ఒక సాధారణ కాలేజీలో చదివిన అబ్బాయి..అంచెలంచెలుగా ఎదుగుతూ..ఐఐటీ రేంజ్‌లో స్టూడెంట్ రేంజ్‌లో వేతనం అందుకున్నాడు. అది కూడా..జస్ట్ రెండేళ్లలో అత్యున్నత వేతనం అందుకునే రేంజ్‌కి చేరి.. ఓ విద్యార్థి చదువుతుండగానే జాబ్ కెరీర్‌ని ఎలా నిర్మించుకోవాలో చూపించి.. యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఓ సాధారణ చిన్నకాలేజ్‌లో చదివి..ఉద్యోగం సంపాదించలేకపోయా అని సాకులు చెప్పేవాళ్లుకు అతడి కథ ఓ చెంపపెట్టు..మరి అతడి స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఏంటో చకచక చదివేద్దామా..!.
రెడ్డిట్‌లో ఒక యువ సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన స్టోరీని షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రేరణ కలిగించే అతడి స్టోరీ..అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే కాదు ఇది కథ సక్సెస్ అని కితాబిచ్చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోస్ట్‌లో తాను ఓ సాధారణ స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యేయట్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే తాను కాలేజ్‌లో చదువుతున్నప్పుడే పనిచేయడం ప్రారంభించానని, మూడో ఏడాదిలోనే..ఒక స్టార్టప్‌లో ఎస్‌డీఈ ఇంటర్న్‌గా చేరి నెలకు రూ. 25 వేలు వరకు సంపాదించనని చెప్పాడు.
జస్ట్ ఐదునెలలకే అతడి జీతం రూ. 35 వేలుకి పెరిగింది. ఆ తర్వాత చివరి ఏడాదిలో ఆ టెకీ నెలకు రూ. 45 వేల స్టైఫండ్‌తో మరో స్టార్టప్‌లో ఇంటర్న్‌గా చేరినట్లు తెలిపాడు. ఆరు నెలలకు ఏడాదికి రూ. 12 లక్షల వేతనంతో పర్మినెంట్ ఉద్యోగం ఆఫర్ అందుకున్నట్లు తెలిపాడు. చివరికి ఆ జీతం కూడా ఆ ఏడాదిలోపే రూ. 18 లక్షలకు మేర పెంచినట్లు పేర్కొన్నాడు. ఆ తదుపరి అప్రైజల్ తర్వాత తన జీతం ఏడాదికి రూ. 24 లక్షలకు చేరిందని వెల్లడించాడు.
అయితే తాను ఇంటర్న్‌షిప్ సమయంలో ఒక్కసారి మాత్రమే కంపెనీని మారినట్లు తెలిపాడు. ర్యాపిడ్ రేంజ్‌లో వృద్ధిలో వచ్చినా..ఎందుకో తనలో అసంతృప్తి వెంటాడుతోందంటూ తన రెడ్డిట్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు తన కెరీర్ మరింత ఉత్సాహభరితంగా కొనసాగాలంటే ఏం చేయాలో సూచించండి ప్లీజ్ అంటూ సలహా కూడా కోరాడు. అలాగే ఆ పోస్ట్‌లో ఆ టెకీ తాను ఇంటర్న్‌షిప్‌లలో ఎలా అధిక వేతనం అందుకోగలిగాడో కూడా షేర్ చేసుకున్నాడు.
ప్రారంభదశ స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు నిధులు సమీకరించేందుకు నేరుగా మెసేజ్‌లు పంపేవాడిని. అలాగే స్టార్టప్‌కి సంబంధించిన వార్తల సాయంతో కొత్తస్టార్టప్‌లను ట్రాక్ చేసి..తన రెజ్యుమ్‌లో తాను కోరుకుంటున్న జాబ్ గురించి వివరాలను పొందుపరిచేవాడిని..దాంతో తనకు సులభంగా మంచి స్టార్ట్‌ప్‌లలో ఉద్యోగం దక్కించుకునేందుకు హెల్ప్ అయ్యిందన్నాడు
ఈ పోస్ట్ చాలామంది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..ఓ సాధారణ కాలేజ్ నుంచి ఈ రేంజ్‌లో వేతనం అందుకోవడం అంటే మాటలు కాదంటూ ప్రశంసించడమే కాదు..తాము కూడా ఆ మార్గంలోనే పయనిస్తామంటూ పోస్టులు పెట్టారు. ఇతడి కథ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ మూవీలోని డైలాగ్ గుర్తొస్తుంది. ఈ టెకీని ఏ కాలేజ్‌లో చదివాం అన్నది కాదు..లక్షల్లో వేతనం అందుకున్నమా లేదా అన్నది మేటర్ అనొచ్చు కదూ..


