సందర్భం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్‌కు బదులు రాజకీయ దావోస్ అయింది.
మిత్రుల మధ్యే భేదాభిప్రాయలు
తిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్‌లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!
అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్‌పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్‌లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్‌ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్‌లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.
గ్రీన్‌ల్యాండ్‌తో పైపైకి...
ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్‌ల్యాండ్‌ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్‌కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్‌లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.
ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్‌లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.
ఢీ అంటే ఢీ
పరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్‌ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్‌ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్‌ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.
ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్‌లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్


