జీ వసూలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ, క్యాబ్ సరీ్వసులు 24 గంటలు పీక్ అవర్‌గా పేర్కొంటూ ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ కాస్త ఎక్కువ ఉందని తెలియగానే, వాన కురవగానే, ట్రాఫిక్ జామ్ పెరగగానే, రోడ్డుమీద క్యాబ్‌ల సంఖ్య తక్కువ ఉన్నాయనగానే.. రెండుమూడు రెట్టు చార్జీలు పెరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని నియంత్రించే వీలుంటుంది. బుక్ అయిన రైడ్‌ను డ్రైవర్ రద్దు చేసుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వానికీ ఆదాయం.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో లాంటి అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్యాబ్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రతి క్యాబ్ నుంచి రోడ్డు ట్యాక్స్ వసూలవుతుంది. జీఎస్టీ ఆదాయం సమకూరుతుంది. బైక్ ట్యాక్సీలకు ఓకే.. ప్రస్తుతం నగరంలో 1.30 లక్షల కార్లు క్యాబ్ సర్వీసుల్లో ఉన్నాయి. మరో లక్షన్నర వరకు ఆటోరిక్షాలున్నాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా బైక్ ట్యాక్సీలు భారీగా రోడ్డెక్కుతున్నాయి. వైట్ ప్లేట్‌తో ఉండే ఈ బైక్ ట్యాక్సీలు చట్టబద్ధం కాదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని క్యాబ్, ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అవి యథావిధిగా నడవనున్నాయి. వాటికి పసుపు రంగు ట్యాక్సీ నంబర్‌ప్లేట్ తప్పనిసరి చేయకపోవటం విశేషం. దీంతో వాటి సంఖ్య మరింత పెరిగే వీలుంది. -
స్టాపేజ్ రిపోర్ట్ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహనాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్ రిపోర్ట్ లేదా నాన్ యూజ్ రిపోర్ట్’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్ సమర్పించడంలో విఫలమైనప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ లోపల సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ (సీడీవై)లో తిరుగుతున్నాయని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సెక్షన్ 12ఏ ప్రకారం స్టాపేజ్ రిపోర్ట్‌కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్ జడ్జితారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐరన్ స్టోరేజీ, హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.ప్రభుత్వం అప్పీల్ చేయడంతో..ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్ రిపోర్ట్‌ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియజేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
మోటారు వాహనం ధ్వంసం
♦గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు వీరఘట్టం: తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటారు వాహనాన్ని అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బండి నుజ్జునుజ్జయిందని వాహనదారుడు బలివాడ సాయికృష్ణ స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. స్థానిక జనావీధి సమీపంలో ప్రధాన రహదారిలో నివాసముంటున్న తాను ఎప్పటివలే ఇంటి ముందర ద్విచక్రవాహనం హ్యాండిల్ లాక్ వేసి ఇంటిలో నిద్రపోయానన్నారు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3 మధ్య ఈ ఘటన జరిగి ఉంటుందని తెలిపారు. దీని విలువ సుమారు రూ. 60 వేలు ఉంటుందన్నారు. పోలీస్‌లు దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తామని ఎస్సై బి.రామారావు తెలిపారు. -
వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
అల్లీపురం: విశాఖ పట్నం, గాజువాక ఆర్టీవో కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నరమేష్ ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో రమేశ్‌కు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. విశాఖపట్నంలోని సీతమ్మధార, మురళీనగర్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. -
ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్'
అరండల్‌పేట(గుంటూరు): జిల్లాలో రవాణా లెసైన్సుదారులు తమ లెసైన్సులకు ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ వి.సుందర్ కోరారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోటారు వాహన రికార్డుల్లోనూ, డ్రైవింగ్ లెసైన్సు రికార్డుల్లోనూ ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియకు కాలపరిమితి లేదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. జిల్లాలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలలోనూ అనుసంధానం చేసుకొనే వీలు ఉందన్నారు. ఇంటి నుంచే ఇంటర్నెట్ ద్వారా కూడా లెసైన్సుదారులు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చన్నారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్.ఓఆర్జీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్‌చేసి ఆధార్‌నంబర్ ఎంట్రీ బటన్ నొక్కితే అనుసంధానానికి చేయాల్సిన వివరాలు వస్తాయని, వాటి ఆధారంగా ఆధార్‌తో లెసైన్సులను అనుసంధానం చేసుకొవచ్చని చెప్పారు. 15 సంవత్సరాల కాలపరిమితి గల లెసైన్సుదారులకు మాత్రం కొత్త నిబంధన ప్రకారం తమ మోటారు వాహన రికార్డు, డ్రైవింగ్ లెసైన్సు రికార్డులతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైతే రవాణాశాఖ కార్యాలయంలో వారి రికార్డులకు తగిన భద్రత ఉంటుందని చెప్పారు. దీనిపై మారుమూల గ్రామాల్లో సైతం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో ఎల్ఎల్/డీఎల్ పరీక్షా సమయం బుక్ చేసుకొనేటప్పుడు, డీలర్ దగ్గర కొత్త వాహనం కొనే సమయంలో, ఏదైనా లావాదేవీల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నమోదు చేసుకోవాలని సూచించారు. త్వరలో మీ సేవ ద్వారా కూడా ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రాంతీయ రవాణా అధికారి బి.చందర్, పరిపాలనాధికారి కె.శ్రీధర్ పాల్గొన్నారు.