సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి సావ్జీ డోలకియా అనగానే అందరికీ గుర్తు వచ్చేది ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం. ఖరీదైన కార్లు ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన బహుమతులతో కేవం తన ఉద్యోగులను మాత్రమే కాదుయావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. కానీ ఇలా ఖరీదైన బహుమతులు వచ్చేంత స్థాయికి రావడానికి వెనుక ఉన్న కృషిని గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి డైమండ్ సామ్రాజ్యాన్ని నిర్మించి, సావ్జీభాయ్‌గా పేరు గడించిన హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఛైర్మన్, సావ్జీ ధోలాకియా సక్సెస్ గురించి తెలుసుకుందాం.
గుజరాత్‌లోని దుధాల గ్రామానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు సావ్జీ ధోలాకియా. కుటుంబ ఆర్థిక పరిస్తితుల కారణంగా 5వ తరగతిలోనే చదువు ఆపేశారు. అంతేకాదు 1977లో కేవలం 13 ఏళ్ల వయసులోనే , జేబులో 12 రూపాయలు 50 పైసలు (బస్సు టికెట్‌కు సరిపోయే) సూరత్ నగరానికి పయనమయ్యాడు. అప్పటికి ఆయన మనసులో ఉన్నది కుటుంబానికి పోషించుకోవడం మాత్రమే.
ఆలా సూరత్ నగరంలో తొలి ఉద్యోగం వజ్రాల కర్మాగారంలో. నెలకు రూ.179 రూపాయల జీతం. ఈ కొద్ది పాటి జీతంలోంచే ఆయన ప్రతి నెలా రూ. 39 పొదుపు చేసేవాడు. 1984లో తనకంటూ ఏదైనా సాధించాలనే కల మొదలైంది. ఈ కల సాకారానికి పట్టుదల ఓర్పుతోడైంది. తన సోదరులతో కలిసి, అతను ‘హరి కృష్ణ ఎక్స్‌పోర్టర్స్’ అనే చిన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వజ్రాల వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది, పైగా పోటీ. దీంతో మొదట్లో వ్యాపారం చాలా కష్టమయ్యేది. కానీ ప్రజలపై సావ్జీభాయ్‌కి నమ్మకం వమ్ముకాలేదు. దీనికి తోడు ఉద్యోగులకు కార్మికుల్లాగా కుండా, తన ఇంట్లో మనుషుల్లాగా చూసుకునవాడు. అటు ఉద్యోగుల మనసుల్లోనూ, ఇటు వ్యాపారంలోనే అందనంత ఎత్తుకు ఎదిగాడు.
ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వడం మాత్రమే కాదు, ఖరీదైన దీపావళి కానుకలిస్తూ సావ్జీభాయ్ ధోలాకియా వార్తల్లో నిలిచారు. ఆయన నమ్మింది ఒకటే. తన ఉద్యోగులకు బావుంటే.. కంపెనీ బావుంటుంది..వారి అభివృద్దే తన వ్యాపారం అభివృద్ధి అని. అదే నమ్మకం నేటికీ కొనసాగుతోంది. 2025లో కూడా 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన మూడు బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ GLS SUVలను కానుకగా ఇచ్చాడు. పాతికేళ్ళనుంచి తన కంపెనీలో సేవలందిస్తున్న నమ్మకమైన జట్టు సభ్యులు, ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చాడు. సావ్జీభాయి దృష్టిలో ఇటువంటి బహుమతులు అంటూ దుబారా కాదు, జీవితాంతం కలిసి చేసిన కృషికి, విజయానికి హృదయపూర్వక 'ధన్యవాదాలు'అంటారాయన.
ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ఈ ప్రత్యేకమైన లక్షణమే ఒక చిన్న వర్క్‌షాప్‌గా మొదలైన ఆయన కంపెనీ ప్రపంచ వజ్రాల శక్తి కేంద్రంగా నిలిపింది. ఆభరణాల బ్రాండ్ 'కిస్నా వ్యాపారం ఇప్పుడు రూ. 12,000 కోట్లకు పైమాటే.. 2022లో, భారత ప్రభుత్వం సావ్జీభాయ్ ధోలాకియాను గుజరాత్‌లో సామాజిక సేవలో ఆయన చేసిన విశిష్ట సేవకు గాను దేశంలోని అత్యున్నత పౌర అవార్డులలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. బిలియనీర్ ,పద్మశ్రీ అవార్డు గ్రహీత సావ్జీభాయ్ ఇప్పటికీ చాలా సాదా సీదాగా ఉండే వ్యక్తి.
ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
ధోలాకియా 1996లో హరి కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాన్నే ధోలాకియా ఫౌండేషన్ అని పిలుస్తారు. దీని ద్వారా అనేక కార్యక్రమాలతోపాటు, చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం , భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం కోట్లు ఖర్చు చేయడం విశేషం. మొక్కవోని పట్టుదల, అచంలమైన విశ్వాసంతో సాగిన ఆయన జీవితం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నారు.


