సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో సీఎం పదవి మార్పులపై వస్తున్న వదంతుల్ని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖండించారు. సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్‌నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని తెలిపారు. లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో నవంబర్ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని తెలిపారు.
‘మేము ఎప్పటినుంచో చెబుతున్నాం. శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి, కానీ సిద్దరామయ్య తర్వాత మాత్రమే. అదే మా డిమాండ్’. కాంగ్రెస్ అనేది శివకుమార్ రక్తంలో కాంగ్రెస్ ఉంది. మాలో చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చాం. కానీ ఆయన రక్తంలో కాంగ్రెస్ ఉంది. రక్తాన్ని మార్చలేం’ అని అన్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి వస్తున్న వదంతులను ఖండిస్తూ జమీర్ స్పందించారు. ‘నవంబర్ విప్లవం, డిసెంబర్ విప్లవం, ఇప్పుడు జనవరి సంక్రాంతి అని చెప్పిన వారు అర్థం చేసుకోవాలి. ఏమీ జరగదు. హైకమాండ్ సిద్దరామయ్యతోనే ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తం మీద, కోలార్‌లో జమీర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు,అధిష్టానం వద్ద సిద్దరామయ్య, శివకుమార్ నాయకత్వంపై స్పష్టత ఇచ్చినట్లైంది.


