చరిత్రాత్మక విజయం: రబీ లమిఛానే, బాలేంద్ర షా
సందర్భం
నేపాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా చూసినా అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన విజయం అనాలి. అట్లాగే ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు కానున్నాయి. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు ఇంతవరకు పాలించిన పార్టీల వైఫల్యం వల్ల తీవ్ర రూపానికి వచ్చినందున, అవి సులభంగా పరిష్కారమయేవి కావని వేరే చెప్పనక్కరలేదు. కొత్త ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం ఆ దిశగా ఎట్లా పురోగమించగలదన్నదే ఇక గమనించవలసిన విషయమవుతున్నది. అందుకోసం వెంటనే కనిపిస్తున్న ఒక సానుకూల స్థితి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్.ఎస్.పి.)కి సుస్థిరమైన ఆధిక్యత లభించటం. 2008లో రాచరికం రద్దయి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ 18 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారటమనే అసాధారణ స్థితిని బట్టి దేశంలో ఎంతటి అస్థిరత కొనసాగిందో గ్రహించవచ్చు.
వాస్తవానికి 3 ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్(యూఎంఎల్), మావోయిస్టు పార్టీలలో దేనికీ పూర్తి ఆధిక్యత రాకున్నా ఏ ఇద్దరో కలిసి తగిన మెజారిటీతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అటువంటప్పుడు 5 ఏళ్ళ పాటు పాలించేందుకు సమస్య ఉండకూడదు. గత 18 ఏళ్ళలో 4 ప్రభుత్వాలే రావాల్సింది. కానీ కేవలం పార్టీ నాయకుల అధికార దాహం, అవకాశవాదం, అవినీతి వల్ల ఏ ప్రభుత్వమూ సరిగా సాగలేదు. ఫలితంగా అస్థిరత అన్నది పరిపాలనా వైఫల్యాల కన్నా పెద్ద సమస్యగా మారింది.
అనుభవం లేకపోయినా...
ఎన్నికల ఫలితాలు కూడా జెన్–జీ తిరుగుబాటును పోలిన భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. తక్కిన మూడు పార్టీలు దశాబ్దాలుగా ఉన్నవి కాగా, ఇపుడు గెలిచిన ఆర్‌ఎస్‌పి కేవలం 2022లో ఏర్పడినట్టిది. దానిని స్థాపించిన రబీ లమిఛానే రాజకీయానుభవం ఎక్కువేమీ కాదు. గత ఎన్నికలలో సుమారు 20 సీట్లు గెలిచి కె.పి. శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయిన తను, తర్వాత బయటకు వచ్చి స్వతంత్ర రాజకీయం సాగించారు. ఆయనకు రాజకీయ నాయకునిగా కన్నా జర్నలిస్ట్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా ఎక్కువ పేరుండటం గమనించదగ్గది. తన వృత్తి పరమైన కార్యక్రమాలలో ఆయన మూడు పార్టీలను తీవ్రంగా విమర్శిస్తుండేవారు.
విశేషమేమంటే, అదే పద్ధతిలో విమర్శిస్తుండిన ర్యాప్ సింగర్ బాలేంద్ర షా, రాజకీయ అనుభవం ఎంత మాత్రం లేకున్నా, ఖాఠ్మండు మేయర్ పదవికి 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 61,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంచి పనులు అనేకం చేసి ప్రజాదరణను మరింత పెంచుకుని, జెన్–జీ మద్దతుతోనే మధ్యంతర జస్టిస్ కర్కీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇదంతా చెప్పటం ఎందుకంటే, ఇంచుమించు ఒకే విధమైన నేపథ్యాలు ఉండిన, అవి కూడా కొద్ది కాలపు అనుభవంతోనే కూడుకున్నవి అయినా, లమిఛానే, బాలేంద్ర షా కలిసి పాత పార్టీలను చిత్తు చేసి గత 18 ఏళ్ల పరిస్థితికి భిన్నంగా ఇపుడు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరికీ తమ స్థానాలలో ఘనమైన మెజారిటీలు రావడం, బాలేంద్రతో పోటీ పడిన మాజీ ప్రధాని ఓలీ తీవ్ర పరాభవానికి గురి కావటమన్నది జెన్–జీ తరంతో పాటు మొత్తంగా ప్రజలలోనే నెలకొన్న ఆలోచనలకు అద్దం పడుతున్న పలు దృష్టాంతాలలో కొన్ని మాత్రమే!
