వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ
మొత్తం 8మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు
ఈనెల 31న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ
ఎన్నికలప్పుడు ప్రభుత్వ పథకాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే వారికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది, ఈనెల 31న సీఎస్‌గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు.
ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్‌రెడ్డి సీఎస్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్‌గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్‌కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
అన్నీతానై...
జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు.
ఆ తరువాత ‘టాస్‌్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్‌గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్‌రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు.
మిగిలిన వారు ఎలా..?
ఇక వికాస్‌రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్‌లో స్పెషల్ సీఎస్‌గా ఉన్న శశాంక్‌గోయల్‌ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్‌జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్‌కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు.
ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్‌మిత్తల్, దాన కిషోర్‌లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్‌రెడ్డి పట్టం కడతారని సమాచారం.


