ఖమ్మంవైద్యవిభాగం : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో మహిళలకు గర్భాశయ కేన్సర్ రాకుండా నివారించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని రేడియాలజీ హబ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌమార బాలికలకు హెచ్‌పీవీ టీకా వేస్తే భవిష్యత్‌లో గర్భాశయ కేన్సర్‌ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా వేస్తామని తెలిపారు. అనంతరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో మాట్లాడుతూ హెల్త్‌కేర్‌లో నర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఈ కోర్సు పూర్తి చేశాక దేశంలోనే కాక విదేశాల్లోనూ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
పారిశుద్ధ్యంలో మార్పు కనిపించాలి
వారం రోజుల వ్యవధిలో ఆస్పత్రి పారిశుద్ధ్యంలో స్పష్టమైన మార్పు కనిపించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. క్రిటికల్ కేర్ కేంద్ర భవనం నిర్మాణ పనులను, పార్కింగ్ స్థలం, ఆస్పత్రి పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పార్కింగ్ నిర్వహణకు ఒక ఏజెన్సీని గుర్తించి బాధ్యతలు అప్పగించాలని, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పనికి రాని పాత ఫర్నిచర్, ఎక్విప్మెంట్ తొలగించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు 200మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా.. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్, ఆర్‌ఎంఓ రాంబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
నేటి నుంచి మినీ సరస్ మేళా
ఖమ్మం సహకారనగర్ : డీఆర్డీఏ, నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈనెల 14 వరకు మినీ సరస్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని, ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ పక్కన గల హెల్త్ మార్కెట్‌లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


