మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేల వైరుధ్యాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రేపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్ ఠాక్రేలతో ఎవరితో పనిచేయడం తేలిక అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవీస్ బదులిస్తూ ఉద్దవ్‌తో పని చేయడం చాలా టఫ్ జాబ్ అన్నారు.
మహారాష్ట్రలో త్వరలో బృహత్ ముంబై మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరంలో జరిగే ఎన్నికలు కావడంతో వీటిని అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా శివసేన ( యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే గురించి ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫడ్నవీస్ మాట్లాడుతూ" శిండేతో వ్యవహారం చాలా తేలిక ఎందుకంటే ఆయన ఎమోషనల్ వ్యక్తి, నేను కూడా ఎమోషనల్ వక్తినే కనుక ఇది జరుగుతుంది. భావోద్వేగంతో అర్థం చేసుకుంటే శిండేతో వ్యవహారం చాలా సులభం. అయితే ఆయన కంటే నేను ఎక్కువ ప్రాక్టికల్ వ్యక్తిని, అదే ఉద్దవ్ ఠాక్రే విషయానికోస్తే ఆయన ఎవరికీ అర్థం కారు. ఆయనను అర్థం చేసుకోవాలంటే ఒక స్కాలర్‌ని అపాయింట్ చేసుకోవాలి. అందుకే ఆయనతో వ్యవహారం చాలా కష్టమైన పని" అని ఫడ్నవీస్ అన్నారు.
ప్రస్తుతం తమ ఎన్డీయే అలయెన్స్‌లో ఎటువంటి విభేదాలు లేవని స్థిరంగా ఉందని వచ్చే ఐదేళ్లతో పాటు దాని తర్వాత కూడా కలిసే తాము కలిసే ఉంటామని ఫడ్నవీస్ అన్నారు. 2019కి ముందు శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. 2019లో ఎన్డీఏ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం 2022లో శివసేన నేత ఏక్ నాథ్ శిండే పార్టీని చీల్చి బీజేపీతో జతకట్టి సీఎం అయ్యారు. 2023లో అసలైన శివసేన ఏక్‌నాథ్ శిండేదేనని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.


