బాల్యంలోనే కష్టాలు పలకరించాయి. వైఫల్యాలు వెక్కిరించాయి. కానీ ఆ కష్టాలు అవమానా లనే విజయానికి సోపానాలుగా మల్చుకున్నాడు. కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో విజయం సాధించి పట్టుదలకు మారు పేరుగా నిలిచాడు.రాజస్థాన్‌లోని బికనీర్‌లో జన్మించిన ఆకాష్ కుల్హారీ ఐపీఎస్ అధికారిగా ఎదిగిన స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.
ఆకాష్ కుల్హారీ బాల్యంలో విద్య చాలా కష్టంగా మొదలైంది. ఉపాధ్యాయుల ప్రశంసలు, ఆదరణ లభించలేదు. 1996లో, అతను 10వ తరగతి బోర్డు పరీక్షలలో కేవలం 57శాతం మార్కులు సాధించాడు. దీంతో పాఠశాల నుంచి తొలగించారు. 11వ తరగతికి అడ్మిషన్ కోరినప్పుడు నిరాకరించారు. ఇదే ఆకాష్ జీవితంలో గొప్ప మలుపుకు పునాది వేసింది.
కుటుంబం, ముఖ్యంగా తల్లి ఇచ్చిన మద్దతుతో, ఆకాష్ బికనీర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో తన చదువును తిరిగి ప్రారంభించారు. చదువులో బాగా రాణించి 12వ తరగతిలో 85శాతం మార్కులు సాధించారు. 2001లో బికనీర్‌లోని దుగ్గల్ కాలేజీనుంచి బి.కామ్ చదివారు. అక్కితో సంతృప్తి చెంది ఆగిపోలేదు. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో, ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు)లో ఎం.కామ్ , ఎం.ఫిల్ పూర్తి చేశారు.
ఇదీ చదవండి: కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
మరోవైపు తన బిడ్డలు గొప్ప గొప్ప ప్రభుత్వ పదవుల్లో చూడాలనే తన తల్లి కలను నెరవేర్చాలనే పట్టుదల పెరిగింది. అలా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. తీవ్రమైన పోటీ ,ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాష్ 2006లో తన మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో స్థానం సంపాదించారు. ఆకాష్ కుల్హారీ కాన్పూర్‌లో అదనపు పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అనేక ఉన్నత పదవులను చేపట్టారు. ప్రస్తుతం యూపీలో ప్రజా ఫిర్యాదుల ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రధాన కార్యాలయంలో విశిష్టంగా సేవలందిస్తున్నారు. చిన్నపుడు చదువులో వెనుకబడి ఉండవచ్చుకానీ, పట్టుదల, కృషి ఉన్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి ఆకాష్ గొప్ప నిదర్శనం. ఇది కేవలం ఒక ఐపీఎస్ అధికారి కథ మాత్రమే కాదు. ఎప్పుడు ఎలా ప్రారంభించినా, గట్టిగా నిర్ణయించుకుంటే మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చుకోవచ్చు అని చెప్పే ఒక జీవిత పాఠం.
పుట్టుకతోనే మేధావి కాలేకపోవచ్చు. కానీ పట్టదలతో మేధావిగా ఎదగవచ్చు. వైఫల్యం తాత్కాలికం.. అదే అంతం కాదు. అదొక గురువు మాత్రమే ఈ మాటలు ఆకాష్ కుల్హరి సక్సెస్‌కు మచ్చుతునకలు.


