చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి | International Womens Day celebrated in Chandanagar | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

Mar 8 2026 4:15 AM | Updated on Mar 8 2026 4:15 AM

International Womens Day celebrated in Chandanagar

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

చందానగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవం 

40 మంది మహిళలకు పురస్కారాలు

చందానగర్‌: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. శనివారం చందానగర్‌లో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మాజీ కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందన్నారు. రాజకీయాలు కూడా దానికి అతీతం కాదన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు కూడా కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచనలు చేశారు.

ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. 

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో› 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం సబితారెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ మహిళలకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. 

కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మహిళలకు భద్రత, రక్షణ కావాలంటే కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన సుమారు 40 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement