RSP
-
బాలేన్ షా పార్టీకి 182 సీట్లు
కఠ్మాండు: ఇటీవల నేపాల్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. ప్రధానమంత్రి అభ్యర్థి బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రాయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) మొత్తం 182 స్థానాలను గెలుచుకుందని ఎన్నికల కమిషన్(ఈసీ) గురువారం ప్రకటించింది. ఈ పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకంగా 125 సీట్లు రాగా, దామాషా విధానంలో జరిగిన పోలింగ్‌లో అత్యధికంగా 57 సీట్లు దక్కించుకుందని ఈసీ తెలిపింది. నేపాల్ పార్లమెంట్‌లోని 275 సీట్లకు గాను, 165 మంది సభ్యులను ప్రత్యక్షంగాను, మిగతా 110 మందిని దామాషా విధానంలోను ఎన్నుకుంటారు.ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజారిటీ 138 సీట్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1)ప్రకారం అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఆర్ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన బాలేంద్ర షా(35), అలియాస్ బాలేన్‌ను ఆర్ఎస్పీ ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం తెల్సిందే. ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 20 సీట్లు, సీపీఎన్–యూఎంఎల్‌కు 16, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ కి 9, శ్రమ్ శక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కి నాలుగు చొప్పున స్థానాలు దక్కాయి. -
అద్భుత విజయం... అనేక సవాళ్లు
నేపాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా చూసినా అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన విజయం అనాలి. అట్లాగే ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు కానున్నాయి. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు ఇంతవరకు పాలించిన పార్టీల వైఫల్యం వల్ల తీవ్ర రూపానికి వచ్చినందున, అవి సులభంగా పరిష్కారమయేవి కావని వేరే చెప్పనక్కరలేదు. కొత్త ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం ఆ దిశగా ఎట్లా పురోగమించగలదన్నదే ఇక గమనించవలసిన విషయమవుతున్నది. అందుకోసం వెంటనే కనిపిస్తున్న ఒక సానుకూల స్థితి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్.ఎస్.పి.)కి సుస్థిరమైన ఆధిక్యత లభించటం. 2008లో రాచరికం రద్దయి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ 18 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారటమనే అసాధారణ స్థితిని బట్టి దేశంలో ఎంతటి అస్థిరత కొనసాగిందో గ్రహించవచ్చు. వాస్తవానికి 3 ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్(యూఎంఎల్), మావోయిస్టు పార్టీలలో దేనికీ పూర్తి ఆధిక్యత రాకున్నా ఏ ఇద్దరో కలిసి తగిన మెజారిటీతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అటువంటప్పుడు 5 ఏళ్ళ పాటు పాలించేందుకు సమస్య ఉండకూడదు. గత 18 ఏళ్ళలో 4 ప్రభుత్వాలే రావాల్సింది. కానీ కేవలం పార్టీ నాయకుల అధికార దాహం, అవకాశవాదం, అవినీతి వల్ల ఏ ప్రభుత్వమూ సరిగా సాగలేదు. ఫలితంగా అస్థిరత అన్నది పరిపాలనా వైఫల్యాల కన్నా పెద్ద సమస్యగా మారింది. అనుభవం లేకపోయినా...ఎన్నికల ఫలితాలు కూడా జెన్–జీ తిరుగుబాటును పోలిన భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. తక్కిన మూడు పార్టీలు దశాబ్దాలుగా ఉన్నవి కాగా, ఇపుడు గెలిచిన ఆర్ఎస్పి కేవలం 2022లో ఏర్పడినట్టిది. దానిని స్థాపించిన రబీ లమిఛానే రాజకీయానుభవం ఎక్కువేమీ కాదు. గత ఎన్నికలలో సుమారు 20 సీట్లు గెలిచి కె.పి. శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయిన తను, తర్వాత బయటకు వచ్చి స్వతంత్ర రాజకీయం సాగించారు. ఆయనకు రాజకీయ నాయకునిగా కన్నా జర్నలిస్ట్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా ఎక్కువ పేరుండటం గమనించదగ్గది. తన వృత్తి పరమైన కార్యక్రమాలలో ఆయన మూడు పార్టీలను తీవ్రంగా విమర్శిస్తుండేవారు. విశేషమేమంటే, అదే పద్ధతిలో విమర్శిస్తుండిన ర్యాప్ సింగర్ బాలేంద్ర షా, రాజకీయ అనుభవం ఎంత మాత్రం లేకున్నా, ఖాఠ్మండు మేయర్ పదవికి 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 61,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంచి పనులు అనేకం చేసి ప్రజాదరణను మరింత పెంచుకుని, జెన్–జీ మద్దతుతోనే మధ్యంతర జస్టిస్ కర్కీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇదంతా చెప్పటం ఎందుకంటే, ఇంచుమించు ఒకే విధమైన నేపథ్యాలు ఉండిన, అవి కూడా కొద్ది కాలపు అనుభవంతోనే కూడుకున్నవి అయినా, లమిఛానే, బాలేంద్ర షా కలిసి పాత పార్టీలను చిత్తు చేసి గత 18 ఏళ్ల పరిస్థితికి భిన్నంగా ఇపుడు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరికీ తమ స్థానాలలో ఘనమైన మెజారిటీలు రావడం, బాలేంద్రతో పోటీ పడిన మాజీ ప్రధాని ఓలీ తీవ్ర పరాభవానికి గురి కావటమన్నది జెన్–జీ తరంతో పాటు మొత్తంగా ప్రజలలోనే నెలకొన్న ఆలోచనలకు అద్దం పడుతున్న పలు దృష్టాంతాలలో కొన్ని మాత్రమే!మట్టి కరిచిన పార్టీలకు సంబంధించి చెప్పుకోక తప్పని విశేషం మరొకటి విశేషం. నేపాలీ కాంగ్రెస్ గత శతాబ్దం మధ్య నుంచే భారతదేశంలోని కాంగ్రెస్ స్ఫూర్తితో, మద్దతుతో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం తీవ్రమైన ఉద్యమాలు సాగించింది. కొన్ని దశలలో ఆయుధాలు సైతం చేపట్టింది. కొంతకాలం తర్వాత మరొకవైపు కమ్యూనిస్టులు, వారి నుంచి చీలిన మావోయిస్టులు తమ ఉద్యమాలు తాము సాగించారు. చివరకు రాజరికం రద్దయి ప్రజాస్వామ్యం, కొత్త రాజ్యాంగం, ప్రజాస్వామిక పద్ధతి ఎన్నికలు అమలులోకి వచ్చాయి. ఇటువంటి గొప్ప నేపథ్యాలు గల పార్టీలు అధికారం సాగించినపుడు ఏవో కొన్ని వైఫల్యాలున్నా మొత్తం మీద తమ పాలన సుస్థిరంగా సాగి, తగినంత అభివృద్ధిని సాధిస్తూ, నీతిబద్ధమైన ప్రభుత్వాన్ని నడపవలసింది. కానీ అది జరగక, ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ నేపాలీ కాంగ్రెస్‌తో పాటు, అన్ని రంగుల కమ్యూనిస్టులూ దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు అంతే దారుణంగా ఓడారు. సిద్ధాంతం ఏమిటి?ఈ నేపథ్యమంతటిని బట్టి చూసినపుడు, నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. ఆ కొత్తదనం ఏమిటన్నది తెలియవలసిన విషయం. స్థిరత్వం ఒకటన్నది పైన చూశాము. అది కాక ముఖ్యమైనవి రెండుంటాయి. ఒకటి– ఇంతకాలం పాలించి విఫలమైన పార్టీలకు వలెనే ఆర్ఎస్పీకి గానీ, ఆ పార్టీ నాయకులు ఇద్దరికి గానీ ‘సిద్ధాంతాలు’ అనదగ్గవి ఏమైనా ఉన్నాయా? రెండు – సిద్ధాంతాల మాట అట్లుంచి పరిపాలన గురించి వారి ఆలోచనలు ఏమిటి? ఇంతవరకు తమ సిద్ధాంతాలు ఇవీ అంటూ ఇదమిత్థంగా ఏమీ ప్రకటించలేదు. లమిఛానే 2022 నుంచి ఒక పార్టీ వ్యవస్థాపకునిగా గానీ, బాలేంద్ర షా అదే సమయం నుంచి ఖాఠ్మండు నగరానికి మేయర్‌గా గానీ, ఇద్దరూ జతకలిసిన ప్రస్తుత ఎన్నికల సమయంలో గానీ, సాధారణ రూపంలో వారి మాటలు చేతలను బట్టి మనమే ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు ఆర్ఎస్పీ ఈ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టో ఉంది. వీటన్నింటిని పరిశీలించినపుడు కలిగే అభిప్రాయం ఇద్దరు కూడా మధ్యేమార్గవాదులు. నిర్దిష్టమైన సిద్ధాంతాలుండిన పాత పార్టీలను వాటి వైఫల్యం కారణంగా ప్రజలు తిరస్కరించటం, ఆ పార్టీల నాయకుల వలెగాక వీరిద్దరిది యువతరం కావటం వారి మధ్యేమార్గానికి కారణమనుకోవాలి. జెన్–జీ తరం, ప్రజలూ గత ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై ఆగ్రహించినందున, తమ పాలన అందుకు భిన్నంగా ఉండగలదని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనలకు వ్యతిరేకత, రాజ్యాంగం చెబుతున్నదానికి కట్టుబడటం, పారదర్శకత వంటివి అందులో కనిపిస్తాయి. అసలు పరీక్ష ఇతరత్రా ఉండబోతున్నది. అది వారు లక్ష్యాలుగా ప్రకటించినట్లు దేశంలో ఉత్పత్తిని పెంచి జీడీపీని 50 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు చేయటం, తలసరి ఆదాయాన్ని అయిదేళ్ళలోనే 1,447 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెంచటం, 12 లక్షల ఉద్యోగాల సృష్టి, తద్వారా వలసల తగ్గింపు, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం వంటివన్నీ భారీ సవాళ్లు కానున్నాయి. దేశంలో అందుకు అవసరమైన సహజ వనరులు, పరిశ్రమలు లేక లోపలి నుంచీ బయటి నుంచీ పెట్టుబడులు పరిమితం అయి, విదేశీ సహాయ నిధులు కూడా అంతే అయినపుడు, ఈ లక్ష్యాల సాధన తేలిక కాదు. అయితే, సుస్థిరత కారణంగా పరిపాలన కూడా సమర్థంగా సాగితే ప్రభుత్వం పట్ల ఇంతవరకు లేని విశ్వాసం ఏర్పడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేపాల్‌పై యువకేతనం
ఉవ్వెత్తున ఎగసిన నేపాల్ యువ తరంగంలో ఆర్నెల్లు దాటుతున్నా ఆగ్రహాగ్ని చల్లారలేదని, దాని సంకల్పం చెదరలేదని గత గురువారం నాటి పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. నేరుగా ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) 125 సొంతం చేసుకుని ప్రజాస్వామ్యంతో ఇన్నాళ్లూ చదరంగమాడిన ప్రధాన పక్షాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసింది. మరో 110 మందిని ఆ యా పార్టీలకొచ్చిన ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ పార్టీకీ తిరుగులేని మెజారిటీ ఉండరాదన్న ఆలోచనతో నేపాల్ దేశ రాజ్యాంగంలో ఈ ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని పొందుపరిచారు. తీరా ఆర్ఎస్పీ దాన్ని సైతం అధిగమించి మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. గెలుపు కోసం ప్రచార పటాటోపం, విచ్చలవిడి వ్యయం అవసరం లేదని, కేవలం హ్యాష్టాగ్లే ప్రత్యర్థులను మట్టికరిపిస్తాయని ఆర్ఎస్పీ నిరూపించింది. కీలకమైన అంశం ఏమంటే పట్టణాలు, పల్లెల వ్యత్యాసం లేకుండా అన్నిచోట్లా వామపక్షాలు, నేపాలీ కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యాయి.నేపాల్ మాదిరే శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కూడా యువత తిరగబడి పాలకులు పదవులు వదిలి పారిపోయేలా చేసింది. కానీ ఆ రెండుచోట్లా ఎన్నికల సమయానికల్లా సంప్రదాయ పక్షాలు ప్రత్యక్షమయ్యాయి. శ్రీలంకలో 1960లో ఏర్పడిన జనతా విముక్తి పెరుమున(జేవీపీ), బంగ్లాలో 1980లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) విజేతలయ్యాయి. అక్కడ ఉద్యమంలో ముందుండి పనిచేసిన యువతకు అధికారంలో చోటు దక్కలేదు. కానీ నేపాల్ పరిస్థితి వేరు. సామాజిక మాధ్యమాల నిషేధంతో ఆగ్రహించి వీధుల్లోకొచ్చిన యువతకు ఆర్ఎస్పీకి చెందిన 35 ఏళ్ల బాలేంద్ర షా, ఇతర నేతలు మార్గదర్శనం చేశారు. వారితోపాటే నడిచారు. వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చారు. పర్యవసానంగా ఈసారి ఎన్నికల్లో పార్టీల, నాయకుల కంచుకోటలు అనుకున్నవి తునాతునకలయ్యాయి. వీటన్నిటా గతానుభవం లేని యువత విజేతలయ్యారంటే సాధారణ ప్రజానీకం పాత తరంతో ఎంత విసుగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. అజేయుడనుకున్న మాజీ ప్రధాని కేపీ ఓలిశర్మ... బాలేంద్ర షా చేతిలో అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు విప్లవ వీరుడిగా నీరాజనాలందుకున్న మావోయిస్టు సెంటర్ నాయకుడు ప్రచండ అతి కష్టం మీద గట్టెక్కారు. ఆయన పార్టీకి ఒక డజను స్థానాలు మించి వచ్చే అవకాశం లేదు.అయితే ప్రధాని కాబోతున్న బాలేంద్ర షా ముందు ఎవరెస్టు శిఖరాన్ని తలపించేలా సమస్యలున్నాయి. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆర్థిక వ్యత్యాసాలు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. ఉద్యోగాలు లేక జనాభాలో మూడోవంతు మంది చిన్నా చితకా ఉద్యోగాల కోసం భారత్ సహా పలు దేశాలకు వలస పోతున్నారు. వారు ప్రతి నెలా కుటుంబాలకు పంపే డబ్బే నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. నేపాల్ జీడీపీలో ఇది 28 శాతం. జలవిద్యుదుత్పాన మినహా ఖజానా కళకళలాడటానికి తోడ్పడే సహజ వనరులు లేవు. లోటు ఆర్థిక వ్యవస్థ, అరకొర వేతనాలు నేపాల్‌కు శాపాలు. మన దేశం తోడ్పాటునిస్తే ఉపాధి కల్పనకు బాటలు పరిచే ప్రాజెక్టులు వస్తాయని యువత ఆశిస్తోంది. అందుకే కావొచ్చు... ప్రతి ఎన్నికల్లోనూ రివాజుగా కనబడే భారత వ్యతిరేకత ఈసారి దాదాపు కనుమరుగైంది. సుస్థిర పాలన వుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అది లేకపోవటమే నేపాల్ ఎదుగుదలకు ఇన్నాళ్లూ ఆటంకంగా మారింది. పాలన అంటే నిరసనోద్యమాలు నడపటమంత సులభం కాదు. ఉద్యమకారుడి గెటప్ నుంచి సమర్థ పాలకుడిగా బాలేంద్ర పరివర్తన చెందాల్సి ఉంది. అసలే కోవిడ్ మహమ్మారితో విదేశాల్లో కొలువులు కొడిగడితే, వర్తమాన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆ సమస్యను మరింత పెంచాయి. లుంబినీ వనం, ఎవరెస్టు శిఖరం ఉన్నా పర్యాటక రంగం ఎదుగుదల లేదు. ఇవన్నీ మళ్లీ పట్టాలెక్కాలంటే పారదర్శక పాలన, నిపుణుల తోడ్పాటు, ఇరుగుపొరుగు ఆపన్న హస్తం అవసరం. మూణ్ణెల్లు గడిస్తే చాలు... జనం నిలదీయటం మొదలుపెడతారు. గత పాలకుల కన్నా భిన్నమైనవాడినని నిరూపించుకోవటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించటం బాలేంద్రకు తక్షణ సవాళ్లు. -
కొనసాగుతున్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. వార్ వన్ సైడ్
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ శుక్రవారం ఉదయం మొదలైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4 గంటల వరకు వెల్లడైన ఫలితాలను బట్టి.. జెన్ జీ అభిమాన నాయకుడు, మాజీ కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా (35)కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) 46 సీట్లలో గెలుపొంది, మరో 73 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు గెలుపొంది, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ఏ విధంగా చూసుకున్నా ఆర్ఎస్పీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. 275 మంది సభ్యులు ఉండే ప్రతినిధి సభకు ఈ నెల 5న ఓటింగ్ జరిగింది. 165 స్థానాలకు నేరుగా, మరో 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్ జరిగింది. మాజీ ప్రధానిపై బలేంద్ర షా ఆధిక్యం జాపా-5 నియోజకవర్గంలో బలేంద్ర షా 55,934 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ (నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ) 10,293 ఓట్లు మాత్రమే సాధించారు. శ్రమ్ సంస్కృతి పార్టీకి చెందిన సమీర్ తమాంగ్కు 6,324 ఓట్లు పడ్డాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఆర్ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.దిగువ సభలో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 110 స్థానాలు ప్రోపోర్షనల్ రిప్రెజెంటేషన్ విధానం ద్వారా కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 138 స్థానాలు అవసరం. నేపాల్‌లో మొత్తం 1.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సుమారు 60 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. -
తృణమూల్ కాలు మోపేనా?
కాంగ్రెస్ అడ్డా అయిన పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి పోటీ ఆసక్తిదాయకంగా మారనుంది. ప్రారంభంలో లెఫ్ట్‌ఫ్రంట్‌కు చెందిన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్ఎస్పీ)కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నియోజకవర్గంలో కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఈ సీటు కోసం పట్టుదలగా కృషి చేస్తోంది. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడి ఎన్నికలు ఆసక్తిదాయకంగా మారాయి. 1951 నుంచి ఉనికిలోకి వచ్చిన ఈ నియోజకవర్గాన్ని గతంలో బెర్హంపూర్గా పిలిచేవారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న పోలింగు జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి పోటీ చేస్తోంటే, తృణమూల్ తరఫున అపూర్వ సర్కార్, బీజేపీ నుంచి కృష్ణ జార్దార్ ఆర్య బరిలో ఉన్నారు. ఆర్ఎస్పీ కూడా ఈద్ మహ్మద్‌ను పోటీకి దింపినా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ,తృణమూల్‌ల మధ్యే పోటీ ఉంది.1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఆర్ఎస్పీ 12 సార్లు, కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచాయి. గెలుపుపై ధీమా కాంగ్రెస్ అభ్యర్థి చౌధరి ఐదో సారి గెలుపుకోసం ఆశపడుతున్నారు.బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన చౌధరి 1999 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు.సంప్రదాయకంగా ఇది కాంగ్రెస్‌దే కాబట్టి తన గెలుపు సునాయాసమేనని ఆయన నమ్ముతున్నారు.2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లను కాంగ్రెసే గెలుచుకుంది.ఓటర్లలో సగం మైనారిటీలే ఉండటం, వారంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కావడం, బీజేపీ అభ్యర్థి శక్తిమంతుడు కాకపోవడం,కాంగ్రెస్‌లో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమయినప్పటికీ సీపీఎం ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకపోవడం మొదలైవని కాంగ్రెస్‌కు అనుకూలించే అంశాలు. పుంజుకున్న తృణమూల్ 2016 తర్వాత నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ బలం పుంజుకుంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చింది. దాని ఫలితంగా గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్‌లు, అన్ని మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ బలానికి గండి కొట్టింది.కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహా డజన్ల మంది కార్యకర్తలు తృణమూల్ తీర్ధం పుచ్చుకోవడం ఆ పార్టీకి నైతికంగా బలాన్నిచ్చింది.దీంతో ఈ సారి నియోజకవర్గంలో పాగా వేయగలమని తృణమూల్ గట్టిగా నమ్ముతోంది. బీజేపీ పోటీ ఇచ్చేనా... బెంగాల్లో దీదీ హవాకు అడ్డుకట్ట వేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ ఈ నియోజకవర్గంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి కృష్ణ జార్దార్ ఆర్యను బరిలో దింపింది. గత ఎన్నికల్లో దేశమంతా మోదీ హవా నడిచినా బెంగాల్లో మాత్రం ఆ పార్టీ కేవలం రెండు లోక్‌సభ సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.ఈ ఎన్నికలకు ముందు కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం మమతా బెనర్జీకే లాభించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 1999 నుంచి ఇక్కడ పాతుకుపోయిన కాంగ్రెస్‌ను, రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారిన తృణమూల్‌ను ఎదుర్కోవడం బీజేపీకీ అంత సులభం కాదని వారి అంచనా. -
'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం'
షిరిడి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది తమ పార్టీ డిసైడ్ చేస్తుందని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆరెస్పీ) చీఫ్ మహదేవ్ జనకర్ వ్యాఖ్యానించారు. షిరిడిలోని ప్రఖ్యాత సాయి ఆలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఆరెస్పీ కచ్చితంగా 25కు పైగా సీట్లును కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.సీఎంగా దేవెంద్ర ఫడ్నవీస్ ఉంటారా, లేక ఉద్దవ్ ఠాక్రే ఆ స్థానంలోకి వస్తారా అన్నది తమ పార్టీ ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. సీఎం సీటుని తామ పార్టీ నిర్ణయించబోతుందని పేర్కొంటూనే ప్రస్తుత ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసించారు. రాజుకు సామర్థ్యం ఉన్నట్టయితే గుర్రాన్ని ఎలాగైనా పరుగెత్తించగలడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ సుప్రియ సులేను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం 28,000 కోట్లు కేటాయింపులు జరిగాయని అయితే, అధికారులకు-మంత్రులకు మధ్య సమన్వయలోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. -
రాజకీయ పార్టీగా ఆర్ఎస్పీ
రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు సాక్షి, హైద రాబాద్: రాష్ట్ర రాజకీయ పార్టీగా రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(ఆర్ఎస్పీ)ని గుర్తిస్తూ ఎన్నికల సంఘం రిజిష్టర్ చేసింది. ఎన్నికల గుర్తుగా స్పేడ్ అండ్ స్టోకర్(పారా, షావెల్)ను కేటాయించింది. తమ పార్టీ కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిందని, తెలంగాణలోనూ గుర్తింపు నివ్వాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొ. టీజే చంద్రచూడన్ దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ర్టంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీ బలపరిచే అభ్యర్థులకు పారా, షావెల్ గుర్తు కేటాయించేందుకు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు హర్షం వ్యక్తంచేశారు.