మట్టి కరిచిన పార్టీలకు సంబంధించి చెప్పుకోక తప్పని విశేషం మరొకటి విశేషం. నేపాలీ కాంగ్రెస్ గత శతాబ్దం మధ్య నుంచే భారతదేశంలోని కాంగ్రెస్ స్ఫూర్తితో, మద్దతుతో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం తీవ్రమైన ఉద్యమాలు సాగించింది. కొన్ని దశలలో ఆయుధాలు సైతం చేపట్టింది. కొంతకాలం తర్వాత మరొకవైపు కమ్యూనిస్టులు, వారి నుంచి చీలిన మావోయిస్టులు తమ ఉద్యమాలు తాము సాగించారు. చివరకు రాజరికం రద్దయి ప్రజాస్వామ్యం, కొత్త రాజ్యాంగం, ప్రజాస్వామిక పద్ధతి ఎన్నికలు అమలులోకి వచ్చాయి. ఇటువంటి గొప్ప నేపథ్యాలు గల పార్టీలు అధికారం సాగించినపుడు ఏవో కొన్ని వైఫల్యాలున్నా మొత్తం మీద తమ పాలన సుస్థిరంగా సాగి, తగినంత అభివృద్ధిని సాధిస్తూ, నీతిబద్ధమైన ప్రభుత్వాన్ని నడపవలసింది. కానీ అది జరగక, ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ నేపాలీ కాంగ్రెస్‌తో పాటు, అన్ని రంగుల కమ్యూనిస్టులూ దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు అంతే దారుణంగా ఓడారు.
సిద్ధాంతం ఏమిటి?
ఈ నేపథ్యమంతటిని బట్టి చూసినపుడు, నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. ఆ కొత్తదనం ఏమిటన్నది తెలియవలసిన విషయం. స్థిరత్వం ఒకటన్నది పైన చూశాము. అది కాక ముఖ్యమైనవి రెండుంటాయి. ఒకటి– ఇంతకాలం పాలించి విఫలమైన పార్టీలకు వలెనే ఆర్‌ఎస్‌పీకి గానీ, ఆ పార్టీ నాయకులు ఇద్దరికి గానీ ‘సిద్ధాంతాలు’ అనదగ్గవి ఏమైనా ఉన్నాయా? రెండు – సిద్ధాంతాల మాట అట్లుంచి పరిపాలన గురించి వారి ఆలోచనలు ఏమిటి?
ఇంతవరకు తమ సిద్ధాంతాలు ఇవీ అంటూ ఇదమిత్థంగా ఏమీ ప్రకటించలేదు. లమిఛానే 2022 నుంచి ఒక పార్టీ వ్యవస్థాపకునిగా గానీ, బాలేంద్ర షా అదే సమయం నుంచి ఖాఠ్మండు నగరానికి మేయర్‌గా గానీ, ఇద్దరూ జతకలిసిన ప్రస్తుత ఎన్నికల సమయంలో గానీ, సాధారణ రూపంలో వారి మాటలు చేతలను బట్టి మనమే ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు ఆర్‌ఎస్‌పీ ఈ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టో ఉంది. వీటన్నింటిని పరిశీలించినపుడు కలిగే అభిప్రాయం ఇద్దరు కూడా మధ్యేమార్గవాదులు.
నిర్దిష్టమైన సిద్ధాంతాలుండిన పాత పార్టీలను వాటి వైఫల్యం కారణంగా ప్రజలు తిరస్కరించటం, ఆ పార్టీల నాయకుల వలెగాక వీరిద్దరిది యువతరం కావటం వారి మధ్యేమార్గానికి కారణమనుకోవాలి. జెన్–జీ తరం, ప్రజలూ గత ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై ఆగ్రహించినందున, తమ పాలన అందుకు భిన్నంగా ఉండగలదని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనలకు వ్యతిరేకత, రాజ్యాంగం చెబుతున్నదానికి కట్టుబడటం, పారదర్శకత వంటివి అందులో కనిపిస్తాయి. అసలు పరీక్ష ఇతరత్రా ఉండబోతున్నది.
అది వారు లక్ష్యాలుగా ప్రకటించినట్లు దేశంలో ఉత్పత్తిని పెంచి జీడీపీని 50 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు చేయటం, తలసరి ఆదాయాన్ని అయిదేళ్ళలోనే 1,447 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెంచటం, 12 లక్షల ఉద్యోగాల సృష్టి, తద్వారా వలసల తగ్గింపు, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం వంటివన్నీ భారీ సవాళ్లు కానున్నాయి. దేశంలో అందుకు అవసరమైన సహజ వనరులు, పరిశ్రమలు లేక లోపలి నుంచీ బయటి నుంచీ పెట్టుబడులు పరిమితం అయి, విదేశీ సహాయ నిధులు కూడా అంతే అయినపుడు, ఈ లక్ష్యాల సాధన తేలిక కాదు. అయితే, సుస్థిరత కారణంగా పరిపాలన కూడా సమర్థంగా సాగితే ప్రభుత్వం పట్ల ఇంతవరకు లేని విశ్వాసం ఏర్పడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


