ఒక విఫల కుట్ర – ఒక సామ్రాజ్య జననం! | Sakshi Guest Column On Julius Caesar assassination, conspiracy | Sakshi
Sakshi News home page

ఒక విఫల కుట్ర – ఒక సామ్రాజ్య జననం!

Mar 13 2026 4:08 AM | Updated on Mar 13 2026 4:08 AM

Sakshi Guest Column On Julius Caesar assassination, conspiracy

జూలియస్‌ సీజర్‌ హత్యా దృశ్యం

టైమ్‌ మిషన్‌

అది క్రీస్తుపూర్వం 44వ సంవత్సరం, మార్చి 15వ తేదీ మధ్యాహ్నం. రోమ్‌ నగరంలోని సెనేట్‌ హాల్‌ రక్తంతో తడిసి ముద్దయింది. నియంతృత్వం నుంచి రోమన్‌ రిపబ్లిక్‌ను రక్షించాలనుకున్న సుమారు అరవై మంది కుట్రదారులు... ఆ కాలపు అత్యంత శక్తిమంతుడైన జూలియస్‌ సీజర్‌ను కత్తులతో పొడిచిచంపారు. ఆ క్షణంలో వారు తాము ఒక నియంతను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడామని భ్రమపడ్డారు. సీజర్‌ మరణం ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లజేయడం అటుంచి... పదమూడేళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికీ, తద్వారా ఒక నిరంకుశ సామ్రాజ్య ఆవిర్భావానికీ దారితీసింది. ఈ హత్య ప్రపంచ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక రాజకీయ పరిణామంగా మిగిలి పోయింది.

రోమన్‌ రిపబ్లిక్‌ను పాలిస్తున్న పాలక వర్గం (నొబిలిటీ) అప్పటికే అవినీతిలో కూరుకుపోయి, సామాన్య ప్రజల దృష్టిలో విశ్వసనీయతను కోల్పోయింది. రోమన్‌ ప్రభువులు విదేశీ దండ యాత్రల ద్వారా వచ్చే సంపదను పంచుకోవడంలో నిమగ్నమై, దేశీయ సమస్యలను విస్మరించారు. సామాన్య ప్రజలు, రైతులు నిరుపేదలుగా మారుతుంటే... వ్యాపారవేత్తలు, ప్రభు వర్గీయులు మరింత ధనవంతులయ్యారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో... వ్యవస్థలోని శూన్యాన్ని పూరించడానికి సీజర్‌ వంటి ఒక శక్తిమంతు డైన సైనిక నాయకుడు అవసరమయ్యాడు. ముక్కలైన రోమన్‌ వ్యవస్థను తనదైన పద్ధతిలో చక్కదిద్దాలనే లక్ష్యంతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందుకు సాగాడు సీజర్‌. అతడు ఒక అసాధారణ మేధావి. యుద్ధతంత్రంలోనే కాక, రాజకీయ వ్యూహ రచనలోనూ దిట్ట. గాల్‌ (ప్రస్తుత ఫ్రాన్స్‌) ప్రాంతాన్ని జయించడం ద్వారా అపారమైన సంపదను, సైనిక బలాన్ని, ప్రజల్లో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. 

అయితే, అతడి ఈ అద్భుతమైన ఎదుగుదల పాత తరం సెనేటర్లలో భయాన్ని కలిగించింది. అతడు తన పాలనలో అనేక సామాజిక, రాజకీయ సంస్కరణలను చేపట్టాడు. భూములను పంపిణీ చేయడం, క్యాలెండర్‌ను సంస్కరించడం, సెనేట్‌ పరిధిని పెంచి మరింత మందికి అవకాశం కల్పించడం వంటి చర్యలు ప్రభువర్గీయులను బెంబేలెత్తించాయి. ఇదే సమయంలో సీజర్‌ తనను తాను ‘జీవితకాలపు నియంత’ అని ప్రకటించుకుని రాజ కీయంగా పెద్ద తప్పు చేశాడు. ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను రాచరికం వైపు మరల్చడాన్ని సెనేటర్లు సహించలేకపోయారు. అదే సమ యంలో క్లియోపాత్రాను రోమ్‌కు తీసుకురావడం వంటి చర్యలు ప్రజాభి ప్రాయాన్ని అతనికి వ్యతిరేకంగా మార్చాయి. క్షమాగుణం కూడా అతడికి ముప్పు తెచ్చింది. బ్రూటస్, కాసియస్‌ వంటి తన మాజీ శత్రువులను క్షమించి, వారికి ఉన్నత పదవులను ఇచ్చాడు. అయితే తాను ప్రేమించిన, నమ్మిన వ్యక్తే తనపై కత్తి ఎత్తినప్పుడు ‘నువ్వు కూడానా, బ్రూటస్‌?’ (యూ టూ బ్రూటస్‌?) అని అతడన్న మాటలు ఆనాటి అతని మానసిక వేదనకు నిదర్శనం.

హత్యలతో వ్యవస్థను మార్చవచ్చా?
సీజర్‌ హత్య తర్వాత కుట్రదారులు ఆశించినట్లుగా స్వేచ్ఛ తిరిగి రాలేదు. నిజానికి సీజర్‌ హత్య తర్వాత రోమ్‌ మరింత అరా చకంలోకి వెళ్ళింది. అతడి వారసుడైన అగస్టస్‌ కాలంలో రోమ్‌ పూర్తిస్థాయి సామ్రాజ్యంగా మారింది. కుట్రదారులు సీజర్‌ను చంపి అతడిని ఒక ‘అమర వీరుడిని’ చేశారు. ఒక వ్యక్తిని అంతం చేయవచ్చు కానీ, అతను నెలకొల్పిన వ్యవస్థనూ, ఆలోచనలనూ అంతం చేయడం సాధ్యం కాదని చరిత్ర నిరూపించింది. జూలి యన్‌ క్యాలెండర్‌ నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో అమలులో ఉండటం విశేషం. నేటి గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ కూడా సీజర్‌ ప్రవేశపెట్టిన క్యాలెండర్‌కు చిన్న సవరణ మాత్రమే!

ప్రపంచ చరిత్రపై సీజర్‌ ప్రభావం అపారమైనది. అతని పేరు కేవలం ఒక వ్యక్తి పేరుగా మిగిలిపోకుండా, ఒక ‘సర్వోన్నత అధికారం ఉన్న వ్యక్తి’కి బిరుదుగా మారింది. జర్మనీలో ‘కైజర్‌’, రష్యాలో ‘జార్‌’, ఇస్లామిక్‌ ప్రపంచంలో ‘ఖైసర్‌’ వంటి పదాలు సీజర్‌ పేరు నుండే పుట్టుకొచ్చాయి. భాషా పరంగా చూస్తే, అతడు పుట్టిన నెల గౌరవార్థం ‘జూలై’ అనే పేరు స్థిరపడిపోయింది. సీజర్‌ జీవితం, మరణం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మార్పును నిరోధించే ప్రయత్నం ఒక్కోసారి ఆ మార్పును మరింత వేగవంతం చేస్తుందని! వ్యవస్థల బలహీనతలను వ్యక్తి గత హత్యలతో సరిదిద్దలేమనీ, ప్రజాస్వామ్య సంస్థలు బలంగా లేకపోతే అధికార పోరాటాలు దేశాన్ని అస్థిరతలోకి నెడతాయనీ తేటతెల్లమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement