కన్న తండ్రే కాలయముడయ్యాడు.. | Father assassinated three children in kamareddy | Sakshi
Sakshi News home page

కన్న తండ్రే కాలయముడయ్యాడు..

Mar 8 2026 4:22 AM | Updated on Mar 8 2026 10:00 AM

Father assassinated three children in kamareddy

పోషించలేక ముగ్గురు పిల్లలను చంపేసిన తండ్రి 

చెరువులో తోసేసి హతమార్చిన వైనం 

ముగ్గురి మృతదేహాలు లభ్యం

కామారెడ్డి ఆర్‌బీనగర్‌ కాలనీలో ఘటన

కామారెడ్డి క్రైం: పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తో సేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డిలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్‌బీనగర్‌ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్‌(8), అయాత్‌(7), మరియం(5) ఉన్నారు. ఇస్మాయిల్‌ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 

శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కుమార్తెలను దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్లాడు. దగ్గర్లోని దుకాణానికి వెంట తీసుకువెళ్లిన తండ్రి, పిల్లలలు ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి షబీనా భర్తకు ఫోన్‌ చేసి పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదని అడిగింది. తాను పిల్లలకు తినుబండారాలు కొనిచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని సూచించి ఆటో నడిపేందుకు బయటకు వెళ్లిపోయాన ని బుకాయించాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. 

అందరూ కలిసి చాలా సేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటిపడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్‌ను విచారించగా తానే పిల్లలల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. 

పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. షీపత్‌ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. విషయం బయటకు తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషణ భారమై పిల్లలను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్‌ అంగీకరించాడని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement