న్యూయార్క్ ఫాదమ్ యూనివర్సిటీ ‘స్నాతకోత్సాహం’; అంతర్‌చిత్రం యాంజీ మాంజీనో
విశ్వ గురు
ఇక్కడ ఇలా న్యూయార్క్‌లో రోజ్ హిల్‌పై నిలబడి స్నాతకో పన్యాసం చేసే అవకాశం దక్కడం నాకు సంతోషంగా ఉంది. ఇదే ఫాదమ్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తిని ఈ ఆవరణలోని చర్చిలోనే పెళ్లాడాను. నేను ఫాదమ్ నుంచి పట్టభద్రు రాలినైనపుడు స్నాతకోపన్యాసం చేసిన వ్యక్తి, అందరూ ఇచ్చే సలహాలనే ఇచ్చారు. కలలను సాకారం చేసుకొమ్మన్నారు. కష్టపడి పనిచేయమన్నారు. ప్రపంచానికి ఏదైనా నవ్యతను చూపమన్నారు. అది తప్పకుండా సరైన సలహానే! కానీ, ఎవరూ చెప్పని ముఖ్యమైన విషయం ఒకటుంది. నేను అది 22 ఏళ్ల వయసులోనే గ్రహించి ఉంటే బాగుండేదనిపిస్తోంది!
ఊగిసలాట ఎటూ వెళ్లనివ్వదు!
అందరూ వెళ్లే ఉపాధి దారిలో వెళ్లాలా? లేక అభిరుచిని బట్టి జీవించాలా అనే ఊగిసలాటను వదిలేయండి. ఒకే సమ యంలో ఈ రెండింటినీ హాయిగా అనుసరించవచ్చు. అది రెండు పడవల ప్రయాణం కాదా అనుకోకండి! అయితే మాత్రం ఏమిటి? నిజం చెప్పాలంటే, అదే సరైన మార్గం. నాకు ఇది ఎవరూ చెప్పలేదు. నా స్వానుభవాన్నే వివరిస్తా. ఇక్కడ చదువు కుంటున్నప్పుడే రచనా వ్యాసంగంలో మునిగిపోయాను. ఒక వార్తా పత్రికకు పని చేసేదాన్ని. ఆ పత్రిక ఇయర్ బుక్ రూపొందించడంలో లెక్కలేనన్ని గంటలు గడిపాను. వార్తా కథనాలు రాయడం, ఇంటర్వ్యూలు చేయడం, అచ్చులో నేను రాసిన వాటిని చూసుకోవడం నాలో జవజీవాలను నింపేవి. నా రచనలు నేనేమిటో తెలిపాయి. రచయితగా రాణించాలన్నదే నా కల. అలా అభిరుచి ననుసరించి నడచుకోవడంతో, ప్రపంచానికి ఏదో అర్థవంతమైన దానిని అందిస్తున్నానని సంతృప్తిగా ఉండేది.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి నేనూ మనలో చాలామంది లాగానే ఆలోచించాను. చదువుకు చేసిన రుణాలు తీర్చాలి. కుటుంబం నా మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలి. దాంతో రచనా వ్యాసంగం కుదిరే పని కాదని అనిపించింది. ఏదైనా ఉద్యోగం చూసుకుని, అందులో స్థిరపడిన తర్వాత రచనలు కొనసాగించవచ్చు అనుకున్నాను. మొదట ఆఫీస్ మేనేజర్‌గా చేరాను. ఒడుదొడుకులు లేని ఉద్యోగం. గౌరవ ప్రదమైంది. ఆరోగ్య బీమా సదుపాయం కూడా ఉంది. ఠంచనుగా జీతాలిస్తారు. ‘ఇది తాత్కాలికమే. ఆర్థికంగా పునాదులను పటిష్ఠపరచుకుని, పరిస్థితులు కుదుటపడ్డాక నేను ఇష్టపడే జర్నలిజంలోకి దూకేస్తానులే! అని నాకు నేను సర్ది చెప్పు’ కున్నాను.
వాయిదా వేస్తే కలలు ఫలించవు!
మనకు మక్కువ ఉన్న దానిపై దృష్టి పెట్టకపోతే తాత్కా లికం అనుకున్న పరిస్థితులు శాశ్వతమై కూర్చుంటాయి. ఏళ్లు గడిచాయి. పెళ్లయింది. ముగ్గురు పిల్లల తల్లినయ్యాను. జీవితంలో ఒక్కొక్క దశ గడుస్తున్నకొద్దీ నాకు ఎంతో ఇష్టమైన రచనా వ్యాసంగం కూడా దూరమవుతూ వచ్చింది. అందుకు కారణం నాకు ఇష్టం తగ్గడం కాదు. ‘‘కుదిరితేనే ఇష్టపడే రంగంలోకి వెళ్లాలి. లేకపోతే, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి’’ అనుకోవటమే నేను చేసిన తప్పు. మీలో కొందరు వైద్యం, న్యాయం, పూర్తి సమయం కేటాయించవలసిన తదితర వృత్తుల వైపు మళ్లవచ్చు. మీరు ఇష్టపడి చేయాలనుకుంటున్న పనికీ, వాటికీ పొంతన కుదరదు అనిపించవచ్చు.
కానీ, ఆ రంగాలలో ఉంటూ కూడా మీరు మీకు ఇష్టమైన వ్యాసంగాన్ని విడిగా కొనసాగించవచ్చు. ఉద్యోగం చేసుకుంటూనే ఇతర ఆసక్తులను స్వీకరించవచ్చు. ఏదైనా ఒక ప్రయోజనం కోసం పాటుపడ వచ్చు. కోరుకునే పరిపూర్ణమైన జీవితాన్ని గడించుకోవచ్చు. మీ కలలను సాకారం చేసుకునేందుకు మిగిలిన అవకాశాలన్నింటినీ కాలదన్నుకోనవసరం లేదు. నేను కూడా నా రచనా వ్యాసంగాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చి ఉండవలసింది. భోజన విరామ సమయాలలో ఏ ఆర్టికల్స్ రాస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ వారాంతాలలో ఫ్రీలాన్సింగ్ చేసుకుని కూడా ఉండవచ్చు. కానీ అలా చేయలేకపోయాను.
ఎవరికి వారే సృష్టించుకోవాలి!
‘ఏదో ఒక నాడు’ నా కలలను నెరవేర్చుకుంటాననే మూస ధోరణిలో నేను ఉండిపోయాను. అన్నీ కలిసొచ్చే రోజు ఏదో ఒకనాడు వస్తుందని నాకు నేను చెప్పుకుంటూ రోజులు దొర్లించాను. వాస్తవం ఏమంటే, ఆ ‘ఏదో ఒక నాడు’ దానంతట అది రాదు. దాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎట్టకేలకు నేను వృత్తిపరంగా రాయడం మొదలుపెట్టాను. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ విధంగా మొదలుపెట్టగలిగి ఉండేదాన్నో ఆ తర్వాత కూడా అదే విధంగా శ్రీకారం చుట్టవలసి వచ్చింది. దాంతో నాకు ఇష్టమైన రంగంలో స్థిరపడేందుకు మామూలుగా పట్టాల్సిన దానికన్నా ఎక్కువ కాలమే పట్టిన మాట నిజం. కానీ, ఆ ప్రయాణం నాలో మనోనిబ్బరాన్ని ఏర్పరచింది. జీవితానుభవా లను కలిగించింది. అవి నా రచనలను పరిపుష్టం చేశాయి. విజయం సాధించేందుకు ‘సరైన ముహూర్తం’ పెట్టుకోనవసరం లేదని గ్రహించాను. మీరు కంటున్న కలలకు మీరున్న పరిస్థి తులు అనువుగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడు న్నారో అక్కడ నుంచే, అందుబాటులో ఉన్నవాటితోనే అభిరు చికి తగ్గ పనికి శ్రీకారం చుట్టవచ్చు. ఈ క్షణం నుంచే ఆ పని మొదలుపెట్టవచ్చు.
మీకో నెట్‌వర్క్ నిర్మించుకోండి!
ఏ పనైతే మీలో కళాకాంతులను నింపుతుందో ఆ పనిని త్యజించేందుకు బాధ్యతను ఒక సాకుగా చూపే ప్రయత్నం చేయకండి! ఉదాహరణకు, మీరు చిత్ర దర్శకులు కాదలచుకుంటే, నెలకొక చిన్న వీడియో మీ ఫోన్‌తో తియ్యండి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చెయ్యండి. వీక్షకుల స్పందనల నుంచి పాఠాలు నేర్చుకోండి. లాభాపేక్ష లేని సంస్థను నెలకొల్పదలిస్తే, ఉద్యోగం సజావుగా చేసుకుంటూనే, ప్రతి శనివారం రెండు గంటలు స్వచ్ఛంద సేవకు వెచ్చించండి. వ్యాపార సంస్థను ఏర్పాటు చేయదలిస్తే, వచ్చే ఆరు నెలలపాటు ప్రతి ఆదివారం, మీ వ్యాపార ప్రణాళికకు మెరుగులు దిద్దుకుంటూ రండి. ఒక నెట్ వర్క్‌ను నిర్మించుకోండి.
నారు, నీరు పూర్తిగా మీ బాధ్యతే!
ఇపుడు మనం నివసిస్తున్న కాలం మనకు ఎన్నో అవకా శాలు కల్పిస్తోంది. ఆన్‌లైన్ వేదికల ద్వారా రచనా సామర్థ్యాన్ని వృత్తి జీవితంగా మలుచుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా కన్సల్టింగ్ ప్రాక్టీసు ప్రారంభించవచ్చు. నిధుల సేకరణ ద్వారా సృజనాత్మక ప్రాజెక్టుకు కార్యరూపం ఇవ్వ వచ్చు. ఇవన్నీ, చేస్తున్న ఉద్యోగం మానకుండానే చేయవచ్చు. అదో ఇదో – ఏదో ఒకటే అనుకోవద్దు! రెండింటినీ నిర్వహించ గలమని అనుకోండి. మీరు ఆచరణాత్మకంగానూ ఉండవచ్చు, మక్కువ కలిగిన దానినీ చేపట్టవచ్చు. బాధ్యతాయుతంగా మెలగుతూనే, రిస్క్ తీసుకునేందుకు మొగ్గు చూపవచ్చు. దేనికీ లోటు లేకుండా చూసుకుంటూనే కలలను కార్యరూపంలో పెట్ట వచ్చు. అయితే, కలలను నిజం చేసుకోవాలనే బలమైన కోరిక అవసరం. దానికి నారు, నీరు పోసే బాధ్యత మీదే!
నాకు 22 ఏళ్ల వయసప్పుడే నాకు ఎవరన్నా ఈ సంగతి చెప్పి ఉండాల్సిందని నేను అనుకునే మరో సంగతిని మీకు ఇప్పుడు చెబుతాను. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేక పదం కాదు. విజయంలో అదొక భాగం. నేను రాసిన వాటిలో ఎడిటర్ తిర స్కరించిన ప్రతి వ్యాసమూ, నా కళకు, పరిశ్రమకు సంబంధించి నాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూ వచ్చింది. నేను పూర్తి చేసిన ప్రతి ఫ్రీలాన్స్ ప్రాజెక్టు, నాకు పారితోషికం పెద్దగా తెచ్చిపెట్టనివి కూడా, నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప జేసుకునేందుకు సహాయపడ్డాయి.
ప్రయత్న లేమి... నిజమైన వైఫల్యం!
మీరు అనుకుంటున్న దానికన్నా మీరు ఎక్కువ సమర్థులనీ, చతికిలపడినా తిరిగి నిలబడగల శక్తి మీలో ఎక్కువే ఉందనీ, మీరూ సృజనశీలురేననీ గుర్తు పెట్టుకోండి. అన్నింటి పైనా ఈరోజే అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ భద్రత – మనం కంటున్న కల, రెండి టిలో ఏదో ఒక దానినే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. చిన్న అడుగులు వేయడంతో ప్రారంభించండి. తప్పటడుగులైనా ఫరవాలేదు. నడక మొదలెట్టడం ముఖ్యం. అవసరాలు తీర్చగల ఉద్యోగంలో చేరండి. కానీ, అది మీ ఆత్మను మింగేయకుండా చూసుకోండి! ఆచరణాత్మక పంథాను అనుసరిస్తూనే, కలల బాటను కూడా సజీవంగా ఉంచుకోండి. వయోజనులుగా బాధ్యతతో మెలగండి. కానీ, వయసు మోసుకొచ్చే బాధ్యత మీ కలలను సమాధి చేయకుండా చూసుకోండి. భద్రతతోపాటు అనిశ్చితిని కూడా అక్కున చేర్చుకోండి. ఉద్యోగాలు చేస్తూనే, సొంత కలలను సాకారం చేసుకోండి. అది మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని నమ్మండి.


