ఖమ్మం సహకారనగర్ : మహిళలకు సమాన హక్కులు, సమ న్యాయం ఉండాలని టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని టీజీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మహిళలకు సమాన వేతనం, విద్య, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, టీజీఓస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.అనిత, పి.సుధారాణి, మహిళా ఉద్యోగులు వేల్పుల విజేత, నవీన, జ్యోతి, రాధా, లలిత, అరుణ, శారద, లావణ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యలను సులభంగా పసిగట్టడం, నిర్వహణ పనులను సమర్థవంతంగా చేసేందుకు జీఐఎస్(జియోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) అసెట్ మ్యాపింగ్ పనులను ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో వేగవంతం చేశారు. జిల్లాలోని 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 33 కేవీ లైన్లలోని 55 ఫీడర్లలో పనులు పూర్తి కాగా, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లలో యూనిక్ పోల్ నంబర్ పెయింటింగ్ పనులు ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా స్తంభాల వారీగా పెట్రోలింగ్ నిర్వహించడం సులభమని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను ట్రాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్ నంబర్ ఆధారంగా వెంటనే లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకోవచ్చని, తక్షణమే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించవవ్చని వివరించారు. తద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణతో అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు.
పల్లె ప్రగతి పనులు
పకడ్బందీగా నిర్వహించాలి
బోనకల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా పల్లెప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు అన్నారు. మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్ గ్రామాల్లో నిర్వహిస్తున్న పనులను ఆదివారం ఆయన ఎంపీడీఓ రమాదేవితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించే పనులతో పల్లెల రూపురేఖలు మారుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం మెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మే 31 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఏప్రిల్ 2న అన్ని పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బానోతు జ్యోతి, ఉపసర్పంచ్‌లు అమిరేశి సీతయ్య, బానోతు కొండ, కార్యదర్శులు సైదులు, కోలా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణకు వెళ్లిన ఆర్టీఓ
ఖమ్మంక్రైం : జిల్లా రవాణా శాఖాధికారి జగదీష్ విధులకు సంబంధించిన శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆయన 45 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. గ్రూప్–1 విభాగంలో ఆర్టీఓగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన జగదీష్.. వాహనదారులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలకు సంబంధించి శిక్షణ కోసం వెళ్లారని ఆ శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన వచ్చేవరకు ఎంవీఐ శ్రీనివాస్ ఇన్‌చార్జ్ ఆర్‌టీఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


