ఇందిరమ్మలో టాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మలో టాప్‌

Mar 9 2026 7:33 AM | Updated on Mar 9 2026 7:33 AM

దర్జాగా సొంత ఇంట్లో..

గ్రౌండింగ్‌ అయిన ఇళ్లలో

70 శాతం పూర్తి

ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్‌, జనగామ, వరంగల్‌, యాదాద్రి

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న

ఇంటి నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జనగామ, వరంగల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో గ్రౌండింగ్‌ అయిన ఇళ్లలో 70.25 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం విశేషం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ప్రణాళికాయుతంగా పథకం

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించడమే కాక, ఆ నిధులతోనే మోడల్‌హౌస్‌లు నిర్మించి చూపించింది. వీటి ఆధారంగా అధికారులు మేసీ్త్రలు, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 400 చదరపు అడుగుల్లో హాల్‌, కిచెన్‌, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో బెడ్‌రూమ్‌, ఇంటి లోపల గదులు, వరండాల్లో టైల్స్‌ వేశారు. డాబా మెట్ల కింద మరో టాయిలెట్‌ నిర్మించారు. ఇంట్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, రంగులు వేయడం ఇలా అన్ని పనులూ ఈ బడ్జెట్‌లోనే ఎలా పూర్తిచేయొచ్చో వివరించారు.

ఐదు జిల్లాల్లో జెట్‌ స్పీడ్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రౌండింగ్‌ అయిన 14,470 ఇళ్లల్లో 10,165 నిర్మాణాలు పూర్తి కాగా 70.25 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 58.34 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, 57.50 శాతంతో జనగామ, 57.31 శాతంతో వరంగల్‌, 31.71 శాతంతో యాదాద్రి భువనగిరి రెండు నుంచి ఐదో స్థానం వరకు దక్కించుకున్నాయి.

జిల్లాకు 16,524 ఇళ్లు..

జిల్లాకు తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద 26 గ్రామాల్లో 867 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో 15,657 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 16,524 మంజూరు కాగా.. 2,054 ఇళ్లు మినహా మిగతావి పునాదులు, గోడలు, స్లాబ్‌ దశల్లో ఉన్నాయి. మొత్తం 988 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. ఎవరైనా ఇళ్లు ప్రారంభించకపోతే అవగాహన కల్పిస్తున్నారు.

నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లికి చెందిన మరికంటి పద్మ, వెంకన్న దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు. సెంటు భూమి లేకపోగా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. 16ఏళ్ల క్రితం వెంకన్న మృతిచెందగా కుటుంబ భారం పద్మపైనే పడింది. ఒక కూతురుకి వెంకన్న ఉండగానే వివాహం చేశారు. ఆ తర్వాత పద్మ కూలీ పనులు చేస్తూ మిగిలిన ముగ్గురు కూతుర్లకు వివాహాలు జరిపించింది. పక్కా ఇల్లు లేక శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే ఈ కుటుంబం కాలం వెళ్లదీసింది. ప్రభుత్వం ఆమెకు ఇంది రమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తిచేసుకుని సంతోషంగా జీవిస్తోంది. వర్షం పడితే ఎప్పుడు కూలుతుందోనన్న భయం లేకుండా హాయిగా ఉంటున్నామని చెబుతోంది.

రాష్ట్రంలోనే

ఖమ్మం ముందంజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement