‘స్విస్‌ ఆల్ఫ్స్‌’ : వేసవిలో మంచు పరిమళం | Travel Tips In Telugu, Reasons Behind Why This Switzerland Alps Should Be Your Top Destination This Summer | Sakshi
Sakshi News home page

‘స్విస్‌ ఆల్ఫ్స్‌’ : వేసవిలో మంచు పరిమళం

Feb 23 2026 3:47 PM | Updated on Feb 23 2026 4:13 PM

Travel Tips: These Reasons To Visit the Swiss Alps This Summer

సూర్య కిరణాలు పర్వతాల మీదుగా పయనిస్తుండగా మంచు కాంతిమంతంగా కనువిందు చేసే చోటు ఏది అని అడిగితేవెంటనే ‘స్విస్‌ ఆల్ఫ్స్‌’ అని చేప్పేయవచ్చు.సమ్మర్‌లో కూడా యూరప్‌ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్‌ ఛాయిస్‌..స్విట్జర్లాండ్‌లో ఎండాకాలం కూడా మంచు ఆకర్షణ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆకాశం నీలంగా, గడ్డి పర్వతాల మీద పచ్చగా, దూరంగా మంచుపై వెలిగే చంద్రప్రభలా కనిపిస్తుంది. ఎండలో కూడా చల్లని గాలి మనసును మేల్కొలుపుతుంది..

సరోవరాల సౌందర్యం
స్విస్‌లో సరస్సులు ఎండాకాలంలో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటాయి. లేక్‌ జెనీవా తీరం దగ్గర మధ్యాహ్నం నిశ్శబ్దంగా ఉంటుంది. నీళ్లు నీలం రంగులో మెరుస్తూ, పర్వతాల ప్రతిబింబాలను తమలో కలిపేసుకుంటాయి. ఇంటర్లేకన్‌ అనే ప్రదేశంలో రెండు సరోవరాల మధ్య నిలిచిన ఊరిలో నడవడంతో పాటు, స్థానికంగా ఉన్న గడ్డి మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గడపాలని అనిపిస్తుంది.

పర్వతాల మధ్య సూర్యోదయం
స్విస్‌ ఆల్ఫ్స్‌లో ప్రతీ సూర్యోదయం ఒక గీతంలా మొదలవుతుంది. చర్చి గంటలు దూరంగా వినిపిస్తాయి. పర్వతాల నుంచి దిగే సూర్యోదయం నీలి ఆకాశాన్ని మెల్లిగా బంగారు రంగులో మెరిపిస్తుంది. జెర్మాట్‌ లాంటి అందమైన గ్రామ వీధుల్లో నడుస్తుంటే, చుట్టూ వుడెన్‌ హౌసెస్, వరండాల్లో సందడి చేసే పువ్వులు, వెనకాలే మ్యాటర్‌ హోర్న్‌ లాంటి శిఖరం చూస్తుంటే జీవితం ఎంత అందమైనదో అనిపిస్తుంది.

సందర్శనీయ స్థలాలు
ఈప్రాంతంలో జెర్మాట్‌ నుంచి మేటర్‌హార్న్పపర్వత దర్శనం అనేది ఒక నిశ్చలమైన క్షణంలా అనిపిస్తుంది. ఇంటర్లేకన్‌లో సరోవరాల మధ్య సాయంత్రం గడపడం ఒక అందమైన పెయింటింగ్‌లో మనం భాగమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే జుంగ్‌ఫ్రౌ ఉండే ప్రదేశంలో మంచు రేఖలు ఎండాకాలంలో కూడా తెలుపు వర్ణంతో జిగేలుమనిపిస్తాయి.లూసెర్న్‌ వీధిలో కెపెల్‌బ్రూక్‌ బ్రిడ్జిపై నడిచే సమయంలో ప్రాచీన కథల్లో కథానాయకులమయ్యాం అనిపిస్తుంది. లేక్‌ జెనీవా తీరంలో సాయంత్రం ఆకాశం నీలం నుంచి గులాబీ రంగులోకి మారడం ఒక లైఫ్‌టైమ్‌ మెమరీగా నిలుస్తుంది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి జూరిచ్‌ వరకు విమాన ప్రయాణం చేసి యూరోప్‌ హదయం లాంటి స్విట్జర్లాండ్‌లోని ఈ అందమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. జూరిచ్‌ నుంచి రైలులో ప్రయాణిస్తూ పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఈ యాత్రలో కనిపించే సీనరీలు యూరోప్‌ అంటే ఏంటో చూపిస్తాయి.

ఎక్కడ ఉండాలి? 
స్విస్‌ గ్రామాల్లో వుడెన్‌ చాలెట్స్‌లో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవం. బాల్కనీ నుంచి కనిపించే పర్వత శ్రేణులను చూస్తూ ప్రతీ ఉదయాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న గెస్ట్‌ హౌజుల్లో కూడా ఆత్మీయ అనుభవాన్ని పొందవచ్చు.

ఏం చూడాలి?
పర్వతాల వద్ద వాక్‌ చేయడం, సరస్సుల తీరంలో నిశ్శబ్దంగా కూర్చొని పుస్తకాలు చదవడం, కేబుల్‌ కార్లలో శిఖరాగ్రానికి చేరడంం ఇలా అనేక మరుపురాని ప్రదేశాలను చూస్తూ జీవితాంతం గుర్తుండే మెమోరీస్‌ సష్టించుకోవచ్చు.

ఏం తినాలి?
స్విస్‌లో బ్రెడ్, చీజ్‌ పరిమళం, చాక్లెట్‌ మధురిమలు చల్లని గాలిలో మరింత రుచిగా అనిపించేలా చేస్తాయి. చిన్న కేఫేలో కాఫీ సిప్‌ చేస్తూ బయట మంచు శిఖరాలను చూడడం ఇవన్నీ ఎంజాయ్‌ చేయడానికి ఫుడ్‌ లవర్‌ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్‌ నేచర్‌ను ఆస్వాదించే మనసు ఉంటే చాలు.

చేయాల్సిన పనులు
సూర్యోదయం సమయంలో మార్నింగ్‌ వాక్‌ చేయడం, సరస్సుల తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్‌ చేయడం, కేబుల్‌ కార్‌లో ప్రయాణించడం, స్థానిక గ్రామాల్లో నిశ్శబ్దంగా సంచరించడం, అక్కడి వెరైటీ ఫుడ్‌ను ఆస్వాదించడం ఇలా మీరు ఎన్నో యాక్టివిటీస్‌ ΄్లాన్‌ చేసుకోవచ్చు.

మంచును ఇష్టపడే మనసుకు.. ప్రశాంతతనిచ్చే మంచి ప్రదేశం. ఎండాకాలం అంటే వేడి అని మాత్రమే అనుకుంటాం. కానీ స్విస్‌ ఆల్ఫ్‌స్‌లో సమ్మర్‌ అంటే ఒక ఎవర్‌గ్రీన్‌ కూల్‌ మెమోరీని సొంతం చేసుకునే సమయం. ఇక్కడ సూర్యుడూ నేచర్‌ను ఎంజాయ్‌ చేస్తూ కూల్‌గా కనిపిస్తాడు. అందుకే యూరోప్‌ ఒక ఎవర్‌గ్రీన్‌ ట్రావెల్‌ డెస్టినేషన్‌గా నిలిచింది.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు  

Advertisement
 
Advertisement
Advertisement