తృణమూల్‌ కాలు మోపేనా?

triangular fight in Berhampore lok sabha - Sakshi

బహరంపూర్‌

కాంగ్రెస్‌ అడ్డా అయిన పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి పోటీ ఆసక్తిదాయకంగా మారనుంది. ప్రారంభంలో లెఫ్ట్‌ఫ్రంట్‌కు చెందిన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్‌పీ)కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పాగా వేసింది. ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గంలో కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఈ సీటు కోసం పట్టుదలగా కృషి చేస్తోంది. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడి ఎన్నికలు ఆసక్తిదాయకంగా మారాయి. 1951 నుంచి ఉనికిలోకి వచ్చిన ఈ నియోజకవర్గాన్ని గతంలో బెర్హంపూర్‌గా పిలిచేవారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 29న పోలింగు జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరి పోటీ చేస్తోంటే, తృణమూల్‌ తరఫున అపూర్వ సర్కార్, బీజేపీ నుంచి కృష్ణ జార్దార్‌ ఆర్య బరిలో ఉన్నారు. ఆర్‌ఎస్పీ కూడా ఈద్‌ మహ్మద్‌ను పోటీకి దింపినా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ,తృణమూల్‌ల మధ్యే పోటీ ఉంది.1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ 12 సార్లు, కాంగ్రెస్‌ ఐదుసార్లు గెలిచాయి.

గెలుపుపై ధీమా
కాంగ్రెస్‌ అభ్యర్థి చౌధరి ఐదో సారి గెలుపుకోసం ఆశపడుతున్నారు.బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన చౌధరి 1999 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు.సంప్రదాయకంగా ఇది కాంగ్రెస్‌దే కాబట్టి తన గెలుపు సునాయాసమేనని ఆయన నమ్ముతున్నారు.2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లను కాంగ్రెసే గెలుచుకుంది.ఓటర్లలో సగం మైనారిటీలే ఉండటం, వారంతా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కావడం, బీజేపీ అభ్యర్థి శక్తిమంతుడు కాకపోవడం,కాంగ్రెస్‌లో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమయినప్పటికీ సీపీఎం ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకపోవడం మొదలైవని కాంగ్రెస్‌కు అనుకూలించే అంశాలు.  

పుంజుకున్న తృణమూల్‌
2016 తర్వాత నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ బలం పుంజుకుంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చింది. దాని ఫలితంగా గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్‌లు, అన్ని మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్‌ బలానికి గండి కొట్టింది.కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహా డజన్ల మంది కార్యకర్తలు తృణమూల్‌ తీర్ధం పుచ్చుకోవడం ఆ పార్టీకి నైతికంగా బలాన్నిచ్చింది.దీంతో ఈ సారి నియోజకవర్గంలో పాగా వేయగలమని తృణమూల్‌ గట్టిగా నమ్ముతోంది.

బీజేపీ పోటీ ఇచ్చేనా...
బెంగాల్‌లో దీదీ హవాకు అడ్డుకట్ట వేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ ఈ నియోజకవర్గంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి కృష్ణ జార్దార్‌ ఆర్యను బరిలో దింపింది. గత ఎన్నికల్లో దేశమంతా మోదీ హవా నడిచినా బెంగాల్‌లో మాత్రం ఆ పార్టీ కేవలం రెండు లోక్‌సభ సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.ఈ ఎన్నికలకు ముందు కేంద్రం, బెంగాల్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం మమతా బెనర్జీకే లాభించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 1999 నుంచి ఇక్కడ పాతుకుపోయిన కాంగ్రెస్‌ను, రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారిన తృణమూల్‌ను ఎదుర్కోవడం బీజేపీకీ అంత సులభం కాదని వారి అంచనా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top