రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు | just Rs 300 runs Rs 300 crore business Meet Chinu Kala who left home at 15 | Sakshi
Sakshi News home page

రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు

Nov 28 2025 9:00 AM | Updated on Nov 28 2025 9:07 AM

just Rs 300 runs Rs 300 crore business Meet Chinu Kala  who left home at 15

రోజుకు రూ.20 సంపాదన నుండి రూ.300 కోట్లకు పైగా విలువైన బ్రాండ్‌ను నిర్మించగలమైనా ఎవరైనా కలగంటారా?  కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. చిన్న చినుకులా మొదలై, ప్రభంజనం సృష్టించిన ‘చిను కలా’  స్టోరీ వింటే... ఆత్మవిశ్వాసం, పట్టుదల , కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.

ఆమె ఏ  బిజినెస్‌ కోర్సూ చదవలేదు.  ఆమె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే ప్రతీదీ నేర్చుకున్నారు. నో కార్పొరేట్‌ సపోర్ట్‌. నో గాడ్‌ఫాదర్  నో ప్లాన్ బి . ఎలాగైనా సాధించాలనే తపన, ఆశ, కల, నమ్మకం.  కేవలం 36 చదరపు అడుగులు. ఒకే నగల ట్రే. కట్‌ చేస్తే..
 

పొట్టతిప్పల కోసం  అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు  చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు  స్ఫూర్తి దాయకం. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే అన్నట్టుగా ఎన్నో భయంకరమైన అనుభవాలనుంచి   ఎదగి ఉన్నత శిఖరాలకు చేరింది. తన బ్రాండ్‌  చిను కళాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలిపింది. 

అక్టోబర్ 10, 1981న ముంబైలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిను.  ఏడాది వయసున్నప్పుడే ఆమెను తల్లి విడిచిపెట్టి సౌదీకి వెళ్లిపోయింది. తండ్రి, రెండో పెళ్లి చేసుకొని సవతి తల్లిని తీసుకొచ్చాడు.  కష్టాలు మొదలయ్యాయి. చినుతోవాగ్వాదం సందర్భంగా నీ యిష్టం వచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు.

అంతే   15 ఏళ్ల చిను జేబులో కేవలం రూ. 300 మరియు కొన్ని బట్టలతో ఇంటి నుండి బయలుదేరింది. ఆమె టికెట్ లేకుండా నానాసుపారా నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె పడుకోలేకపోయింది. మరుసటి రోజు తాను ఎక్కడికి వెళ్లాలో, ఏమి  తినాలో అర్థంకాక రాత్రంతా ఏడ్చింది, ఉదయం, ఒక మహిళ  ఆమె  కథ విని, కమిషన్ సంపాదన కోసం ఇంటింటికీ తిరిగి అమ్మే పనిని ఒకదాన్ని అప్పగించింది.    ఏదో ఒకపనిచేసుకని, కడుపునింపుకుంటూ గౌరవంగా బతుకుతూ  పైకి ఎదగాలని విజయం సాధించాలని  అప్పుడే దృఢంగా నిశ్చయించుకుంది.

డోర్‌-టు-డోర్ సేల్ ద్వారా సేల్స్‌గర్ల్‌ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్‌లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. అలా రోజుకు 25 రూపాయలు వసూలు చేసే వసతి గృహంలో నివసించింది. ఆమె మొదటి అమ్మకాల ప్రయత్నంలో, ఒక మహిళ ఆమె ముఖం మీద తలుపు  వేసేసింది. అలా  గంటల తరబడి గుండెలు పగిలేలా ఏడ్చింది కానీ వదులుకోలేదు.  వెయిట్రెస్, రిసెప్షనిస్ట్ మొదలైన వివిధ ఉద్యోగాలను చేపట్టింది.

 కీలక మలుపు 
2002లో ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం సంపాదించడంతో చిను జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇక్కడ ఆమె తన కాబోయే భర్త అమిత్ కళను కలుసుకుంది, అతను MBA హోల్డర్, ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన మద్దతుదారుగా మారారు. వారు 2004లో వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లారు, అక్కడ చినుకు మోడలింగ్ పట్ల ఉన్న ప్రేమ ఆమెను 2008 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పోటీ పడేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఈ సమయంలో చిను ఉపకరణాలు , ఆభరణాల గురించి నేర్చుకుంది.

తన మోడలింగ్ అనుభవాల నుండి ప్రేరణ పొందిన చిను, కార్పొరేట్ మర్చండైజ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్‌ను స్థాపించింది. ఆ కంపెనీ త్వరగా ఆదరణ పొందింది, సోనీ, ESPN, ఎయిర్‌టెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లకు వస్తువులను ఉత్పత్తి చేసింది. 

2014లో, స్టైలిష్ మరియు బ్రాండెడ్ ఉపకరణాల కోసం భారతీయ ఆభరణాల మార్కెట్లో అంతరాన్ని గుర్తించి, ఆమె రూబన్స్ యాక్సెసరీస్‌న రూ. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు.  రూబన్స్ యాక్సెసరీస్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్‌లో 36 చదరపు అడుగుల చిన్న స్థలంలో ప్రారంభమైంది. అది  కాస్తా బెంగళూరులోని చాలా ప్రసిద్ధ మాల్  ఫోరం మాల్‌లో తన రెండవ స్టోర్‌ను ప్రారంభించే ‍ స్థాయికి ఎదిగింది.  అలా మొదలై చిను ప్రయాణం వినియోగదారుల ఆదరణతో కొత్త పుంతలు తొక్కింది. 

వినియోగదారుల అవసరాలపై విస్తృతమైన పరిశోధనల చేసిన  80 శాతం ప్రత్యేకమైన, స్పెషల్‌ డిజైన్లు రూపొందించింది. అలా పాశ్చాత్య , జాతి అభిరుచులకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఈ వ్యూహంతో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి, రూబన్స్ యాక్సెసరీస్ రూ. 56 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2022 నాటికి రూ. 35 కోట్లకు పెరిగింది. ఈ బ్రాండ్ ఐదు ఆఫ్‌లైన్ స్టోర్‌లకు విస్తరించింది,ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో  పాపులర్‌ అయింది.  అమ్మకాలలో 75శాతం ఆన్‌లైన్‌లో నడిచాయి. ఒక దశలో మింత్రాలో బెస్ట్ సెల్లర్‌గా   నిలిచింది.

2023లో, రూబన్స్ యాక్సెసరీస్ వార్షిక ఆదాయంలో రూ. 65 కోట్లకు చేరుకుంది. ప్రముఖ టీవీ షో "షార్క్ ట్యాంక్ ఇండియా" సీజన్ 2 నుండి ఆమె రూ. 1.5 కోట్ల నిధులను పొందింది.  IIM అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో  ప్రసంగాలు చేసింది.  పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా, చిను నికర విలువ ఇప్పుడు రూ. 40 కోట్లుగా ఉంది.ఆమె బ్రాండ్ 40 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించింది నమ్మశక్యం కాని రూ.310 కోట్లను దాటింది. ఇంతటితో ఆమె  ప్రయాణం ఆగిపోడం లేదు.  తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన ఆభరణాల బ్రాండ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అనంత క్యాపిటల్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ మాతృ సంస్థ ఫోంటే ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement