బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఠాక్రే కుటుంబానికి ఎదురులేదన్నారు. ప్రస్తుతం మరాఠీల గౌరవం కోసమే ఠాక్రే సోదరిలిద్దరూ కలిసి ప్రచారానికి వచ్చారన్నారు. మహానగరంలో శివసేన పట్టు ఇప్పటికీ సడలేదని ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైనగరం మూసివేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతేడాది మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలిద్దరూ 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కలిశారు. అనంతరం ముంబై మహానగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో శివసేన (ఠాక్రే), మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముంబై నగరంలో ఠాక్రేలు ఎప్పుడు ఓడిపోలేదు. వారు తలుచుకుంటే ముంబైని 10 నిమిషాల్లో స్తంబింపచేయగలరు. ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలిద్దరూ అన్నదమ్ములూ వారు మళ్లీ కలవడం అదృష్టం" అన్నారు. వారిద్దరి మధ్య విబేధాలున్నప్పటికీ దేశం కోసం ఏకమయ్యారని తెలిపారు.
"ఠాక్రేలు అంటే ఒక బ్రాండ్ వారు ఉంటేనే మరాఠాల గౌరవం బ్రతికుంటుంది. ఉద్దవ్, రాజే ఒకరే, మేయర్ మనవారే" అని రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. "ఒకవేళ బాల్‌ఠాక్రే బతికి ఉంటే ఇది సాధ్యమయ్యేది.కానీ వీరివల్ల కాదు ఏక్ నాథ్ శిండేని ముంబైలో అడుగుపెట్టనివ్వమన్నారు. కానీ 50మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు" అని ఠాక్రే సోదరులను ఫడ్నవీస్ దుయ్యబట్టారు.


