ఏఐకి రేపటి తరం సిద్ధమా? | Sakshi Guest Column On Artificial intelligence for Next generation | Sakshi
Sakshi News home page

ఏఐకి రేపటి తరం సిద్ధమా?

Mar 10 2026 12:28 AM | Updated on Mar 10 2026 12:28 AM

Sakshi Guest Column On Artificial intelligence for Next generation

విశ్లేషణ

మానవాళి ప్రగతిలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నూతన శకాన్ని ఆరంభిస్తోంది. అయితే మనుషులకు ప్రయోజనం చేకూర్చడంలో ఈ టెక్నాలజీకున్న అపారమైన సామర్థ్యాన్ని, అది సమాజానికి హాని చేయడానికి కూడా ఉన్న ప్రమాదంతో బేరీజు వేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మన సాధనాలలోని ఏఐ మోడళ్ళు ఇప్పటికే రుచి చూపిస్తున్నాయి. నా ఫోన్‌లోని ఫొటోలలో ఒక టీనేజీ అమ్మాయిని ఏఐ ‘స్వీట్‌’గా అభివర్ణించడంతో నేను ఖంగుతిన్నాను. ఫోన్‌లోని ఏఐకీ, ఆన్‌లైన్‌ మృగాడికీ  ఇంక తేడా ఏముంది? రక్షణ కంచెలు, భద్రతల అవసరాన్ని ఈ చిన్ని ఉదాహరణ చెప్పకనే చెబుతోంది. ఓ కుర్రాడి ఆత్మహత్యకు చాట్‌ జీపీటీ దారి చూపిన వైనాన్ని మరచిపోగలమా? ఇవేవో చెదురుమదురు ఘటనలు కావు. ప్యారిస్‌లో జరిగిన కడపటి ఏఐ కాన్ఫరెన్స్‌ని ‘ఏఐ సేఫ్టీ సమిట్‌’గా అందుకే పిలిచినట్లుంది. 

ఉద్యోగాల కోతపై రెండు వాదనలు
అడ్డూ ఆపులేని ఏఐ సిస్టంలు తీసుకురాగల ప్రమాదాలపై ఆందోళనలు ఇదివరకే మొదలయ్యాయి. ఏఐ అభివృద్ధిపై మారటోరియం విధించాలంటూ ఓ లాబీ తయారైంది. అలా అడిగిన వారిలో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ఇపుడు ఏఐ రేసులోకి దిగక తప్పలేదు. ఏఐ సిస్టంలు స్విచాఫ్‌కు బదులుగా మనుషులను చంపేసే అవకాశాన్ని ఎంచుకున్నాయని ల్యాబ్‌ అధ్యయనాలలో తేలింది. ప్రముఖ కంప్యూటర్‌ సైన్స్‌ నిపుణుడు స్టువర్ట్‌ రసెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ సంగతి వెల్లడించారు. కోడర్లలో చాలా మంది పురుషులే అయినందున లింగ వివక్ష ఈ సిస్టంలకు కూడా పాకిందని మహిళా నిపుణులు అన్నారు. కనుక, ఏఐ ఎకోసిస్టంని కంప్యూటర్లు, డేటా సెంటర్లు, ఎనర్జీ అవసరాలు, మోడళ్ళు–అప్లికేషన్ల వంటి పదజాలంతోనే కాక నైతిక దృక్కోణం నుంచీ వీక్షించవలసి ఉంది. 

ఉద్యోగాలు ఏమవుతాయోనని క్రమేపీ పెరుగుతున్న ఆందోళనల అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంది. ముఖ్యంగా ‘గ్లోబల్‌ సౌత్‌’ దీనిపై కలత చెందుతోంది. దీనిపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల అవసరం లేని విధంగా అంతిమంగా ఏఐ పరిణమిస్తుందన్నది వాటిలో ఒకటి. ఉద్యోగాల తీరుతెన్నులు మారతాయన్నది మరో వాదన. కొత్త టెక్నాలజీతో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమవుతాయని అంటున్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం సమయంలో అదే జరిగింది. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ రెండవ కేటగిరీలోకి వస్తారు. వ్యాల్యూ–యాడెడ్‌ సర్వీసులపై ఏఐ చూపగల ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను వారు ఇటీవలి ఢిల్లీ సమిట్‌లో తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. 

ఐటీ పరిశ్రమలోని లక్షలాది ఉద్యోగులు తక్షణ బెడదను ఎదుర్కొంటున్నారు. ఆ పరిశ్రమలోని అట్టడుగు ఉద్యోగులు చేసే పనులను ఇకపై ఏఐ సిస్టంలు చక్కబెడతాయని చెబుతున్నారు. మారుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించడం స్వల్పకాలిక పరిష్కారంగా భావించవచ్చు. దీర్ఘకాలిక సమస్య కట్టెదుటే కనిపిస్తోంది. ఏఐ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. 

