కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం డీకేను ప్రమోట్ చేయాలనుకుంటే సిద్ధరామయ్య ‘ ప్లాన్’ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.
సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే శివకుమార్,ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ ఇది అంత తేలిగ్గా పరిష్కారమవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జోక్యం తరువాత అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య కట్టుబడి ఉండాలని ప్రకటించి నప్పటికీ ఈ పొలిటికల్ డ్రామాకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు.
ఒక వేళ ఉప ముఖ్యమంత్రి డీకేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, సిద్ధరామయ్య శిబిరం ఆయన్ను పదవిలో కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడానికి సకల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బహిరంగంగా డీకే వైపే మొగ్గుచూపుతున్నారని సిద్ధరామయ్య మద్దతుదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరసనకు సిద్ధంగా ఉన్నారు.
పార్టీ ఇంకా కొత్త ముఖ్యమంత్రి కోసం పట్టుబడుతుంటే, వారికి ప్రత్యామ్నాయ జాబితాను అందజేయ నున్నారట. అందులో ఒకటి సిద్ధరామయ్య మద్దతుదారుడు, దళిత నాయకుడు హోంమంత్రి జి. పరమేశ్వర కావచ్చని అంచనా. ఈ సందర్భంగా తానెప్పుడూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్న వ్యాఖ్యలు గమనించ దగ్గవి. దీనిపై సిద్ధరామయ్య విధేయుడు, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోలి నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఖర్గే, గాంధీలో డిసెంబరు 1 నాటికి దీనిపై ఒక నిర్ణయం ప్రకటించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
ఎవరి పంతం నెగ్గుతుంది?
మరోవైపు సిద్ధరామయ్య తన అధికారాన్ని మరింత బలపర్చుకునేందుంకు తన మంత్రివ ర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా యోచిస్తున్నారట. ఆయన ఎమ్మెల్యేల మద్దతు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఈ నేపథ్యంలోసిద్ధరామయ్య గెలుస్తారా లేదా డికె శివకుమార్ తను కోరుకున్నది సాధిస్తారా? 2028లో తదుపరి ఎన్నికల వరకూ దీన్ని సర్దు బాటు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
కాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుండి అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానంపై పట్టు పెంచుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ ఉత్కంఠకు ఎలా తెరదించుతుందో వేచి చూడాలి.


