బాల్యం అంత బాధలమయం, చెప్పుకోదగ్గ సంతోషభరిత విషయాలేం లేవు. పోనీ వైవాహిక బంధమైన బాగుంటుందా అనుకుంటే..అది కూడా వెక్కింరించింది. ఏం పాలుపోలేని స్థితిలో నేనున్నానంటూ అక్కున్న చేర్చుకున్న ప్రేమ బంధం నరకాన్ని చవిచూపించి..తేరుకునేలోపే చేతిలో బిడ్డను పెట్టేసింది. నా వల్ల కాదంటూ పసికందుతో దేశం కానీ దేశంలో వలసదారిగా బిక్కు బిక్కుమంటూ కారునే నివాసంగా చేసుకుని గడిపింది. లోలోన.. ఏదో కసి, ఏదో బాధ..అదే ఆమెను మొండి ధైర్యంతో ముందుకు నడిపించి.. ఏకంగా 9 కోట్ల కంపెనీని రన్‌చేసే రేంజ్‌కి తీసుకొచ్చింది. దురదృష్టవంతురాలివి అని పదే పదే అంటున్న అంతరాత్మ మాటల్ని బేఖాతారు చేస్తూ తన సక్సెస్‌తో అదృష్టవంతురాలిని అని నిరూపించుకుని అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఎమరామె..? ఏమా కథ..
అసామాన్య ధీరురాలు వియాత్నంకి చెందిన జియా హుయిన్. ఆమె కడు దయనీయమైన స్థితిని నుంచి కోట్లకు పడగలెత్తే రేంజ్‌కు చేరుకున్న తన ప్రస్థానం గురించి ఓ ఇంటర్వూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. 20 ఏళ్ల ప్రాయంలో అమెరికాకు వచ్చానని, వారానికి ఏడు రోజులు పాటు ఉదయ నుంచి రాత్రి వరకు దాదాపు 14 గంటల పాటు ఒక నెయిల్ సెలూన్‌లో పనిచేనినట్లు తెలిపింది.
అమెరికాలో నిరాశ్రయురాలైన వలసదారిగా చేతిలో బిడ్డతో ఆ సెలూన్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని అని బాధగా చెప్పింది. ఇక తన బాల్యం అంతా కష్టాలు, వేధింపులేనని వేదనగా చెప్పుకొచ్చింది. తన తండ్రి వెదురు కలప నరికి అమ్మడానికి అడవిలోకి వెళ్లేవాడని, నిజంగా ఎప్పుడొస్తారో తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు, అమ్మ మాకు తిండి పెట్టడానికి తన వల్ల అయ్యే ప్రతి పనిచేసేదని చెప్పుకొచ్చారు.
తన బాల్యం చాలా బాధలమయం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టీనేజ్ వయసుకే పెళ్లి చేసుకుని 2016లో వియత్నాం నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాం, దాంతో తాను కూడా చేతనైనిది చేస్తూ సంపాదించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే అదంతా తమ కుటుంబం అవసరాలకు అక్కరకు వచ్చేది కాదని నాటి సంఘటనలను గుర్తు చేసుకుందామె.
ఇక తన భర్త తనకు విడాకులు ఇచ్చేయడంతో రోడ్డుపై పడిపోయానని, అప్పుడే ఒకవ్యక్తి అక్కున చేరుకుంటానంటూ ప్రేమను చూపిస్తే పిచ్చిదానిలా నమ్మేశానని బావురమంది. తీరా అతడి వద్దకు వెళ్లాక నరకం అంటే తెలిసిందని వాపోయింది. నిజంగా ఆ రిలేషన్ ఒక నరకకూపం అని బాధగా చెప్పిందామె. ఆ వ్యక్తితో తనకు కొడుకు పుట్టగానే..ఐదువారాల శిశువుని తీసుకుని బయటకు వచ్చేసి నిరాశ్రయురాలైన వలసదారిగా మళ్లీ రోడ్డునపడ్డానంటూ గద్గద హృదయంతో చెప్పుకొచ్చింది నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని.
తాను కొనుకున్న కారునే నివాసంగా చేసుకుని కొడుకుతో కలిసి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన సోదరి నెయిల్ సెలూన్‌లో ఉద్యోగంలో చేరి..మంచి జీవితాన్ని సృష్టించుకోవాలని తపన పడినట్లు చెప్పుకొచ్చింది.
ఈ రేంజ్‌కి ఎలా చేరుకుందంటే..
నెయిల్ సెలూన్‌లో ఉద్యోగం చేస్తూనే, తన కొడుకును చూసుకుంటూ, జియా వివిధ వ్యాపార ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూనే ఉండేది. ప్రారంభంలో వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తన క్రిస్టల్ క్యాండీల వ్యాపార ఆలోచన మాత్రం విజయవంతమైంది. అలా రూ. కోట్లు టర్నోవర్ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ క్యాండీ గురించి ఆమెకు ఎలా తెలిసిందటే..సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది. అయితే ఈ క్యాండీ తన చిన్నప్పుడు నానమ్మతో కలిసి ఇంట్లో తయారు చేసిందే కావడంతో..దీన్నే మళ్లీ పిల్లలకు పరిచయం చేయాలనుకుంది.
దాంతో దాని తయారీపై రకరకాలుగా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. అందుకోసం రూ. 40 వేలు ఖర్చు చేసి..మరి ప్రయోగాలు చేసిది. అంతేగాదు ఈ వంట ప్రయోగాలను నెయిల్ సెలూన్ నుంచి తిరిగి వచ్చి..బిడ్డను నిద్రపుచ్చాక చేస్తుండేది. మొదటి మూడు నెలలు చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత రానురాను వ్యాపారం పుంజుకోవడం లాభాలు అందుకోవడం మొదలైంది. అలా ఇవాళ ఏకంగా రూ. 9 కోట్లు టర్నోవర్ చేసే క్రిస్టల్ క్యాండీ కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకోగలిగానని అంటోంది.
ఈ విజయంతో అప్పటి వరకు తనపై తనకు ఉన్న అభిప్రాయం నిజంగా మారిందని అంటోంది. ఎందుకంటే తాను చూసిన కష్టాలు, అనుభవించిన బాధలకు తనంత పనికిమాలినిది, నిరుపయోగమైనది మరొకరు ఉండరనే భావన బలంగా ఉండేదట ఆమెకు. కనీసం తన వద్ద స్కిల్స్ లేవు, చదువు లేదు..కేవలం తన కష్టాలే తనలోని సామర్థ్యాన్ని తట్టిలేపి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటోంది జియా.
ఐదో తరగతి కూడా చదవని తానే సాధించగలిగానంటే..బాగా చదువుకున్న యువత ఇంకెంత సాధించాలి అని అడుగుతోందామె. అంతేగాదు మన వద్ద చదువు, నైపుణ్యం లేకపోయినా..మనసుపెట్టి నేర్చుకుంటే..ఏదైనా ఇట్టే నేర్చుకుని సక్సెస్ అందుకోగలమని చెబుతోంది జియా.
(చదవండి: రెస్టారెంట్ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..)