ప్రాథమిక విద్య నుంచే...
ఇది ఉన్నత విద్యా రంగానికి మాత్రమే పరిమితమయ్యే సవాల్‌ కాదు. ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయులలో కూడా తగు మార్పులు చేసుకోక తప్పదు. మూడవ, నాల్గవ తరగతుల విద్యార్థులు చిన్నపాటి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వార్షిక (2024) విద్యాస్థాయి నివేదిక వెల్లడిస్తోంది. అధునాతన ఏఐ ఎకోసిస్టంతో వ్యవహరించగలిగిన విధంగా ఈ విద్యార్థులను సంసిద్ధులను చేయవలసి ఉంది. ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయులలోను ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ప్రాథమిక విద్యా ప్రమాణాలను, ఆలంబనగా నిలువవలసిన మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా తీర్చిదిద్దినప్పుడే ఆ రకమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. 

డిజిటల్‌ వ్యత్యాసాన్ని ఏఐ వ్యత్యాసంగా పరిణమించనివ్వకూడదని ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గూగుల్‌ ఛీఫ్‌ సుందర్‌ పిచాయ్‌ దాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్చరించారు. నవీకరణ, ప్రతిభా సామర్థ్యాలకు గ్లోబల్‌ కేంద్రంగా తనకున్న అనుకూలతను భారత్‌ నిలబెట్టుకుంటుందో, లేదో నిర్ణయించగల మౌలికాంశాలవి. పునాది బలంగా ఉంటేనే సౌధం నిలుస్తుంది. ప్రపంచంలోని చిప్‌ డిజైనర్లలో 20% మంది మన దేశంలోనే ఉన్నారు. సెమీకండక్టర్‌ అభివృద్ధికి ఆశావహమైన పథకాలతో అడుగు ముందుకేయడం దానివల్లనే తేలికైంది. విద్యా రంగంలో మౌలిక వసతులను సకాలంలో ఉన్నతపరిస్తేనే ఈ పోటీదాయక అడ్వాంటేజి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. 

ప్రభుత్వ పెట్టుబడులు తగ్గకూడదు!
ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నా ఇంకా మనం అమెరికా, చైనాలను అందుకునే పరుగులోనే ఉన్నామనే ఫిర్యాదు వినవస్తోంది. ఏఐలో మనం రేసులోనే ఉన్నామని ఢిల్లీ సమిట్‌ వెల్లడించింది. విదేశీ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడకుండానే పలు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ళ (ఎల్‌.ఎల్‌.ఎం.)ను మనం ఆవిష్కరించగలిగాం. ఏకంగా 22 భాషల్లో రియల్‌–టైమ్‌ స్పీచ్, డీప్‌ రీజనింగ్‌ సామర్థ్యాలతో ఆవిష్కృతమైన ‘సర్వం’ ఏఐ మోడళ్ళు అబ్బురపరచాయి. స్వయం శక్తితో ఏఐలో ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చాయి. భారత్‌ జెన్‌ మోడల్, జ్ఞాని ఏఐ, టెక్‌ మహీంద్రా, ఫ్రాక్టల్‌ ఎనలటిక్స్‌ మోడళ్ళు కూడా చెప్పుకోతగినవే. కొన్ని మోడళ్ళు ‘ఇండియా ఏఐ మిషన్‌’ ద్వారానే సాధ్యమయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా చూసినా, ఢిల్లీ సమిట్‌ ఫలవంతమైనదనే చెప్పాలి. వచ్చే రెండేళ్ళలో ఏఐ, డీప్‌టెక్‌ పెట్టుబడి కింద 200 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రిలయన్స్‌ద, అదానీ వంటి దేశీయ కంపెనీలతోపాటు, ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. 

మన ప్రభుత్వ పెట్టుబడులు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నాయి. గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అవి అందులో సగానికి తగ్గిపోయాయి. అత్యధునాతన టెక్నాలజీపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో కోత పెట్టడం నివ్వెరపరుస్తోంది. ఇది ప్రభుత్వపరంగా ఖర్చును తగ్గించుకోవాల్సిన సమయం కాదు. పెద్ద టెక్‌ కంపెనీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు వస్తే రావచ్చు. ఏఐ ఇండియా మిషన్‌ వంటి విజయ గాథల వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి కూడా నిధుల మద్దతు అవసరం. అదే సమయంలో, ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుదలకు పెట్టుబడులు అత్యావశ్యకమని దీర్ఘకాలిక దార్శనికత సూచిస్తోంది. ప్రాథమిక పాఠశాలల మౌలిక వసతులను గణనీయంగా మెరుగుపరచి తీరాలి. అప్పుడు మాత్రమే ఏఐతో రాగల సమస్యలు, ప్రమాదాలను తదుపరి తరం సమర్థంగా ఎదుర్కోగలదు. 

సుష్మా రామచంద్రన్‌
వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement