మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) రాయని డైరీ | Mayawati BSP president Rayani diary | Sakshi
Sakshi News home page

మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) రాయని డైరీ

Mar 15 2026 12:51 AM | Updated on Mar 15 2026 12:51 AM

Mayawati BSP president Rayani diary

మాధవ్‌ శింగరాజు

ఒంటికి ‘నీలి’ రంగును పులుముకున్నంత మాత్రాన ‘అసలు రంగు’ దాగుతుందా?! గొంతుకు ఘీంకారాన్ని మెడలో గంటలా తగిలించుకుంటే మాత్రం ఏనుగు నడిచి వెళుతున్నట్లుగా ఉంటుందా?! సడి లేని పిడికిలి పూరించే బహుజన సమైక్య శంఖారావం దిక్కులను దద్దరిల్లిస్తుందా?! పెళ్లిళ్లకు ఫంక్షన్‌  హాళ్లను ముందే బుక్‌ చేసుకున్నట్లుగా, పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కాన్షీజీని మెల్లిగా ‘ఓన్‌ ’ చేసుకుంటున్నాయి!! కాంగ్రెస్‌ ‘సామాజిక పరివర్తన్‌  దివస్‌’ జరుపుతోంది. సమాజ్‌వాదీ ‘పిచ్డా దళిత్‌ అల్ప్‌సంఖ్యాక్‌ దివస్‌’ అంటోంది. బీజేపీ కాన్షీజీ విగ్రహాలకు పూలదండలు వేసి, రోడ్‌ షోలు ఇచ్చేందుకు తయారైంది! 
లక్నో వీధుల్లో ఎవరెన్ని షోలు చేసినా, ర్యాలీలు తీసినా మాన్యవర్‌ కాన్షీ రామ్‌జీ కి ఎవరూ వారసులు అవలేరు. బహుజనుల బంధు మిత్రులు అసలే కాలేరు. 

కాన్షీజీ వెళ్లి ఇరవై ఏళ్లు! నేటికీ ఆయన స్వరం వింటున్నట్లే ఉంటుంది నాకు! అది గర్జన కాదు. గాండ్రింపు కాదు. ధరామండల జ్వాలారవం! నిన్న – నేడు – రేపు అనేవే ఉండని అనంత జీవన ఝరి. ఆకాశమే ఎందుకు ఉరమాలి అనేవారు కాన్షీజీ! భూమిపైన ఉన్న ప్రతి అట్టడుగు మనిషీ ఆకాశం వైపు ఉరిమి చూడాలి అని ఆకాంక్షించేవారు. ‘‘ధ్వనికి ప్రతిధ్వని అవొద్దు, ధ్వనిని మింగేసే మహాధ్వనివి నువ్వు’’ అనేవారు.

‘‘అధికారానికి మాస్టర్‌ ‘కీ’ ఢిల్లీ డ్రాయింగ్‌ రూమ్‌లలో ఉండదు, అది బండబారిన బహుజనుల చేతుల్లో ఉంటుంది...’’ అని చెప్పేవారు. ‘‘ఎవరూ మనల్ని ఏదీ అవనివ్వరు మాయావతీ! చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మనకై మనమే ఫస్ట్‌ బెంచీలోకి వచ్చి కూర్చోవాలి...’’ అనేవారు!! పార్టీని పెట్టకముందే కాన్షీజీ నన్ను ఫస్ట్‌ బెంచ్‌లోకి తెచ్చేశారు. ఆ రోజు – ఢిల్లీలో, ఇందర్‌పుర్‌లోని మా ఇంటిని వెతుక్కుంటూ ఆయన వచ్చినప్పుడు, నా పుస్తకాల గుట్టల్లోంచి తలెత్తి మొదటిసారిగా నేను ఆయన్ని చూశాను.

‘‘అమ్మాయీ... నా పేరు కాన్షీరామ్‌. యూనియన్‌  హెల్త్‌ మినిస్టర్‌ రాజ్‌ నారాయణ్‌ అంతటివారితోనే కాన్‌ స్టిట్యూషన్‌  క్లబ్‌లో వాదించావట కదా! మాతో కలుస్తావా? దళిత ఉద్యమానికి నీ ఆవేశం, నీ మాటల ప్రవాహం అవసరం...’’ అన్నారు! ‘‘కానీ కాన్షీ రామ్‌జీ! శ్రీ రాజ్‌ నారాయణ్‌తో నేను వాదించలేదు. దళితులను ఆయన గౌరవంగా ‘హరిజనులు’ అనటం పైన మాత్రమే నా అభ్యంతరం తెలిపాను. ‘దళితులను దళితులు అనే అనండి, అదే మీరు వారికిచ్చే గౌరవం’ అన్నాను. ఆ రోజు ఆడియెన్స్‌లో మీరున్నా అదే మాట అని ఉండేవారు కాన్షీజీ. అంబేద్కర్‌ కూడా ‘దళితులు’ అనే అన్నారు తప్పితే, మృదువుగా ‘హరిజనులు’ అనలేదు కదా...’’ అని నేను అన్నాను.  

కాన్షీజీ కళ్లు మెరిశాయి. ‘‘నువ్వు మాతో ఉంటే బాగుంటుంది అమ్మాయీ...’’ అని మళ్లీ అన్నారు. ‘‘నేను ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను కాన్షీజీ. ఐఏఎస్‌ ఆఫీసర్‌ని అవాలి’’ అన్నాను. ‘‘మంచి విషయమే అనుకో! కానీ, ఒక ఐఏఎస్‌ కాదు, మొత్తం ఐఏఎస్‌లంతా నీ ఆదేశాల కోసం వరుసలో నిలబడేంత పెద్ద నాయకురాలిని చేస్తాను నిన్ను... మాతో వస్తావా...’’ అన్నారాయన! ఆ మాట నాకు ఇన్‌ స్పైరింగ్‌గా అనిపించింది. ఒకవేళ ఆయన, ‘‘పెద్ద నాయకు రాలు అవటం ఏముంది? పెద్ద నాయకురాలి ఆదేశాల కోసం వరుసలో నిలబడే ఐఏఎస్‌లలో ఒకరిగా ఉండటమే గొప్ప...’’ అని అన్నా కూడా ఆ మాట నాకు ఇన్‌ స్పైరింగ్‌గానే ఉండేది. కాన్షీజీ మాటల్లోని అదను, పదును అది! ఇవాళ కాన్షీజీ జయంతి! మిగతా పార్టీల్లా, కాన్షీజీ జయంతి రోజు మాత్రమే బహుజన్‌ సమాజ్‌ పార్టీకి సూర్యోదయం నీలి వర్ణంలో అవదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement