బీమా డబ్బుల కోసం భర్త హత్య | Husband assassinated for insurance money | Sakshi
Sakshi News home page

బీమా డబ్బుల కోసం భర్త హత్య

Mar 9 2026 5:12 AM | Updated on Mar 9 2026 5:12 AM

Husband assassinated for insurance money

మరో నలుగురితో కలిసి భార్య పథక రచన

ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఖమ్మం రూరల్‌: ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్‌ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్‌ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్‌ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్‌ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. 

సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్‌.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్‌ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్‌ ప్రకారం జోగి వెంకటేశ్‌కు చెందిన కారును రాజ్‌కుమార్‌ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. 

తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement